కల్లో దేవుడు !! - Kalalo Devudu !!

కల్లో దేవుడు !! - Kalalo Devudu !!

కల్లో దేవుడు !! - Kalalo Devudu !!

రాత్రి దేవుడు కల్లోకొచ్చి వాయించి పారేసాడు.
"ఒక్కసారి మిమ్మల్ని పుట్టించిన పాపానికి ఎందుకురా రోజూ నన్ను ఇలా వేపుకుని, పీక్కొని తింటున్నారు? పడుకోనివ్వరు. ప్రశాంతంగా ఉండనివ్వరు. బాధ భరించలేక కొండలెక్కి కూర్చుంటే అక్కడికీ తోసుకుంటూ వస్తారు. ఏదో వింటున్నా కదా అని వందేసి వెయ్యేసి పిలిచిన పేర్లతోనే మళ్ళీ మళ్ళీ పిలుస్తూ, చేసిన పూజలు, భజనలే చేస్తూ, ఉన్నవీ లేనివీ కలిపి పొగుడుతూ ఎందుకురా ఇలా ఊదర కొడతారు. కనీసం ఆ పేర్లలో ఏదైనా వెరైటీ ఉందా అంటే అదీ లేదు. ఇటు తిప్పి అటు తిప్పి మా అందరికీ అవే పేర్లు... ఆవు కథ లాగా.

ఒక్కరో ఇద్దరో అంటే పర్లేదు... కానీ ఏడు కోట్లమందిని ఎలా చూసుకుని చచ్చేది. మీ హారతులకి చూడండి మొత్తం స్వర్గం మసి, జిగురు పట్టి ఎలా నల్లగా తయారైందో. తొండాలేవో తోకలేవో తెలీక కన్ఫ్యూజ్ అయి చస్తున్నాం.

మీకన్నా మిగతా జంతువులు ఎంత నయమో చూడండి. ఇవ్వేవీ చెయ్యకుండానే వాటి బ్రతుకేదో అవి బ్రతుకుతున్నాయి హాయిగా, నా సహాయం ఏ మాత్రం అడక్కుండా. మీ సుఖాలకంటే ఓకే... కానీ ప్రతీ చిన్న కష్టానికీ నన్నే బాధ్యుడ్ని చేస్తారు. తొక్కలో ప్రతీ దానికీ నన్నే సొల్యూషన్ చూపించమంటారు. నీకు రోగమొస్తే నేనేం చేస్తాన్రా? నీ పరీక్ష నువ్వు పాస్ కావడానికి నాకు కొబ్బరికాయ ఎందుకురా? ఆ బొట్లేంటీ... వేషాలేంటీ... గొడవేంటి? ఏం... మీకు మీరు సహాయం చేసుకోలేరా. అంత చేతగాని వాళ్ళా? అంత డిపెండెన్సీ ఏంట్రా నా బొంద. మీ అక్రమ సంపాదనలో నాకు కమీషన్ ఏంట్రా చండాలంగా...

ఆకలితో ఉన్నవాడికి తిండి పెట్టరు కానీ నాకు మాత్రం ముడుపులు, బంగారం, వజ్రాలు, కిరీటాలు, రథాలు." ఇంకా ఏవేవో అన్నాడు కానీ గుర్తులేదు.

©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి