శోధన - Shodhana

శోధన - Shodhana

శోధన - Shodhana

ఎందుకు నేను ఆకాశంలో చుక్కల్ని లెక్కిస్తున్నాను? ఎవరు ఆదేశించిన కార్యమిది? ఈ ప్రశ్న ఎందుకు నా ఈ అర్థ మెరుగని కార్యాన్ని నియంత్రించలేక పోతోంది? కూడగలిపిన మొత్తాన్ని ఆ సముద్రపు ఒడ్డు మీద రాస్తున్నా. ఆ లెక్క మొత్తాన్ని కెరటాలు ఎవరికో అందజేస్తున్నాయి. వెళ్ళిన కెరటం తిరిగి వచ్చే లోపు నేను మళ్ళీ లెక్కించిన మొత్తాన్ని అక్కడ రాయాలి. నేనూ, ఈ సముద్రం ఎవరి ఆధీనంలోనైనా ఉన్నామా? మా యజమాని సముద్రం లోపల ఎక్కడో ఉంటాడు అనుకుంటా. నేను అందజేసిన లెక్కని అతను ఏం చేస్తాడు? నా లాగానే ఈ సముద్రం కూడా ఆలోచిస్తుందా? అది కూడా దాని పట్ల నియంత్రణ కోల్పోయిందా? ఇక్కడ నేనులో నా భాగమెంత? ఈ పని చేసే శరీరం వాటా ఎంత? ‘ఇంత’ నా భాగం అనుకుంటే ‘నా’ లో నేను ఎవరు?
మేం ఇద్దరం శాపగ్రస్తులమా? ఐతే మేం ఏం తప్పు చేసి ఉండొచ్చు? దీని సమాధానం ఎవరి దగ్గర ఉందో ఎలా తెల్సుకోవడం.
చుక్కలు… చుక్కలు మెల్లగా మాయం అవుతున్నాయి…. లెక్క మొత్తం మెల్లగా తగ్గుతోంది… ఆ చివరి చుక్క లెక్కించిన తర్వాత నేనేం చే…… స్తా…….
ఎందుకు నేను ఆకాశంలో చుక్కల్ని లెక్కిస్తున్నాను? ఎవరు ఆదేశించిన కార్యమిది….
ఆలోచనగా, పనిగా నేనెందుకు విడి విడిగా ఉన్నాను. ఇంత లోతుగా ఈ అంశాన్ని గురించి ఆలోచిస్తుంటే శరీరం ఎందుకు కొంచమైనా నా మాట వినడం లేదు? కనీసం నన్ను అడిగి తెల్సుకునే ప్రయత్నం కూడా చెయ్యడం లేదు. అలసటే లేకుండా ఈ పనికి మాలిన చుక్కల్ని లెక్కిస్తోంది…
ఈ పని చేసే శరీరం ముందు మొదలై నాకు చోటు ఇచ్చిందా, లేక నేను ముందు మొదలై, నా ఉనికి కోసం ఈ పని చేసే శరీరాన్ని ఏర్పాటు చేస్కుని తర్వాత నా పెత్తనం కోల్పోయానా? ఒకవేళ ఇదే నిజం అనుకుంటే ఇంతకి నేను ఎవరు?
ఆ చుక్కల లెక్కలో తప్పు దొర్లినా, లేక ఈ నా మాట వినని శరీరం వాటిని లెక్కించడం మానేసినా వీటి కారకుడు ఆ సముద్రం విడిచి బయటకు వచ్చే అవకాశం ఉందేమో? అలా వస్తే నేను ఎవరు అనే విషయం తెలిసే అవకాశం ఉంటుందేమో. ఈ మొద్దు శరీరం చేత ఈ పనులు చేయించడం ఎలా?
చుక్కల నిష్క్రమణ మొదలైంది. అమ్మో అంటే ఈ రోజు ముగుస్తోంది. ఆ చివరి చుక్క తర్వాత నేను, వీడు ఏమవుతున్నాం. ఈ సముద్రం పరి…..స్థి……………….తి.
ఎందుకు నేను ఆకాశంలో చుక్కల్ని లెక్కిస్తున్నాను ? ఎవరు ఆదేశించిన కార్యమిది….
దూరంగా ఎక్కడనుంచో ఏవో కేకలు వినిపిస్తున్నాయి. మెల్ల మెల్లగా వాటి స్పష్టత పెరుగుతోంది. ఇంకా స్పష్టత పెరిగితేనే గాని ఆ కేకలు నాకు అర్థమయ్యే అవకాశం లేదు. ఈ నా శరీరం చుక్కలు లెక్కించే పని చేసుకుంటూ పోతోంది.
ఆకాశం. ఆకాశామేనా? ఆ కేకలు. స్పష్టత లేదు.
రోజు ముగియటమేనా? పనిగా ఈ కార్యం ముగియదా? చుక్కలు. వీడు. నేను. కెరటాలు. సముద్రం. లోపల మా యజమాని. ఆపై?
ఆ దూరపు కేకల్లో స్పష్టత వస్తోంది.
“ఆ కా శం అం త మ వ్వ బో తోం ది”.
ఏమిటి ఆకాశం అంతమవ్వబోతుందా? అంటే చుక్కలు. ‘అంటే వీడు. అంటే నేను.’ లేదు ‘అంటే నేను. అంటే వీడు.’ ఎవరు చెప్తుంది? ఒరేయ్! నా పనికిమాలిన శరీరమా. ఇప్పుడైనా నా మాటవినరా. ఒక్కసారి పని ఆపరా. ఇక చుక్కలుండవంట. అంటే మనం.
నాలాగే నీకు ఏవో పిచ్చి ఆలోచనలు. ఇప్పుడే మొదలై ఉంటావ్. అర్థం లేని కేకలు. అంత పెద్ద ఆకాశం అంతమవ్వబోతుందా? పిచ్చి కేకలు. అర్థం పర్థం లేని కేకలు.
“అవును అర్థం లేని కేకలే. పిచ్చి కేకలే. దూరం నుంచి నిన్ను చేరిన కేకలు.”
నా గొంతు నిన్ను చేరిందా? అంటే నాకు గొంతు… అది నీకు వినబడిందా? నేను ఎవరో నీకు తెల్సా? దయచేసి నేను ఎవరో నీకు తెలిస్తే చెప్పు. నా శోధనకు ఒక ఖచ్చితమైన ముగింపు పలుకు. ఈ ఆకాశం అంతమవ్వబోతున్నట్టు నీకు ఎలా తెల్సు? ఒకవేళ ఈ ఆకాశం అంతమైపొతే నేను అంతమైపోతానా? దయచేసి నాకు సమాధానం చెప్పు.
“అవును అర్థం లేని కేకలే. పిచ్చి కేకలే. దూరంనుంచి నిన్ను చేరిన కేకలు.”
లేదు లేదు. నీ గొంతు నిజమే చెప్తుంది. నన్ను క్షమించు. నేను నమ్ముతున్నాను. దయచేసి నా ప్రశ్నలకు జవాబులు ఇవ్వు. దయచే…
“ఆకాశం అంతమవ్వబోతుంది”
అంతకుమించి ఇంకేం చెప్పవా. అయ్యో ఇప్పుడేం చెయ్యను. కొత్తగా ఏమిటీ కష్టం. లేదు, ఎలాగైనా నేను బతకాలి. ఆకాశం ఏమైనా కానీ. ఈ నా మాట వినని శరీరం ఏమైనా కాని. నేను బతకాలి. కాని ఎలా? నాకు ఎవరు సహాయం చేస్తారు? అయ్యో చుక్కల నిష్క్రమణ కూడా మొదలైపోయింది. నిచ్చెన. ఆకాశంలోకి నిచ్చెన. చుక్కలనే అడిగితే? ఆకాశంలోకి నిచ్చెన వేస్కుని? ఎలా? ఒహ్ నాకంటూ స్వతంత్ర రూపం లేదే. ఇప్పుడు ఒకే ఒక దారి ఉంది. నా మరణం అవశ్యం. చివరి చుక్క కనుమరుగు అయ్యేలోపు ఆలోచనగా నేను మరణిస్తే శరీరంగా వీడు బ్రతకొచ్చు. నేను మరణిస్తూ……న్న !
- సతీష్ పోలిశెట్టి
©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి