దైవలేఖ

దైవలేఖ

దైవలేఖ

...దైవం తోడుంటే శూన్యం కూడా గమ్యం చూపిస్తుంది...

ప్రసన్న మందిరం గుమ్మంలో చూసారు రామయ్య దంపతులు. అన్నిటికీ ఆయనే ఉన్నారనుకొని లోపలకి అడుగుపెట్టారు. మొదటి గదిలో స్వామి వారి జన్మ వృత్తాంతం ఇలా రాసి ఉంది.

గత జన్మలో స్వామి వారు స్వయంగా కుబేరుడి తమ్ముడు.ప్రతిరోజూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చెల్లించే వడ్డీ లెక్కలు చూసుకోవడం ఈయన బాధ్యత.ఒకనాడు పరధ్యానంలో తమ సేవకులతో మాటల్లో పడి ఏకాంత మందిరంలోనే ఉండిపోయారు.తమ్ముడి కోసం ఎదురు చూసి విసిగిపోయిన కుబేరుల వారు తానే ఆ పని చూసుకున్నారు.కాస్త ఆలస్యంగా విషయం గ్రహించిన స్వామి వారు పరుగున వెళ్ళి అన్న కాళ్ళ మీద పడి చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో తనకు తాను మానవ జన్మ ఎత్తి ఎవరితో మాట్లాడకుండా నిత్యము మౌన దీక్ష పాటించాలని నిష్చయించుకున్నారు.కానీ కుబేరుల వారు కష్టాల్లో ఉన్నవారికీ... శరణార్థులకీ...సహాయం చేయడానికి మౌన దీక్ష వీడమని సెలవిచ్చారు.అలా భూమి మీద జన్మించిన స్వామి వారు కేవలం మనకోసం మాత్రమే అప్పుడప్పుడు నోరు విప్పుతారు.చాలా సమస్యలకు లేఖల ద్వారానే పరిష్కారం చూపిస్తారు.అందువల్ల దైవలేఖ స్వామిగా ఖ్యాతిగాంచారు.

వృత్తాంతమంతా చదివి మనసులో స్వామిని స్మరిస్తూ లోపల అడుగుపెట్టారు.అందరూ నిశ్శబ్దంగా...పేరు కి తగ్గట్లుగా చాలా ప్రసన్నంగా ఉంది ఆ మందిరం.అక్కడ అందరిని coordinate చేస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్వామి వారిని కలవాలని అడిగారు. అతను స్వామి వారు ఊరికే ఎవరినీ కలవరూ...విషయం ఏంటని అడిగాడు. అప్పుడు ఆ దంపతులు "అయ్యా...మాకు ఒక్కగానొక్క కొడుకు.ఈ మధ్యే ఇంజినీరింగ్ అయిపోయింది.ఎటు పోయాడో...ఏమో...గత మూడు రోజులుగా కనిపించడం లేదు.మొబైల్ కూడా ఇంటిలోనే వేసిపోయాడు.అన్ని చోట్లా వెదికాం.పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం.అయినా ఫలితం లేదు.ఆఖరికి స్వామి గురించి విని వచ్చామని" ఏడుస్తూ చెప్పారు.

అతను కాసేపు ఆలోచించి పదివేలు ఇస్తే లోపలకి పోవచ్చన్నాడు. పదివేలా? అని వాళ్ళు ఆశ్చర్యంగా అడిగేసరికి "అమ్మా...ఆ డబ్బులు మాకోసమో లేక స్వామి వారికోసమో కాదు. మీ సమస్యకు పరిష్కారం చూపడానికి కాస్త ఎక్కువ సమయం పట్టొచ్చు.అప్పటి వరకు మీ కంటే ముందు వచ్చిన ఇంతమంది అవసరాలు తీర్చడానికి అడుగుతున్నాం.మీ ప్రాబ్లం చాలా సీరియస్ కాబట్టి పంపుతున్నా. మొబైల్స్ ఇక్కడ పెట్టి పోండి." అని వివరించాడు. అందుకు వాళ్ళు ఒప్పుకొని పక్కనే ఉన్న ATM నుండి డబ్బులు తెచ్చి, మొబైల్స్ బయటే పెట్టి లోపలకి వెళ్ళారు.

స్వామి వారు ప్రశాంత వాతావరణంలో గంభీరంగా ధ్యానం చేసుకుంటున్నారు. వీళ్ళ అలికిడికి కళ్ళు తెరిచి సమస్య అడిగి తెలుసుకున్నారు. కాసేపు దీర్ఘంగా ఆలోచించి జాతక చక్రం తెచ్చారా...అని అడిగారు. అందుకు వీళ్ళు లేదని చెప్పడంతో అబ్బాయి పుట్టినరోజు చెప్పమన్నారు.

28-2-1995 అని చెప్పారు. అందుకు స్వామి చిన్నగా నవ్వి "ఇంగ్లీష్ కేలండర్ ప్రకారం చెబితే ఎలా? మన శాస్త్రం పుట్టినప్పటికి ఆ కేలండర్ లేదని" అన్నాడు. తన దగ్గరున్న 100 సంవత్సరాల పంచాంగం తీసుకొని "మీ వాడు భావ నామ సంవత్సరం ఫాల్గుణ మాసం బహుళ చతుర్దశి రోజున పుట్టాడు...భావ-8+ఫాల్గుణ-12+బహుళ చతుర్దశి--29...మొత్తం 49...49 గ్రాముల బంగారంతో చేసిన రెండు వక్కలు పట్టు వస్త్రంలో తీసికొని రండి. వాటితో ప్రశ్న వేసి మీ వాడు ఏ దిక్కుకి వెళ్ళాడో చెబుతాను. పూజకి వాడిన తర్వాత ఆ వక్కలు తిరిగి ఇవ్వబడవని గుర్తుంచుకోండి. బంగారు వక్కలు పక్కనే స్వర్ణ మందిరంలో మీరు కొనుక్కోవచ్చు." అన్నారు . అది విని ఆ దంపతులు అంత బంగారమా! అని ఆందోళణ చెంది కొడుకు కోసం చివరికి వేరే దారిలేక ఒప్పుకొని తీసుకొచ్చారు. స్వామి వారు కాసేపు పూజ చేసి ఆ వక్కలను 9 గడులున్న ఒక పట్టిక మీద వేశారు. అది 2 ఉన్న గడి మీద పడింది. స్వామి కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించి అటు వైపు తిరిగి ఒక కాగితం మీద ఏదో రాసి "మీ వాడు దక్షిణం దిశగా వెళ్ళాడు. కాబట్టి మీరు రామేశ్వరంకు పోయి అక్కడ అర్చన చేయించి భక్తితో ఈ కాగితం తెరిచి చూస్తే ఒక బాణం గుర్తు కనిపిస్తుంది. అది ఏ దిశగా చూపిస్తుందో అటువైపు వెదికితే మీ వాడు తప్పక దొరుకుతాడు. భక్తితో కాక అనుమానంతో తీస్తే ఇందులో ఏమీ కనిపించదని గుర్తుంచుకోండి. మీ వాడు దొరికాక దీన్ని ఎవరూ తొక్కకుండా నీటిలో పడేయండి." అని సెలవిచ్చారు. వాళ్లిద్దరూ అలాగే అని స్వామీ వారికి నమస్కరించి వెళ్లిపోయారు. రామేశ్వరంలో అర్చన ముగించి ఆత్రుతతో ఆ కాగితం తెరిచి చూసారు. అందులో ఏమీ కనిపించక పోయేసరికి మన పూజలో ఏమయినా దోషం దొర్లిందా అని బాధ పడుతుండగా...నాన్నా...అంటూ వెనుక నుండి కొడుకొచ్చాడు. వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు. ఆనందము, ఆశ్చర్యంతో తండ్రి "ఈ కాగితంలో ఏమీ చూపించకుండానే భలే దొరికావురా...నువ్వు ఇక్కడే ఉన్నావు కాబట్టి ఇది ఏమీ చూపించలేదేమో...స్వామి వారు నిజంగా గ్రేట్" అన్నాడు. అందుకు కొడుకు "వాడి బొంద గ్రేట్. అసలు వాడి వల్ల దొరకడం కాదు...వాడి వల్లే మీ నుండి దూరమయ్యా.." అని ఆవేశంగా అన్నాడు. అందుకు వాళ్ళు గాభరాగా "అసలు ఏమయిందిరా...అంత గొప్ప స్వామి ని అలా తక్కువ చేసి మాట్లాడుతున్నావ్" అని అడిగారు.

కొడుకు "US కి పోయి M.S చేస్తానంటే మీరు ఒప్పుకోలేదు కదా...మిమ్మల్ని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తుంటే ఒక రోజు పొద్దున్నే TVలో ఆ ఎదవ ప్రోగ్రాం చూసాను. వెంటనే కాల్ చేసి నా సమస్య చెబితే నా పేరు, పుట్టినరోజు వివరాలు అడిగి వచ్చే 9 రోజుల్లో ఎవరికీ చెప్పకుండా అమరనాథ యాత్ర పూర్తి చేసి మా ఆశ్రమానికి వస్తే తర్వాత ఏం చేయాలో చెబుతానని అన్నాడు. గూగుల్లో అమరనాథ్ యాత్ర రూట్ చూసానే కానీ అది ఎప్పుడు చేస్తారో తెలుసుకోకుండా ఇంట్లోనే మొబైల్ వేసి వెళ్ళిపోయాను. వాడు చెప్పిన ముహూర్తం ఎలాంటిదో కానీ అక్కడ దిగగానే నా పర్సు పోయింది. ఆ తర్వాత ఆర్మీ వాళ్లకి దొరికాను. అసలు ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఏంట్రా అని వాళ్ళు నన్ను ఒక రోజంతా interrogate చేశారు. అప్పుడే వాళ్ళతో మీకు కాల్ చేయించా కానీ మీరు లిఫ్ట్ చేయలేదు. బహుశా అప్పుడు వీడి దగ్గర ఉన్నారనుకుంటా..ఆఖరికి మా కాలేజీ ప్రిన్సిపాల్ తో వీడియో కాల్ లో మాట్లాడి నాకు ఏమీ తెలియదని confirm చేసుకొని వదిలేశారు. నా దగ్గర డబ్బులు లేవని తెలుసుకొని పాపం...వాళ్ళే డబ్బిచ్చి పంపించారు. నిన్న ఇక్కడకొచ్చాక మన పక్కింటి వాళ్ళు మీరు ఇక్కడకి వెళ్లిన విషయం చెప్పారు. మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తగులుకోక ఆఖరికి నేను కూడా ఇక్కడకి వచ్చా...అదీ సంగతి . రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదంటారు. కానీ మనకు మాత్రం ఈ శనీశ్వరుడి వల్లే రామేశ్వరం చూసే భాగ్యం కలిగింది.ఇంతకూ మన దగ్గర బాగానే లాగాడా?" అని అడిగాడు.

అందుకు తండ్రి నిర్వేదంతో "ఆ...బాగా గుంజాడులే...పదివేలు డబ్బులు, 5 తులాలు బంగారం...అయినా మనము కాస్త లక్కీ అనుకోవాలి...నువ్వు భావ నామ సంవత్సరంలో పుట్టావు కాబట్టి సరిపోయింది కానీ అదే అక్షయ నామ సంవత్సరంలో పుట్టింటే ఇంకో 5 తులాలు బొక్క పడేది" అని ఏడవలేక నవ్వుకుంటూ చెప్పాడు.

...దైవం తోడుంటే శూన్యం కూడా గమ్యం చూపిస్తుంది...ఎందుకో రామయ్యకు అప్రయత్నంగా అది గుర్తొచ్చింది. ఖాళీ కాగితం ఎక్కడ పడేయాలో తెలియక తన చేతిలో ఇంకా అలానే ఉంచుకున్నాడు.

©jaabilamma

2 వ్యాఖ్యలు: