PV Narasimha Rao - The forgotten leader

PV Narasimha Rao - The forgotten leader

PV Narasimha Rao - The forgotten leader

భారతదేశంలోకి నూతన ఆర్ధిక సంస్కరణలు ప్రవేశించి పాతికేళ్ళు పూర్తయ్యాయి. కొత్తతరానికి ఏమాత్రం తెలియని మార్పులెన్నో సాంఘిక, ఆర్ధిక పరిస్థితుల్లోకి చొచ్చుకు వచ్చాయి. మధ్యతరగతి జీవితాలని విశేషంగా ప్రభావితం చేసిన సాఫ్ట్వేర్ రంగం ఊపందుకోవడం మొదలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రజా జీవితంలో ఓ భాగమవ్వడం వరకూ జరిగిన అనేక పరిణామాలకి మూల కారణం ఆర్ధిక సంస్కరణలే. రాజీవ్ గాంధీ మరణానంతరం కాంగ్రెస్ సారధ్యంలోని మైనారిటీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన తెలుగు నాయకుడు పీవీ నరసింహారావు తీసుకున్న కీలక నిర్ణయాల ఫలితమే ఈ ఆర్ధిక సంస్కరణలు.కేవలం సోనియా గాంధీ పట్ల తగినంత విశ్వాసం ప్రదర్శించలేదు అనే కారణానికి కాంగ్రెస్ పార్టీ పీవీ ని పార్టీ చరిత్రనుంచి తొలగించేసి సంస్కరణల సారధిగా నాటి ఆర్ధిక మంత్రి మన్మోహన్ సింగ్ ని కీర్తిస్తుండగా, ఆర్ధిక సంస్కరణల పర్వానికి నాడు అడుగడుగునా మోకాలడ్డిన వామపక్ష పార్టీల నాయకులు నేడు ఆవేళ ఆ పదవిలో ఎవరున్నా తీసుకునే నిర్ణయాన్నే పీవీ తీసుకున్నారు కాబట్టి అదేమీ పెద్ద విషయం కాదని తేల్చేస్తున్నారు. ఇక రాష్ట్ర స్థాయిలో నాయకులైతే సంస్కరణల తాలూకు ఫలితాలన్నీ తమ ఘనతే అని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు.

మరి, పీవీ ఆనాడు చేసిన కృషి, ఎదుర్కొన్న ఒత్తిళ్లు, ప్రదర్శించిన రాజనీతి ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోవలసినవేనా? ఈ ప్రశ్నకి 'కాదు' అని సమాధానం ఇస్తోంది 'నరసింహుడు.'పాత్రికేయుడు, న్యాయవాది, రాజకీయ శాస్త్రవేత్త వినయ్ సీతాపతి ఆంగ్లంలో రాసిన 'ది హాఫ్ లయన్' పుస్తకానికి సీనియర్ పాత్రికేయులు జి. వల్లీశ్వర్, టంకశాల అశోక్, కేబీ గోపాలం కలిసి చేసిన తెలుగు అనువాదమే 'నరసింహుడు.' 'ఇప్పటి భారతదేశ నిర్మాత కథ' అన్నది ఉపశీర్షిక. పీవీ ప్రధానిగా పదవీ కాలం ముగించుకున్న రెండు దశాబ్దాల తర్వాత, భౌతికంగా దూరమైన పుష్కర కాలం తర్వాత వెలువడిన ఈ పుస్తకం ఒక నిస్పక్షపాతమైన రచన. రచయితకి పీవీ కృషి మీద అభిమానం ఉంది.

కాబట్టే,  రెండేళ్ల పాటు విశేష పరిశోధన చేసి, కీలకమైన వాటితో సహా వేలాది డాక్యుమెంట్లు చదివి, పీవీ వ్యక్తిగత వంటమనిషి సహా వందలాది మందిని ఇంటర్యూ చేసి రాసిన పుస్తకం ఇది. అయితే, రచయితకి పీవీ మీద దురభిమానం లేదు..కాబట్టే పాలనలో జరిగిన తప్పులని తప్పులుగా ఎత్తి చూపించారు.

2004, డిసెంబరు 23న ఢిల్లీ లో పీవీ అంతిమ శ్వాస విడిచిన మరుక్షణం, అంత్యక్రియలు ఢిల్లీలో జరపడానికి వీలు లేదని సోనియా గాంధీ పట్టుపట్టి సాధించుకోడంతో మొదలయ్యే కథనం, పీవీ బాల్యం, తొలినాళ్ళ రాజకీయ జీవితం, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ, పదవీ చ్యుతి మీదుగా సాగుతూ, ప్రధాని అవుతూనే ప్రవేశ పెట్టిన ఆర్ధిక సంస్కరణలు, అవలంబించిన విదేశీ విధానాలు వివరిస్తూ, బాబరీ మసీదు విధ్వంసం లాంటి వైఫల్యాలని పరామర్శిస్తూ, పీవీ-సోనియాల మధ్య పొడసూపిన విభేదాల దగ్గరకి వఛ్చి, పీవీ వ్యక్తిత్వంలో భిన్న కోణాలని పరిచయం చేస్తూ ముగుస్తుంది.  పాతికేళ్ల నాటి రాజకీయాలతో పాటుగా, నేటి రాజకీయాలమీదా ఒక స్పష్టత వస్తుంది.

నిజానికి పీవీ రచనలు 'లోపలి మనిషి,' 'అయోధ్య' చదివిన వారికి 'నరసింహుడు' లో రాసిన కొన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. అలాగే, జైరాం రమేష్ తాజా రచన'సంస్కరణల రథసారథి' పీవీ చదివిన వారికి సంస్కరణల పర్వం పరిచయం అవుతుంది. ఈ మూడూ చదివిన తర్వాత 'నరసింహుడు' చదివితే పీవీ తాలూకు పూర్తి చిత్రం కళ్ళకి కడుతుంది. అంతమాత్రాన, 'నరసింహుడు' చదవడానికి పైమూడూ చదివి ఉండడం తప్పనిసరి కాదు. ప్రధానిగా ఐదేళ్ల పదవీ కాలాన్ని పీవీ సమర్ధవంతంగా పూర్తి చేయడానికి, గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పొందిన 'వైఫల్యం' ఉపయోగ పడిందని ప్రతిపాదిస్తారు వినయ్ సీతాపతి. ఈ పరిశీలనని తోసిపుచ్చలేం. అలాగే, స్వాములు, బాబాలతో సన్నిహితంగా మెలగడం వెనుక రాజకీయ కారణాలని విశ్లేషించారు.

మన్మోహన్ సింగ్ ని ఏరికోరి ఆర్ధిక మంత్రిగా నియమించుకోవడం మొదలు, ప్రతిభావంతులైన అధికారులు ఎక్కడ ఉన్నా వెతికి వారికి తన కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగించడం వరకూ ఎక్కడా కూడా పీవీ 'అభద్రత' కి లోనుకాలేదని చెబుతూ, తాను స్వయంగా ప్రతిభావంతుడు కాబట్టి, ప్రతిభావంతుల కారణంగా తనకి ప్రమాదం ఎదురవుతుందేమోనన్న (మెజారిటీ నాయకులకి కలిగే) సందేహాన్ని పీవీ జయించగలిగారన్నది మరో ప్రతిపాదన. పీవీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో 'పవర్ సెంటర్' గా అధికారం చెలాయించిన నాటి కాంగ్రెస్ ఎంపీ తేళ్ల లక్ష్మీకాంతమ్మ, ముఖ్యమంత్రి పదవి కోల్పోగానే ఆయన్ని నిష్కర్షగా దూరంపెట్టిన విధం పీవీకే కాదు, నాయకులందరికీ ఒక పాఠమే.

కీలక నిర్ణయం తీసుకోవాల్సి వఛ్చిన ప్రతిసారీ దాన్ని వాయిదా వేసి కాలం గడిపేశారన్నది నాడు పీవీ మీద వినిపించిన ఫిర్యాదు. ఆ ధోరణికి కారణాలతో పాటు, తాను చేయాలనుకున్న పనులని అత్యంత వేగంగా చేసిన వివరాలనీ ఉదాహరణలతో సహా అందించారు సీతాపతి. తనదైన ఒక సమాచార వ్యవస్థని నిర్మించుకోడం మొదలు, పార్టీ నాయకుల మీద నిఘా పెట్టడం వరకూ పీవీ చేసిన ప్రతిచర్యనీ విశ్లేషిస్తుందీ పుస్తకం. బయటి శత్రువులతోనూ, (పార్టీ) లోపలి శత్రువులతోనూ పోరాడుతూ, దినదిన గండమైన మైనారిటీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటూ వస్తూ దేశ గతిని మలుపు తిప్పే నిర్ణయాలని సమర్ధవంతంగా అమలు చేయడం అన్నది ఎంతటి కత్తిమీద సామో వివరిస్తుంది కూడా.

శాశ్వతంగా గౌరవించాల్సిన ఒక నాయకుణ్ణి చరిత్ర హీనుణ్ణి చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలతో పాటు, పీవీ చేసిన చారిత్రిక తప్పిదాలనీ నిర్మొహమాటంగా రికార్డు చేశారు. పుస్తకం పూర్తి చేసిన తర్వాత మొదటగా తల్చుకునేది పీవీని అయితే, ఆవెంటనే గుర్తు చేసుకునేది వినయ్ సీతాపతి కృషిని. తెలుగు వాళ్ళెవరూ చేయలేకపోయిన బృహత్ ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రచయితని అభినందించకుండా ఉండలేం. అనువాదంలో ముగ్గురు రచయితలు పాలుపంచుకోడం వల్ల కావొచ్చు, రచనలో ఏకరూపత కనిపించదు. అయితే, మొత్తం పుస్తకం వేటికవే అయిన పదిహేను అధ్యాయాలుగా ఉండడం వల్ల ఈలోపం పాఠకులని పెద్దగా బాధించదు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల మీద ఆసక్తి ఉన్నవాళ్లు తప్పక చదవాల్సిన పుస్తకం ఈ 'నరసింహుడు.' (ఎమెస్కో ప్రచురణ, పేజీలు 440, వెల రూ. 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి