సిత్తూరయివోరు

సిత్తూరయివోరు

ఆచార్య మహాసముద్రం దేవకి

ఊరి సివర వొడ్డి గుడ్సిలికాడుండేది మా ఇస్కూలు. మూడంకణాల ఇల్లు – వరండా. ఎనక కొంచెం, ముందర శానా జాగా వుండేది. సుట్టూ గోడ, గోడలోపల ఎడమ్పక్క రచ్చబండ మాదిరిగా వుండే దిన్నిపైన రాగిమాను, యాప్మాను, సూట్టూ కానగసెట్లు, మా ఇస్కూలు ఎంతో సూడసక్కంగా వుండేది.

సిత్తూరయివోరున్నన్న్యాళ్లు ఇస్కూలుకు బోవాలంటే నాకు శానా కుశాలుగా వుండేది. అయివోరు పెతిదినం ఇంటరెల్లుకుముందు డికిటేసను సెప్పోవోడు నేను మూడో తరగతి సదవతావుండా. ఆ పొద్దు పాటంలో లేని కొత్త కొత్త పదాలు సెప్పబట్న్యాడు. అంతప్పురము, గుర్రబ్బండి, హిడింబి పదాలు ఒకోటి నాలుగేసి సార్లు సెప్పినాడు. వీటితోపాటు పాటంలో ఉండే కరటక దమనకులు, మిత్ర బేదము, కాకి, నక్క ఇట్లా ఏవేవో ఇరవైపదాలు సెప్పినాడు. ఆ దినం ఇరవైకి పంతొమ్మిది దెచ్చుకున్నాన్నేను. ఆ గొప్పతనమంతా మా బక్కయివోరిదే.

మూలింటవ్వోళ్లకు వాళ్లుండే ఇల్లుగాక వాళ్లింటికి ఉత్తరం పక్క సావిడిల్లు, ఒక జోబిడి వుండేది. ఆ ఇంటిని కర్నమోళ్ల బక్కయివోరికి రూపాయిదుడ్లు గూడా ఆశించకుండా వుండమని ఇచ్చినారు. ఆ అయివోరికి పెద్ద పెండ్లాముకొక కొడుకు, ఆయమ్మ సచ్చిపోయినాక సేసుకున్న రొండో పెండ్లాముకు ఇద్దురు కొడుకులు, ఇద్దురు కూతుర్లు. ఆ పిలకాయిల పుట్టుక, సదువులు పెండ్లిండ్లు ఆ యింట్లోనే జరిగినాయి.

ఇస్కూలు టీచరు పని ముగిసి పోయినాక బక్కయివోరు ఇంట్లోనే వుండేటోడు. వూర్లో పిలకాయిలంతా ఆ అయివోరు దెగ్గిర ప్రైవేటు సెప్పించుకొనేవాళ్లు. నేను, మాయక్క మా మూలింటవ్వ మనవరాండ్లు గదా! అందుకని మమ్మల్ని కొట్టకుండా తిట్టకుండా అన్నీ బాగా నేర్పించేటోడు. ముక్కెంగా తెలుగు.

అంతఃపురము, హిడింబి, గుఱ్ఱబ్బండి, కరటకదమనకులు వీటికన్నీ టిక్కులే. మిత్రభేదానికి బొదులుగా మిత్రబేధము అని రాసినాను అందుకే ఆ ఒగొటి తప్పయింది. అందురూ అంతప్పురము, హిడింబి, గుర్రబ్బండి, కరకటదమనకులు అని రాసినారు కదా! నేను బాగా రాసినానని సిత్తూరయివోరికి అప్పట్నుంచి నన్ను సూస్తే శానా కుశాల. నన్ను పైకెత్తి దించడమే గాదు. అందురికి ఎవురెవురెన్నెన్ని తప్పులు రాసినారో అన్ని సెంపదెబ్బ లేపించినాడు నాతో.

మద్దేన్నం లెక్కల కలాసులో ఎక్కాలు ఒప్పించలేదని అందుర్నీ సోలుపుగా ఎండలో నిలబెట్టి సదివిస్తా సింతపువ్వుదెచ్చి నా తల్లోబెట్టి ‘తలమింద సెత్తుంది సెప్పొద్దు సినపాపా’ అంటే నేను తప్ప అందురూ తలలు తడుముకొనినారు. అప్పుడు నా తల్లోంచి దాన్ని తియ్యంగానే అందురూ పడీపడీ నవ్వినారు.

ఎందుకో తెలీదుగానీ సిత్తూరయివోరంటే నాకు శానా ఇష్టము, బకితికూడా. అందుకే ఆ అయివోరేంపని జెప్పినా సిటికెలో సేసేస్తా. సదువైనా ఓంవర్కయినా అంతే. తెలియంది సెప్పించడానికి, రాయించడానికి మా బక్కయివోరు మాయింటకాడ వుండనే వుండాడు.

సదువులో ముందుండానా? అందుకే నన్ను మా కలాసుకు లీడరును సేసేసినాడు అయివోరు. మా తెలుగు పుస్తకంలో బాలసెంద్రుని పాటముండేది. దాన్ని మా పిలకాయిల సేత ఒక్కోరికొక్కో పేరు బెట్టి నాటకం మాదిరిగా సెప్పమన్న్యాడు. నేను బాలసెంద్రునికి అమ్మను. నా పేరు ఐతాంబ. నా కొడుకు బాలసెంద్రుడు ‘నేను యుద్ధానికి బోతానమ్మా’ అని వొచ్చినప్పుడు ‘బిడ్డా, లేక లేక ఎన్నో నోములు నోసి నిన్ను కన్న్యానురా, నువ్వు యుద్ధానికి బోతే నేనెట్లా ఓర్సుకొనేది’ అనే మాటలు సెప్పేటప్పుడు నా మొగం మింద దిగులు, మాటల్లో బాద బాగా సూపెట్టినానని ‘నువ్వు గబురు కన్నమ్మ – సిత్తూరు సిన్నమ్మరా’ అని సెబాస్‌ అంటా ఈప్మింద సెరిసినాడు సిత్తూరయివోరు. నాకు కొండెక్కినంత సంతోసమయింది.

సాయింత్రం, ఇస్కూలు వొదిలేముందు ఒక గంట ఆట్లాడుకుంటాము. మా కలాసు పిలకాయిలంతా పట్టగీసుకోని కుంటాట ఆడుకుంటావుండాము. నేను అవుటయినాను గాబట్టి కుంటాల. నేను కుంటడం మొదలు బెట్న్యానో లేదో సిత్తూరయివోరు పట్ట లోపలికొచ్చి అంటుకోమని పరిగెత్తబట్నాడు. అంతేగాదు ‘దేవకీ దేవికొడుకురా – ఈ బూమ్మింద దేవుడై ఎలిసినాడురా ఆడోళ్లతో కూడుకోని – టక్కుబుక్కులాడుకోని బ్రెట్రాయ్‌ సామి దేవుడా

ఈ బూమ్మింద దేవుడై ఎలిసినాడురా’ అని పాడతా రెచ్చగొడ్తా పరుగు బెట్న్యాడు. అయివోరట్లా మాతో కలిసిపోయి ఆడతా వుంటే ఆ పొద్దు మాకెంతో కుశాలై పోయింది.

©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి