అంతరంగం - Antharangam

అంతరంగం - Antharangam

Satish Polishetty

‘ఎలా బతకాలి?’ అనుకున్నప్పుడు… నాకు కనిపించే, వినిపించే ప్రపంచంలో ఎలాంటి మార్పు నాకు కనపడలేదు. హోరున గాలి లేదు, బోరున వర్షం లేదు, దేవుడేమీ ప్రత్యక్షమవ్వలేదు. ‘ఎలాగైనా బతకాలి’ అనుకున్నప్పుడు కూడా పైన చెప్పినవేమీ జరగలేదు. కానీ ఈసారి దారులు, అదీ లెక్కనేనన్ని దారులు మాత్రం కనిపించాయి. నాకు తెలిసిన ప్రపంచం గురించి చెప్పడానికి ఇంతకంటే నాకేం తెలియదు! ఓ ఇరవై మూడేళ్లుగా అనుకుంటా, నాకు రైలుతో పరిచయం! ఇన్ని సంవత్సరాల్లో ఎక్కువ సమయం నాకు అందులోనే గడిచిపోయింది.

ఇవాళ శుక్రవారం! కాబట్టి కొంచెం తొందరగా స్టేషన్ చేరుకున్నాను! నా ప్రపంచం చిన్నదైనా, ఈ ప్రపంచం పెద్దదన్న విషయం నాకు మొదట తెలిసింది ఇక్కడే. నేను అక్కడకు చేరుకునేసరికి ఫ్లాట్‌ఫారం మీద రైలు సిద్ధంగా ఉంది. ఎలాగోలా నాకో సీటు దొరికింది. బహుశా రైలు కదలడానికి సుమారు ఓ గంట సమయం ఉండొచ్చు! అలవాటుగానే కిటికీ పక్క సీటు నుంచి బయటకు చూస్తున్నాను. అలవాటే కాబట్టి అక్కడ నాకు కనిపించేదేదీ వింతగా అనిపించదు.

ఓ అరగంట నుంచి చూస్తున్నాను వాణ్ణి! ఓ ఆరు సంవత్సరాల వయస్సు ఉండొచ్చు అనుకుంటున్నా! ఫ్లాట్‌ఫారం మీదనే అటు ఇటూ తిరుగుతున్నాడు. ఆ షాప్ దగ్గర ఆగుతున్నాడు. తినేవాళ్ల వంక, తినబడే వాటి వంక మాత్రం చూస్తున్నాడు. మళ్లీ అక్కణ్ణుంచి ముందుకో వెనక్కో కదలడం… నాకు అలవాటైన వాతావరణంలో ఇది మాత్రం కొంచెం భిన్నంగానే ఉంది!

అమ్మేవాడి ముందు మాత్రం దేహీ అనలేకపోతున్నాడు. కొంపదీసి ఆరేళ్లకే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం తొక్కా తోటకూరా కాదు కదా! అరగంట పైనా అయినా, వాడు మాత్రం అదే పని!!

నిక్కరు హోదా పొందలేకపోయినా, దాని కంటూ ఏ పేరూ లేదు కాబట్టి దాన్ని నిక్కరనే అంటున్నా! వంటి మీద ఓ చిరిగిన నిక్కరు తప్ప ఇంకేం లేదు. వాడికి ‘పొట్ట’ అనే ప్రాంతం నాకేమీ కనపడలేదు… ఆనవాళ్లు తప్ప!

అంత ఆకలితో ఉన్నవాడు ఆ షాపువాడి దగ్గర నోరు తెరిచి అడగడానికి ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావటం లేదు. సమయం మెల్లగా కరిగిపోతోంది! వాడి ఓపిక కూడా కావచ్చు. నా కళ్లు మాత్రం వాడినే అనుసరిస్తున్నాయి. ఫ్లాట్‌ఫారం మీద గాలి పీల్చుకు బతికే జీవులు దాదాపు లేనట్టే… నా వరకూ “మనిషి” అనేది హోదా! ఇంత అగాథంలో కూడా వాణ్ణి అక్కున చేర్చుకునే జీవి ఎవరో వాడికి కనిపించినట్టుంది… ఓ నలభై సంవత్సరాలు ఉన్న ఒకామె మాత్రమే ఫ్లాట్‌ఫారం మీద ఉంది. నాకనిపించినంతలో, వాడు కచ్చితంగా ఆమెను దేహి అంటాడు, ఎందుకంటే ఆకలి ముందు ఎవడైనా మోకరిల్లాల్సిందే!

వాడు ఆమెను సమీపించి, ఆమెను అడగబోతున్నపుడు, అప్పుడే ధ్వనించిన చివరి ఎనౌన్స్‌మెంట్ వల్ల వాడి ఆకలి కేకలు ఆమెను చేరే సమయానికి మిగిలిన ఆమె కూడా రైలెక్కేసింది. వాడు, వాడిలాంటి వాళ్లూ తప్ప దాదాపుగా ఇంకెవరూ ఫ్లాట్‌ఫారం మీద లేరు. వీడెవడో దరిద్రానికి దత్తపుత్రుడేమో అనిపించింది. మెల్లగా… రైలు కదులుతోంది… వాడి ముందు ఇప్పుడు రెండే దార్లు… ఇక్కడే ఉండి చావడం, లేదా ప్రయాసకు ప్రాణం పోసి రైలెక్కేయడం!

1… 2… 3…

నా అంచనా నిజమైంది. వాడు రైలెక్కేశాడు. స్వచ్ఛమైన గాలి కూడా రానంత ఇరుకులో వాడు బహుశా నాకు ఇక కనపడకపోవచ్చు. ఆకలి బాధలు నాకేం కొత్త కాదు! ఒకప్పుడు నేను అనుభవించినవే! ఆ రోజులన్నీ దాటుకునే ఈ రోజుకు వచ్చాను. ఆకలికి మించిన గురువు నాకెవరూ లేరు. ఎలా బతకాలి అని శూన్యాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు, నాకు దిశా నిర్దేశం చేసింది ఈ ఆకలే! నన్నే కాదు… ఎందరినో ఎన్నెన్నో తీరాలకు చేర్చింది కూడా ఈ ఆకలే!

కచ్చితంగా వాణ్ణి కూడా అక్కున చేర్చుకుంటుంది. రెండు మూడు స్టేషన్లు దాటే సమయానికి బోగి మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. ఏ రిజర్వేషన్స్ లేకుండా ఉత్తినే పొందగలిగే గాలిని కూడా స్వేచ్ఛగా పొందలేనంత ఇరుకైపోయింది.

వాడి తాలూకు ఆలోచనలు నన్ను ఇప్పట్లో వదిలేలా లేవు. వాడు నాకెందుకో భిన్నంగా కనిపించాడు.

నా ఆలోచనల్ని కచ్చితంగా మళ్లించాల్సిన అవసరం దాదాపు వచ్చేసింది. ఇంత ఇరుకులో ఇప్పటికి ఓ పదిసార్లయినా ఆ చెయ్యి నా పర్సును తాకి ఉంటుంది. ఇప్పుడు పట్టుకోలేకపోతే మాత్రం నా పర్సు “జ్ఞాపకం”గా మిగిలిపోవచ్చు! సీటు దానం చేసినంత మాత్రాన పర్సును దానం చేయలేను కదా!!

పదకొండవ ప్రయత్నంలో ఆ చెయ్యిని నా చెయ్యి పట్టుకోగల్గింది. ఆ చెయ్యి ఎవరిదో కాదు… ఇప్పటికి వరకూ ఎవరిముందు చాపడానికీ మొరాయించిన కుర్రాడి తాలూకు… ఒక్క క్షణం ఆలోచనలన్నీ స్తంభించిన సమయం… ఆకలి చేర్చిన తీరం ఇదా! ఆకలి చివరకు వీణ్ణి దొంగని చేసిందా? వాడి బిత్తర చూపులు ఆ క్షణంలో ఎవరినైనా కదిలిస్తాయి. ఏమాత్రం తెలిసినా, చుట్టూ ఉన్న వాళ్లు తమ తమ వికృత రూపాలు చూపించటానికి సిద్ధమైపోతారు.

వాడి చెయ్యి కాదు, వాడి భవిష్యత్తు నా చేతిలో ఉందేమో అనిపించింది ఆ క్షణంలో… వాడికే కాదు, ఇప్పుడు నా ముందు కూడా నాకు రెండేదార్లు! వాడికి ఏమైనా పెట్టి అందర్లాగానే చేయి దులిపేసుకోవడం… లేదా వాడి రేపటి గురించి ఆలోచించడం… ఇవాళ కడుపు నిండితే మరి రేపు, ఎల్లుండ? ఆకలి వాడికి చూపిన దారి దొంగతనమే కదా? కాస్త కరుకైన నిర్ణయమే తీసుకున్నాను!

వాడిని రైల్వే పోలీసుస్టేషన్లో అప్పచెప్పాలి అని. వాడి రేపటికి నేనంతకన్నా భరోసా ఇవ్వలేను! ఎవరు చూశారో తెలియదు గానీ, వాళ్లకు వీడు దొంగ అన్న విషయం చాలా హాయిగా ఉంది! తలో చెయ్యా వెయ్యబోతుంటే అడ్డుకుని, తర్వాత స్టేషన్లో ఉన్న పోలీసు స్టేషన్లో వాణ్ణి అప్పజెప్పాను. ఆ క్షణంలో నాకు అంతకన్నా మెరుగైన ఆలోచన ఏమీ రాలేదు. చెడుని గుర్తించిన వాళ్లే… నా మంచిని కూడా గుర్తించారు. ఇప్పుడు నేను వాళ్ల దృష్టిలో ఓ హీరో! ఐనా వాళ్ల గుర్తింపు కోసం నేనేమీ ఇదంతా చెయ్యలేదు కదా!

- సతీష్ పోలిశెట్టి

©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి