భాగ్ భగీరథ్ భాగ్

భాగ్ భగీరథ్ భాగ్

భాగ్ భగీరథ్ భాగ్

... సువర్లోకము...ఇంద్ర సభ...
భూలోకములో నీటి కోసం జరుగుతున్న యుద్ధాల గురించి చర్చ జరుగుతోంది...ఈ మానవులకు ఎంత నీరు ఇచ్చిననూ చాలక ఇంకా కొట్టుకొనెదరు అని అందరూ చిరాకు పడుతుండగా...ఒక్క భగీరథుడు మాత్రం తాను భూలోకానికి వెళ్ళి వాళ్ళ సాధకబాధకాలు తెలుసుకొని వారికి నీటి కొరత లేకుండా చేయమని పరమేశ్వరుడిని ప్రార్థించెదనని బయలుదేరాడు. ఇది ఆ కాలం కాదు...వద్దని అందరూ వారిస్తున్నా వినకుండా ఒక సాధారణ మానవుడి వలె భూలోకమున అడుగుపెట్టాడు. అప్పుడు ఒక నదీ జలాల గురించి పక్క పక్కనున్న రెండు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా కొట్టుకుంటున్నారు. అసలు సమస్యను పూర్తీగా అర్థం చేసుకోవాలంటే రెండు రాష్ట్రాల్లో గల నీటి నిలువల గురించి తెలుసుకోవాలనుకొని రెండు చోట్లా పర్యటించాడు. రెండు రాష్ట్రాల్లోనూ నీరు సమృధ్ధిగా ఉన్న ప్రాంతాలూ, పూర్తీగా ఎండిపోయిన ప్రాంతాలూ ఉన్నాయి.
గొడవలు జరుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడటం మంచిదని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాడు. అది ఇప్పట్లో కుదిరేల లేదని ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించమని ఈశ్వరుడి కోసం తపస్సు మొదలుపెట్టాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయి ఏం కావాలో కోరుకోమన్నాడు. "రెండు రాష్ట్రాల మధ్య సామరస్యంగా నీటిని పంచమని లేదా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించమని" కోరాడు. మొదటిదాని కంటే రెండవది సులువని అరగంట ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరికేల చేసి వెళ్ళాడు.
భగీరథుడు ముఖ్యమంత్రితో తనని తాను రెండు రాష్ట్రాలకి మధ్యవర్తిగా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య చర్చ మొదలయింది. "సార్...అసలు మీకు జరుగుతున్న అన్యాయమేంటో చెప్పండి.మనం ఎలాగయినా చర్చించి పరిష్కరిద్దాం" అని అడిగాడు. "కొత్తగా ఇప్పుడు చెప్పేదేముంది.మేము ముందు నుండి చెబుతున్నదే.మాకు తాగు నీరు కూడా లేక ఏడుస్తుంటే వాళ్ళు సాగుకు అడుగుతున్నారు.ఇది ఎంతవరకు సమంజసమో మీరే చెప్పండి" అని ముఖ్యమంత్రి అన్నాడు. "కానీ ఇన్నిరోజులు మీరే వాడుకున్నారు కదా.ఇంతవరకు ఏం చేశారని వాళ్ళు అడుగుతున్నారు కద సార్" అన్నాడు
"అదే కదా చెబుతోంది.ఇన్నిరోజులుగా అందరికీ పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్నాం.అయినా సరిపొవట్లేదు" అని ముఖ్యమంత్రి అన్నాడు. "కానీ మీరు మీ పార్టీ స్ట్రాంగ్ గా ఉన్న చోట మాత్రమే నీరు వదులుతున్నారనీ...అందుకే అక్కడ నీరు పుష్కలంగా ఉంటే మిగతా చోట పూర్తీగా ఎండిపోయిందని మీ ప్రతిపక్షం వారు అంటున్నారుగా" అన్నాడు. అందుకు ముఖ్యమంత్రి కోపంగా "అవునయ్యా...మా పార్టీ స్ట్రాంగ్ గా ఉండే ఏరియాలు దిగువున ఉంటే ప్రతిపక్షం బలంగా ఉండే ఏరియాలు ఎగువున ఉన్నాయ్.నీరు పల్లమెరుగును.తెలుసు కదా.అందుకే నీరు ఎగువకు పంపడానికి ఇంకా టైం పడుతుంది.పక్క రాష్ట్రం వాళ్ళకు ఇప్పట్లో వదలమని చెబుతున్నాం" అన్నాడు.
భగీరథుడు "అయినా మీ లాయర్స్ ఈ వాదనలన్నీ అత్యున్నత న్యాయస్థానం ముందు వినిపించారు.అన్నీ విన్నాకే న్యాయమూర్తులు తమ తీర్పు ఇచ్చారు కదా.మరి మీకు అత్యున్నత న్యాయస్థానం మీద కూడా గౌరవం లేదా. వారి తీర్పు పాటించాలి కదా." అన్నాడు.
అందుకు ముఖ్యమంత్రి "మాకు అత్యున్నత న్యాయస్థానం మీద గౌరవం వుంది. వారి తీర్పు తప్పక పాటిస్తాం" అన్నాడు. భగీరథుడు "మరి అలాంటప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకు? నీళ్ళు వదలొచ్చు గా" అని అడిగాడు.
"అడగ్గానే వదిలేస్తే ప్రతిపక్షం వారు ఊరికే ఉంటారా?మనకు తాగడానికి లేకపొయినా పక్క రాష్ట్రానికిస్తున్నాడని వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండే ఏరియాలో...అంటే ఎగువన ఉండే ప్రాంతాల్లో...ప్రచారం చేయరా?ఆ సెగ దిగువున ఉన్న ప్రాంతాలకి కూడా పాకి నా సీటు కిందకి రాదా?ఇప్పుడిలా అడ్డుపడితేనే కదా నేను పని చేస్తున్నట్లు మా వాళ్ళకు తెలిసేది.కాబట్టి తప్పదు" అని ముఖ్యమంత్రి సూత్రీకరించాడు. భగీరథుడు నిట్టూర్పుతో "సరే మీ రాజకీయ ఎత్తులన్నీ పక్కన పెట్టి ఒకసారి మనిషిలా ఆలోచించండి.వాళ్ళు కూడా మనుషులే కదా.మరీ అంత కర్కషంగా దాడులు చేయడం,మీరు వాటిని ఇంకా రెచ్చగొట్టడం...మనుషుల మధ్య ఇంతగా ద్వేషాలు పెంపొందించేలా చేసి ఏం సాధిద్దామని?కలిసికట్టుగా పంచభూతాలను వాడుకోవడానికీ ఇన్ని యుధ్ధాలు జరగాలా? కొంచెం కూడా బాధగా లేదా?" అన్నాడు. అందుకు ముఖ్యమంత్రి "వాళ్ళు కూడా మనుషులే కానీ నాకేమయినా వోట్ వేస్తారా? వేయలేరు కదా...నేనే కాదు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి...ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇలాగే ఆలోచిస్తాం.వోట్ వేసేవాళ్ళ కోసం మాత్రమే పని చేస్తాం...కాదు...చేస్తున్నట్లు నటిస్తాం...చాలా? అయినా ఈ నీటి కోసం చేస్తున్న గొడవలతో మా ప్రజలకు నేను అపర భగీరథుడిలా కనిపిస్తుంటే నువ్వొచ్చి మనుషులూ...మన్నూ మశానం అంటూ సోది చెబుతున్నావ్. ఎవడ్రా నువ్వు? అసలు నీకు మా రాష్ట్రంలో వోట్ హక్కుందా?" అన్నాడు.
భగీరథుడు "రోజుకి పది మందితో పడుకొనే వేశ్య కూడా ఎవడితో ఉంటే వాడితో సక్రమంగా పనిచేస్తుంది కానీ మీలా చేస్తున్నట్లు నటించదు కదా. జీవితంలో వాళ్ళ కంటే ఎక్కువ తిట్లు తినేది ఎవరో తెలుసా...మీలాంటోళ్ళని కన్న పాపానికి మీ తల్లితండ్రులు రా...థూ..."అని ఆవేశంగా వెల్లిపోయి ఊరి బయట కూర్చొని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు.
ఇంతలో ఒక్కసారిగా మీడియా వాళ్ళు, పోలీసులు చుట్టుముట్టారు. వాళ్ళ మాటల్నిబట్టి తనకి అర్థమయిందేంటంటే తాను ఆవు మాంసం తింటున్నారని ఇద్దరు దళితుల్ని కొట్టి చంపాడట. ఏం చేయాలో అర్థం కాలేదు. తానేదో వీళ్ళ నీటి కష్టాలు తీరుద్దామని వస్తే ముఖ్యమంత్రి ఇలా గోహంతకుల హంతకుడిని చేస్తాడా అని వెనుతిరిగి చూడకుండా పరుగు లంఘించాడు. ...సమాప్తం...
©jaabilamma

1 వ్యాఖ్య: