కంచె దాటిన నాగలి
కష్టం నుండే బతుకు పుడుతుంది 
ధైర్యం వలనే ఆశ బతుకుతుంది 
ఆశ వల్ల  జీవితం నడుస్తుంది 


జలగని .. ఊరుపేరు లో  నీరు,   ఊరులో కన్నీరు మాత్రమే ఉన్నాయి.. మరెక్కడా నీరు కనిపించని ఊరు. 
ఇక్కడ ప్రతి రైతుకో కథ ఉంది, కథకో కష్టం ఉంది, కష్టం వెనుక కన్నీరు ఉంది.. !

సూర్యం: మూడున్న మీటర్లు తాడు కావలి. 
సేటు : అరవై. 
సూర్యం: యాభై జేసుకో సేటు 
సేటు: చేసుకోవడానికి ఎం లేదు.. చేసిన తాడే,  రేటు తగ్గదు.. తాడు తెగదు. 
సూర్యం: అదే  కావలి లే. ఇదిగో యాభై తీసుకొని మూడు మీటర్లు ఇవ్వు 
సేటు: సరిపోతుందా ?

ఆ.. అన్నట్టు తల ఊపాడు సూర్యం. అంగడి నుండి బయటికి వచ్చి ఆకాశం వైపు చూసాడు.. తను వెళ్ళబోతున్న గమ్యానికి వస్తున్నా అన్నట్టు ఒక చిరునవ్వు నవ్వాడు.. 

దారిలో వెళ్తూ తన వైపు, బట్టల వైపు చూసుకున్నాడు. ముతక వాసనతో మరకల పడ్డ చొక్కా, ఆ చొక్కా.. సబ్బు నీళ్ళని మూడునెలల క్రితం వచ్చిన దసరా పండగ రోజు చూసింది, అప్పటి నుండి చెమట నీళ్లు తప్ప సబ్బు నీళ్లు కాదు కదా ఉట్టి నీళ్లు కూడా చూసింది లేదు, ఇంకా ప్యాంటు సంగతి సరే సరి! 

ఒక చిరునవ్వు నవ్వుకుని దారి పట్టాడు. దారిన వెళ్తూ ఆలోచనలో పడ్డాడు. 
"పండగ పూట కూడా పట్టెడు అన్నం తినలేదు నా లక్ష్మి, నన్ను చేసుకున్న పాపమో .. నేను  చేసుకున్న అదృష్టమో, నా కష్టాల జీవితానికి తన కన్నీళ్లు కోపగించుకున్నయేమో కానీ తాను ఎప్పుడు ఒక్క మాట అనలేదు. కనీసం నేను వెళ్లేముందు అయినా ఇంట్లో కనీసం ఈ ఒక్కసారైనా ఎంగిలి చేతులు కడగాలి. " అనుకుంటూ జగన్నాధం దగ్గరికి చేరాడు సూర్యం.

పచ్చని అంచు, గంజి పెట్టి పెళ పెళ లాడుతున్న పంచతో, పైన తెల్ల చొక్కా, కండువాతో, నుదుట మీద గోవింద నామాలు,ముక్కు  మీదకి జారుతున్న నల్లటి ఫ్రేమ్ గల అద్దాలని పైకి తోసుకుంటూ పద్దు లెక్కలులో తల ముంచి రాసుకుంటున్న జగన్నాధం, ఇంటి తలుపు దగ్గర అలికిడితో తల ఎత్తి చూసి..   

జగన్నాధం:  రావయ్యా సూర్యం.. ఈ మధ్య కనపడటం లేదు, వద్దే డబ్బులు కోసం ఇంటికెళ్తే పొలానికి వెళ్లావని ఇంట్లో చెప్పారు,  పొలంలో పని పెరిగిందా ? లేక పొలంలో ఏదీ పెరగనందా? 
సూర్యం: ఏది పెరిగినా పెరగపోయినా .. మీరు మాత్రం బానే ఎదుగుతున్నారుగా జగన్నాధం గారు.. !
జగన్నాధం:  నా సంగతి పక్కన పెడితే .. ఇంతకీ వడ్డీ డబ్బులేవి ? అది ఇచ్చి ఏమైనా చెప్పు, ఎంత సేపైనా వింటా. 
సూర్యం: ఇవ్వడానికి కాదు, తీసుకెళ్లడానికి వచ్చా .. నాకు .. నాకింకా డబ్బు కావలి. 
జగన్నాధం: కుదరదు సూర్యం.. మూడేళ్ళ కింద చేసిన అప్పుకు ఇంకా వడ్డీ  కడుతున్నావ్, ఇది కాక వచ్చిన ప్రతి సారి వంద, రెండొందలు చొప్పున నువ్వు మీ ఆవిడ  పండగలు దాటిచ్చేస్తున్నారు. ఇలా అన్నిటికీ లెక్క కట్టి వడ్డీ కడితే రెండున్నర లక్ష తేలింది, నువ్వు చదువుకున్న వాడివి నేను చెప్పేది తప్పైతే ఇదిగో ఈ  పద్దు పుస్తకం చూసుకో! 

అంటూ పుస్తకాన్ని సూర్యం వైపు తోసాడు జగన్నాధం. 

సూర్యం: (చిన్నగా నవ్వి) మీ లెక్క తప్పదు జగన్నాధం గారు. ఆ లెక్కకి ఇంకో రెండు వేలు కలపండి. అంతే

అంటూ పుస్తకాన్ని సూర్యం, జగన్నాధం వైపు తోసాడు 

జగన్నాధం: ఇలా లెక్కలు కలుపుకుంటూ పోతే నా లెక్క తేలేదు ఎప్పుడు ? 

అని ఎద్దేవా చేస్తూ కళ్ళ అద్దాల సందుల్లోనుండి చూస్తూ అన్నాడు జగన్నాధం. 

సూర్యం: రెండు రోజులాగండీ, నా వడ్డీ లెక్కలన్నీ తేలిపోతాయి, మీ అప్పుకు నా అయిదు ఎకరాల భూమి అడ్డం. సరిపోతుందా ? 
జగన్నాధం: నీ భూమి సమాధానం చెప్పేటట్టే అయితే రెండు ఎందుకు ఈ అయిదు తీసుకో మొత్తం కలిపి రెండు లక్షల డెబ్భై అయిదు. ఇదీ లెక్కంటే. 

సూర్యం నిట్టూర్పు దాల్చిన  చిరు నవ్వు జగన్నాధం వైపు విసిరాడు. జగన్నాధమ్ లోపలి మూలిగి ఉన్న డబ్బు రెక్కల్ని వలిచి అయిదు వేలు సూర్యం చేతిలో పెట్టాడు. ఆ డబ్బు తీసుకొని సూర్యం అక్కడినుండి బయలుదేరాడు, మళ్ళి యధాతధంగా వడ్డీ లెక్కల్లోకి మునిగాడు జగన్నాధం ..

(ఇంకా ఉంది)

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి