పుణుకుల బుట్టలో లచ్చి తల్లి - Punukula buttalo lacchi thalli

పుణుకుల బుట్టలో లచ్చి తల్లి - Punukula buttalo lacchi thalli

పుణుకుల బుట్టలో లచ్చి తల్లి - Punukula buttalo lacchi thalli

అమరావతికి, ధరణి కోటకి మధ్య కృష్ణ ఒడ్డున ఓ పెద్ద చింత చెట్టు ఉంది. రాత్రిళ్ళు ఆ చింత చెట్టు పక్కలకి ఎవరు వెళ్లేవారు కాదు. అక్కడ దెయ్యాలు తిరుగుతుంటాయని భయం. ఆ చింత చెట్టు వయసు ఎవరికీ తెలియదు. కాపు కాయడం ఎప్పుడో మానేసింది. ఉదయం పూట రోజు కృష్ణకి స్నానానికి వచ్చే అవధానులు గారు చేతులు నొప్పి పుట్టేదాకా రాళ్ళూ విసరగా విసరగా గుప్పెడు చింతకాయలు రాలేవి. వాటిని భద్రం గా తడి కొంగున మూట గట్టుకెళ్ళి వాళ్ళావిడకిస్తే ఆవిడ "కృష్ణమ్మ ఇవ్వాళ పచ్చడికిచ్చిందా ?" అంటే అవధాన్లు గారు ఆమాటల్నే తిరగేసి "రేపు పప్పు చేసుకోమంది" అనేవారు. 

పది గంటల ప్రాంతాన ఆ చింతచెట్టు నీడన సంచలనం మొదలవుతుంది. పుట్టలోకొచ్చే చీమల్లా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అక్కడికి చేరుకుంటారు. రెండు మూడు జట్లుగా విడిపోతారు. ఆ నేల మీద చతికల పడి పేకాట మొదలేస్తారు. 

కొమ్మల మధ్య నుండి ఎండ పొడ చురుక్కున పొడుస్తున్నా లెక్కచేయకుండా దీక్షగా సాగుతున్న పేకాట యజ్ఞ వేదిక దగ్గరకు నిదానంగా నడిచొస్తాడు పుణుకుల సుబ్బాయి. కుడిచేతిలో వేడి వేడి పుణుకుల బుట్ట ఘుమాయిస్తోండగా ఎడం చేత మాసికలు  పడ్డ పాత గుడ్డ నొకదాన్ని ధరించి, ఆ గుడ్డతో ఆ బుట్ట మీద అటు ఇటు ఆడిస్తూ ప్రత్యక్షమవుతాడు సుబ్బాయి. ఆ పాతగుడ్డ అలా గాల్లో ఆడించడం లో క్రిమి కీటకాదులను పారద్రోలాటమే కాకుండా, పుణుకుల ఘుమ ఘుమలని నలుదిక్కులకీ విస్తరింపజేసే  ప్రయత్నం కూడా ఉంది. 

ఆ ఘుమ ఘుమల గాలిలో పరిగెత్తుకొచ్చి ముక్కుకు సోకటంతోటే అక్కడి జనానికందరికీ వొళ్ళు జలదరించి కడుపులో జఠరాగ్ని ఉవ్వెత్తున లేచేది. 

" ఒరేయ్ సుబ్బాయి !""ముందుటివ్వారా ""నాకిచెళ్ళెహే ""ఇటు రమ్మంటే " ఇలా అన్ని దిక్కులనుండి ఆపకుండా వస్తున్న అరుపులు కేకలు అందుకున్న సుబ్బాయి 

"అయ్యా వచ్చే ""ఇదిగో ఇక్కడే ""ముందు మీకే ""ఇదిగో ఆకు "

అంటూ ఎక్కడిక్కడ సమాధానాలు చెబుతుంటూ, మెరుపులా తిరుగుతూ, వర్ష ధరల మధ్య గుర్రాన్ని నడిపే చాకచక్యం తో క్షణాల మీద అందరికి పుణుకులు అందించేవాడు. కానీ పచ్చడికి మహా లోభించేవాడు. "మరి కాస్త పచ్చడెయ్యరా ?" అని ఎవరైనా అంటే "ఏటి బాబూ ! పుణుకులు తింటే బలం కానీ పచ్చడి తింటే ఏవస్తది " అని విసుక్కుంటూ కాస్త విదిలించేవాడు. ఎంత వేగంతో పుణుకులిచ్చేవాడో అంత వేగంతో డబ్బులు వసూలు చేసేవాడు. పేక కలపనిచ్చేవాడు కాదు. ముక్క వెయ్యనిచ్చేవాడు కాదు. "ఆటలో పడి  మర్చిపోతారు  బాబు " అంటూ  నవ్వుతో వినయంగా గొంతుమీద కూర్చునేవాడు. 

ఇంతలో రేవులోకి  అవతలి ఒడ్డునుండి పడవొచ్చేది. రయ్యిన బాణంలా రేవులోకి వెళ్లిపోయేవాడు సుబ్బాయి. "పుణుకులు వేడి పుణుకులు " అంటూ దిగిన వాళ్ళని చుట్టుముట్టేవాడు. సామాను సాంతం దింపకోకుండానే పుణుకులు కొనిపించేవాడు. ఎవరైనా కొనని వాళ్ళుంటే వాళ్ళ పిల్లల  చుట్టూతా  ప్రదక్షిణాలు చేసేవాడు. పిల్లల తాకిడికి తట్టుకోలేక చచ్చినట్టు కొనేవాళ్ళు. రేవుకి, చింతచెట్టుకి మూడు సార్లు తిరిగేటప్పటికీ బుట్ట సగం పైగా కోహ్లి అయ్యేది. 

బేరం కొంచెం మందకొడిగా ఉన్నప్పుడు పేకాట ఆడుతున్నవాళ్ళ వెనక చేరి,  "పోలయ్య గారు, ముక్క తీయండి ఈ దెబ్బతో ఆటైపోవాలా !" అనేవాడు. ఆ ముక్కతో ఆటైపోయిందనుకోండి పోలయ్య అడక్కుండానే ఆకులో పుణుకులు పెట్టి ఇచ్చి డబ్బులు వసూలు చేసేవాడు. ఆట అయిపోయి కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి వద్దురా అంటున్న "పచ్చడి ఎక్కువ వేసాను .. తీసుకోండి , మల్లి ఆటేసే దాకా ఖాళీయేగా " అంటూ అంటగట్టేవాడు. 

సాయంత్రం మూడు గంటల వేళ బుట్ట ఖాళి  అయినా సుబ్బాయి అక్కడినుండి కదిలేవాడు కాదు. అసలు బేరం ఆ తర్వాతే. పేకాట కురుక్షేత్రం లో కాలు చేతులు విరిగి, తలపగిలి అడ్డం పడిపోయినా జనం సుబ్బాయి వైపు దీనంగా చూసి "ఓ రెండు రూపాయిలివ్వరా !" అని ఎవరైనా అంటే "నా దగ్గర ఏముంటుంది బాబు, పుణుకులు అమ్మేవాడిని  " అనేవాడు సుబ్బాయి. ఎవరడిగిన ముందు ఆ వాక్యం తప్పకుండా అనగా ఆ తర్వాత సంభాషణ ఇలాగ ఉండేది. 

"అమ్మకంలోదివ్వరా "

"ఆమ్మో ఇదిస్తే బియ్యానికి లేవు బాబు "

"సాయంత్రానికిస్తా లేరా? "

"ఇప్పుడు మీకిస్తే మల్లి సరుకేసుకు రావాలా? ధరలు మండిపోతున్నాయి    "

"నీ పావలా వడ్డీ వేసుకోరా "

"వడ్డీ అసలు మీ దగ్గర ఎక్కడికెళ్తుంది బాబు, నా ఇబ్బందే  " అంటూ బతిమాలించుకొని, బతిమాలించుకొని అప్పులిచ్చేవాడు. పుణుకులమ్మితే అయిదు రూపాయల లాభం వస్తే, రూపాయికి పావలా వడ్డీ మీద పది మిగిలేది. సాయంత్రానికి వసూళ్లు పూర్తి చేసుకొని చీకటి పడ్డాక సారాకొట్టు దగ్గరికి వచ్చేవాడు. సారా కన్నె ఓ ముద్దిచ్చి వెళ్ళిపోతే జిల్ అయిపోయి, ఆ సారా కన్నెని సాంతం కౌగిలించుకునేందుకు డబ్బుల్లేక గిలగిల్లాడే సారా సరుకులకు అర్ధ రూపాయి వడ్డీల మీద అప్పులిచ్చేవాడు సుబ్బాయి. వసూళ్లు కొంత పంటల్లో సాధించేవాడు. 

మూడేళ్ళలో చిల్లర కొట్టు పెట్టాడు సుబ్బాయి. నాలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకెళ్లిన వాళ్ళు సగం మంది అప్పులు తీర్చలేక నగలు వదిలేసుకున్నారు. అప్పుల కింద కొన్ని పొలాలు జప్తు అయిపోగా., పుణుకుల సుబ్బాయి ఇప్పుడు 40 ఎకరాలకి, మూడు భావంతులకి అధిపతి. లక్షల మీద వద్దే వ్యాపారం. 

ఇప్పుడితన్ని ఎవరూ సుబ్బాయి అనరు. వాళ్ళ కులం వాళ్ళు సుబ్బయ్య అంటే మిగిలిన వాళ్ళు సుబ్బారావు గారు అంటారు. 

మనవలు, మానవరాళ్లతో ఘనంగా బతికే సుబ్బాయి ఎవరిని నమ్మడు. తెల్లవారుఝామునే లేచి తలుపు వేసుకొని రహస్యం గా ఓ గంట సేపు ప్రార్ధన చేస్తాడు. "నా ప్రార్ధనే నా లక్ష్మి " అంటదు అందరితో.. 

పట్నం కాలేజీలో చదువుకుంటున్న సుబ్బాయి మనవడు, తండ్రి తాతలు పెట్టిన బుచ్చయ్య అనే పేరును హేమంత్ కుమార్ గ మార్చుకోను సెలవలకి ఇంటికొచ్చాడు. తాత గారి ప్రార్ధన రహస్యం, లక్ష్మి కీలకం కనుక్కుందామని కాపేసి, ఓ రోజు తలుపు సందుల్లోంచి బైనాక్యూలర్స్ పెట్టి చూసాడు. లక్ష్మి రహస్యం తెలిసిపోయింది. 

"సుబ్బారావు గారు అలనాడు పుణుకుల బుట్ట మీద ఆడించిన మాసికల పాత గుడ్డల్ని పూజిస్తున్నారు "

©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి