పెద్దోళ్ల సభ - Stick to selfie stick

పెద్దోళ్ల సభ - Stick to selfie stick

పెద్దోళ్ల సభ - Stick to selfie stick

.అసెంబ్లీ మొదలవుతోంది. ఒకే జిల్లాకు చెందిన వాళ్ళవడంతో ప్రతిపక్షనేత, పంచాయితీ రాజ్ శాఖ మంత్రితో సెల్ఫీ దిగి లోపలికి వెళ్ళారు. సమావేశం మొదలయింది. నీటి పారుదలశాఖ మంత్రి పొరుగు రాష్ట్రాలతో నీటి వివాదాల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఇంతలో సభలో గందరగోళం మొదలయింది. విపక్ష పార్టీ నేతలు అధికార పార్టీ ఇచ్చిన హామీల అమలు గురించి చర్చ జరగాలని పట్టుబట్టారు.

ప్రతిపక్షనేత "అధ్యక్షా! ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీనీ అమలుచేయలేదు. మరీ ముఖ్యంగా పేదలకెంతో అవసరమైన 'ప్రతి ఒక్కరికీ సెల్ఫీ స్టిక్ ' పథకం అమలుకాక ప్రజలు చచ్చిపోతున్నారధ్యక్షా...అయినా కూడా వీళ్లకి చీమ కుట్టినట్లయినాలేదు..." అన్నారు.

అందుకు ఆర్ధికమంత్రి లేచి "అధ్యక్షా! ఈ పథకం అమలు చేయడానికి కొన్ని చట్టపరమైన చిక్కులున్నాయి. కేంద్రంతో చర్చలు జరిపి ఎలాగయినా అమలుచేస్తాం. అయినా సెల్ఫీ స్టిక్ లేక ప్రజలు చచ్చిపోతున్నారనడం విడ్డూరంగా ఉంది " అన్నారు.

అందుకు ప్రతిపక్షనేత " అధ్యక్షా! మంత్రిగారు న్యూస్ చూడరేమో...గత నెలలో ఒక కుర్రాడు తను ఈత కొడుతుండగా షూట్ చేయమని ఫ్రెండ్ కి కేమెరా ఇచ్చి దూకాడు కానీ ఈత రాక చనిపోయాడు." ఇంతలో అధికార పార్టీ వాళ్లు దానికీ...ఈ పథకానికి సంబంధం లేదని అరిచారు.అందుకు ప్రతిపక్షనేత "వస్తున్నా సర్ అక్కడికే వస్తున్నా...కడిగేస్తా మిమ్మల్ని 

ఇవాళ...అసలు  సెల్ఫీ స్టిక్ ఉంటే ఫోటోల కోసం ఆ కుర్రాడు ఒకరిని అడిగే అలవాటు వచ్చుండేదా? చెరువు లోపలికి వెళ్ళకుండా మొదట్లోనే సెల్ఫీ స్టిక్ తో ఫోటో తీసుకొని వచ్చుండేవాడు కాదా ? అతడి ప్రాణాలు నిలబడేవి కాదా? అని  అడుగుతున్నా" అని ఆవేశంగా అన్నారు.అందుకు మంత్రి "ఆ కుర్రాడి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అధ్యక్షా.. సెల్ఫీ స్టిక్ ఏమీ సంజీవని కాదు.ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. 

ఇక ఆ news విషయానికి వస్తే...ప్రతిపక్షనేతకి చెందిన పత్రికలోప్రచురించిన ఆ ఫోటో చూస్తే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది అధ్యక్షా!...కుర్రాడు చనిపోయి వాళ్ళ కుటుంబం ఏడుస్తూ ఉంటే వాళ్ళతో సెల్ఫీ తీసుకోవడం ఏంటి అధ్యక్షా? వీళ్ళకి కాస్త అయినా మానవత్వం ఉందా అని అడుగుతున్నా ” అని అన్నారు.

అందుకు ప్రతిపక్షనేత ఆవేశంగా "అధ్యక్షా! ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ సెల్ఫీ స్టిక్ ఇచ్చేంతవరకు మా పత్రికలో ఏ వార్తకు సంబంధించిన ఫోటో అయినా ఇలాగె సెల్ఫీ తీసి ప్రచురించాలని నిర్ణయించుకున్నాం అధ్యక్షా...అప్పుడయినా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది" అన్నారు.

అందుకు మంత్రి గారు "ఏదో వీరు ఊరికే అరవడమే కానీ ప్రజలకెవరికీ ఆ సెల్ఫీ స్టిక్ మీద ఎలాంటి ఆసక్తీ లేదు అధ్యక్షా!" అన్నారు.అందుకు ప్రతిపక్షంలో ఉన్న ఒక కుర్ర నెత లేచి ఉత్సాహంగా "ఆసక్తి లేకపొతే పొద్దున అసెంబ్లీ బయట దిగిన ఈ ఫోటో కి 2 గంటల్లో 20000 లైకులు ఎలా వస్తాయి అధ్యక్షా" అని ప్రతిపక్షనేత, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి దిగిన ఫోటో  చూపించారు.

ఎలా కౌంటర్ ఇవ్వాలా అని అధికార పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతుంటే వాళ్ళలో ఒక కుర్ర నేత లేచి "ప్రజలకు నిజంగానే ఆసక్తి ఉంటే మొన్న ఎప్పుడో మేము అప్లోడ్ చెసిన 'సెల్ఫీస్టిక్' బొమ్మకి ఎందుకు కేవలం 500 లైకులు వస్తాయి అధ్యక్షా...అంటే వీల్లు కిరాయి మనుషులతో ఆ 20000 లైకులు కొట్టించుకున్నారనిపిస్తోంది అధ్యక్షా" అన్నారు.

అందుకు కుర్ర ప్రతిపక్షనేత నవ్వుకుంటూ "ఆ ఫోటోలో ఉన్న సెల్ఫీ స్టిక్ ఎంత చిన్నగా ఉంది అధ్యక్షా...దాన్ని ఎవరయినా సెల్ఫీ స్టిక్ అనుకుంటారా...అందుకే దానికి ఎవరూ లైకులు కొట్టలేదు...సెల్ఫీ స్టిక్ అంటే ఇలా ఉండాలని" తాను తెచ్చినది తీసి మంత్రి గారి వైపు చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్నట్లు ఊపారు.

అంతే. ఒక్కసారిగా సభలో గందరగోళం మొదలయింది. మా మంత్రి గారికి వార్నింగ్ ఇస్తావా అని అధికార పార్టీ నేతలు ఊగిపోయారు.ఇంతలో ఎప్పుడూ తెలుగు మాట్లడటానికి ఇష్టపడని మైనారిటి వర్గ నేత లేచి "we should not bring such weapons into assembly. It's threatening only"అని ముక్తాయించారు. అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిని ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. వామపక్ష నేతలు వాకౌట్ చేసారు.

పరిస్థితి సద్దుమణిగేలా లేకపోవడంతో స్పీకర్ సభను భోజనానంతరం వరకు వాయిదా వేసారు.

పిల్లలు లేని స్కూల్లో వాచ్ మాన్ లాంటి ఉద్యోగం చేస్తున్న హెడ్ మాస్టర్ నారాయణ ఇదంతా ఆసాంతము తిలకించి పక్క వీధిలో IIT foundation school లో చదువుతున్న తన పిల్లలని లంచ్ కి పిలుచుకురావడానికి బయలుదేరాడు.

వెళ్ళే దారిలో ఒక ఇంటి దగ్గర గుంపు గా గుమిగూడి ఉన్న జనాలని చూసి అక్కడకి వెళ్ళాడు. ఇంకో రైతు ఆత్మహత్య అని తెలుసుకున్నాడు. మీడియా వాళ్ళకి ఫోటో తీసి పంపిద్దామనుకున్నాడు కానీ మామూలు ఫోటో తీయాలో...సెల్ఫీ తీయాలో ...తెలియక ఆగిపొయాడు

©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి