రంగు వెలిసిన రాజుగారి మేడ కథ

శ్రీపాదపట్నాన్ని పావురాళ్ల పట్నమని కూడా అంటారు. ఆ వూరిని నిర్మానుష్యంగానైనా వూహించవచ్చు గానీ, పావురాళ్ళు లేకుండా ఊహించలేం. ఇళ్ళ వాకిళ్ళలోనూ, అంగళ్ళ ముంగిటా, బడి పెంకులపైనా, గుడి గోపురం గూళ్ళలోనూ... ఎటు చూసినా పావురాలే! ఒక్కోసారి వాటి చొరవ చూస్తే, అసలిదంతా అవి నిర్మించుకున్న వూరేనేమో, ప్రజలే పాపం కాందిశీకులై వలస వచ్చారేమో అనిపిస్తుంది.  ఊరి వాళ్ళకి వీటితో మసలుకోవడం అలవాటైపోయింది. ఎండిన రెట్టల్తో తమ అరుగులన్నీ గరుకుబారినా గోకిగోకి కడుక్కుంటారేగానీ ఏ హానీ తలపెట్టరు. యిక్కడి ఊరకుక్కలు సైతం, పెంటకుప్పల మీద పులిస్తరాకులేరుకుంటున్న తొందరలో కూడా, వెన్నుపై వాలి అల్లరి చేసే తుంటరిపావురాళ్ళని పెద్దన్నల్లా ఓపిగ్గా భరిస్తాయేగానీ కసురుకోవు. వీటి పరపతికి జడిసి కాకులైతే శ్రీపాదపట్నంవైపు రానేరావు.

ఈ ఊరిపై వీటికింత మక్కువ కలగడానికి ముఖ్యకారణం యిక్కడి పాతమేడలు. నిండా గోపీచందనపు పూతతో మెరుగుపోయిన బంగారపు దిమ్మెల్లా మెరిసిపోయే యీ పాత మేడల అందం వర్ణనాతీతం. సాయంసంధ్యవేళ పల్చని ఎండలో అయితే మరీను. అటువంటి సమయాల్లో ఊర్నానుకుని పారే ఏటి మీదుగా ఎగిరే ఏ పొరుగూరి పావురమైనా సరే, ఈ పాతమేడల్ని చూసింతర్వాత కూడా శ్రీపాదపట్నానికి మకాం మార్చేయాలనే చాపల్యాన్ని నిగ్రహించుకోగలిగిందంటే, ముక్కు తిప్పుకుని ముందుకుపోగలిగిందంటే, అలా దాటిపోయిందని తోటి పావురాళ్ళకు తెలిసిందంటే, దాని మెదళ్ళో యిసుమంత రసత్వం కూడా లేదని ఈసడింపులు ఖాయం.

ఒకప్పుడు యేటి వొడ్డున జనార్దనస్వామి గుడి వున్న వీధి శ్రీపాదపట్నానికి ప్రధాన వీధిగా వుండేది. ఆ గుడిని కట్టించిన రాజవంశీకులు ఆ ప్రక్కనే రెండంతస్తుల భవంతిలో వుండేవారు. ఎన్నో తరాల బట్టి దాని బాగోగులు వాళ్ళే చూసుకుంటూ వచ్చారు. ఆ వరసలోనే జనార్దనస్వామి రథం నిలబెట్టిన పెద్ద కొట్టమూ, దూరప్రాంతాల్నించీ గుడి సందర్శనార్థం వచ్చే యాత్రికుల కోసం సత్రమూ, అర్చక కుటుంబం వుండే మండువా, యివన్నీ గాక పూజా ద్రవ్యాల్ని అమ్మే దుకాణాలూ, పూల కొట్లూ... వీటన్నింటితోనూ ఆ వీధి నిత్య సమ్మర్ధంగా వుండేది. అశ్వాలు పూన్చిన రథాలూ, పట్టుజరీతెరలు వాల్చిన పల్లకీలూ వస్తూపోతూండేవి. రాజుల ఆహ్వానంపై దూర దేశాల్నించి కళాకారులూ, ప్రదర్శకులూ వచ్చి విద్యల్ని చూపించేవారు. అయితే ఇదంతా ఒకనాటి మాట. రాజుల పరంపరలో చివరివాడైన సుబ్బరాజు గారి హయాం వచ్చేసరికే ఆ రాజవీధి ప్రాభవాన్ని కోల్పోయింది. ఆయన చనిపోయాకా చెడ్డపేరు కూడా తెచ్చుకుంది.

చెడ్డపేరుకి సుబ్బరాజు గారికన్నా, ఆయన ప్రేతాత్మ కారణమని చెప్పాలి. రెండంతస్తుల రాజభవంతిలో క్రింద అంతస్తులో యిప్పుడాయన ఆత్మ తిరుగుతోంది. పై అంతస్తులో ఆయన మనవరాలు రేణుకాదేవి వుంటోంది. ఆయన ఆత్మ పైలోకాలకు పోకుండా యింకా అక్కడే తిరగడానికి కారణం ఈ మనవరాలే అంటారు. బతికివుండగా కూతుర్ని కాపాడుకోలేకపోయాడు, చచ్చి యీ మనవరాల్ని కాపాడుకోవాలని చూస్తున్నాడని జనం మాట. ఒకప్పుడు ఆయనకు కూతురంటే పంచప్రాణాలు. ఆమె దేశంలోకే పెద్ద అందగత్తె. ఒక పొరుగూరి జమీందారు ప్రేమలో పడి సుబ్బరాజు గార్ని ఎదిరించి పెళ్ళి చేసుకుంది. వాడు ఆమె అందంలోని రాజసాన్ని, స్వభావసిద్ధమైన నిర్మలత్వాన్ని భరించగలిగే మనసున్నవాడు కాదు. కాస్త కురూపి కూడా కావడంతో ఆమె ప్రక్కన ఎప్పుడూ మాసిపోయినట్టు కన్పించేవాడు. ఆ న్యూనతను భరించలేక ఆమెను హింసించడం మొదలుపెట్టాడు. పురుడు పోయడానికని వెళ్ళిన మంత్రసానికి ఆమె గుర్రపుశాలలో నొప్పులు పడుతూ ఎదురవడాన్ని బట్టి వాడి చిత్రహింసలెలాంటివో ఊరికి తెలిసింది. రేణుకాదేవి భూమ్మీద పడిన కొన్నేళ్ళకే ఆమె మరణించింది. సహజమరణమో, బలవన్మరణమో తెలియదు. అప్పటిదాకా కూతురు పడుతున్న బాధలు సుబ్బరాజుగారు ఆ నోటా ఈ నోటా వినివుండకపోలేదు. కాని, తన మాట వినని ఫలితమేమిటో తెలుసుకున్నాక కూతురే వెనక్కి వచ్చేస్తుందని ఆశించాడు. యిలా శవం వస్తుందని ఊహించలేకపోయాడు. ఆగ్రహోదగ్రుడై పాలేళ్ళని  వెంటేసుకుని వెళ్ళి జమీందార్ని చావచితక్కొట్టాడు. ఈడ్చుకెళ్ళి అతని చెరుకుతోటలోనే అతణ్ణి సజీవంగా పాతిపెట్టి, మనవరాల్ని వెనక్కి తెచ్చేసుకున్నాడు. యిప్పటికీ అక్కడ చెరుకు పంట కాపంతా చేదుగానే వుంటుందని అంటారు.

మనవరాలు రేణుకాదేవి ముమ్మూర్తులా కూతురి పోలికల్తోనే ఎదుగుతుండటం చూసాకా, ఆమెను కూడా బయటి ప్రపంచానికి పణంగా పెట్టడానికి యిష్టపడలేదు సుబ్బరాజుగారు. తన రెక్కల క్రిందే దాచేసుకోవాలనుకున్నాడు. దరిమిలా ఆ యింట్లో ఆయన మరో యిరవయ్యేళ్ళు బతికాడు. అన్నాళ్ళూ ఆ తాతామనవరాళ్ళెలా బతికారో బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. పొలాలు కౌలుకి వదిలేశాడు. గుడిని పట్టించుకోవడం మానేసాడు. ఎప్పుడో రథసప్తమికి ఊరివాళ్ళే చొరవజేసుకుని రథాన్ని ఊరేగించేవారు. పొద్దస్తమానం మనిషెత్తు వుండే బయటి అరుగుల మీద పడక్కుర్చీలో కూర్చుని పావురాళ్లకి నూకలు చల్లేవాడు. పాలేర్లే బయటికెళ్ళి చేయాల్సిన కాసిని పనులూ చేసిపెట్టేవారు.

రేణుకాదేవి యుక్తవయస్సుకొచ్చేసరికి ఆయన చనిపోయాడు. యిక ఆమె బయటకి రాక తప్పదని శ్రీపాదపట్నం ఎదురుచూసింది. ఎవరూ బయటకి రాలేదు. భవంతి అదే నిశ్శబ్దాన్ని యథాతథంగా కొనసాగించింది. ఆ నిశ్శబ్దం వెనుక ఏవో ఘోరాలు ఊహించబడ్డాయి. అవన్నీ ఊరంతా పుకార్లుగా ప్రచారమయ్యాయి. ఆ దారంటా పోయే వాళ్ళు తలెత్తి చూస్తే అప్పుడపుడూ కిటికీ దగ్గర ఆమె ముఖం కన్పించేది. అది ఎపుడో గాని క్రిందకి చూస్తూ కన్పించేది కాదు. ఎక్కడో ఏటి కావల క్షితిజరేఖ వైపు చూస్తూ కనిపించేది. మొదట్లో ఆ ముఖంతో ప్రేమలో పడిపోయినవారెందరో వున్నారు. వాళ్ళెవరూ సాహసించని తెంపరితనం ఊళ్ళో ఓ భూస్వామి కొడుకు ప్రదర్శించాడు. ఈ ప్రపంచంలో తన మగతనానికి నిషిద్ధం ఏమీ లేదన్న గీర గలవాడు కావడంతో ఒకనాడు తెగించి ఎత్తు అరుగుల మెట్లెక్కి భవంతి లోపలికి వెళ్ళాడు. సాయంత్రానికి పిచ్చివాడై బయటికి వచ్చాడు. అతణ్ణించి తలాతోకా వున్న సంగతేదన్నా రాబట్టాలని వూరివాళ్ళు విఫల ప్రయత్నాలు చాలా చేశారు. బెదురు కళ్ళతో, చొంగ కార్చుకుంటూ, కన్నీరుమున్నీరవుతూ, “ఖాళీ ఊయల బల్ల ఊగుతోంది”, “మెడ తెగిన గొర్రెకి కళ్ళు బతికే వున్నాయి”, “కుక్కంత గండు చీమ కాపలా కాస్తుంది”... యిలా పరస్పరం సంబంధం లేని గజిబిజి దృశ్యాలు నెమరువేసుకు వణికిపోయాడు. ఈ సంఘటన ఊరివాళ్లకు కోపం తెప్పించింది. కొందరైతే భూతవైద్యుల్ని రప్పించి భవంతి వాకిట ముగ్గులేయించి నిమ్మకాయలు పెట్టి పూజలు కూడా చేయించారు. కానీ ఏ ప్రయత్నమూ దాని నిశ్శబ్దాన్ని భంగపరచలేకపోయింది.

జరిగిన అనర్థానికి కారణం మొదట్లో రేణుకాదేవే అనుకున్నారు జనం. ఆమెను ద్వేషించారు. ఆ కొన్నాళ్ళు మగరాయుళ్ళు భవంతి ముందు గుంపులుగా చేరి చుట్టలు కాలుస్తూ గుసగుసగా మాట్లాడేవారు. అమ్మలక్కలు కిటికీ వైపు మెటికలు విరిచేవారు. ఒక రథసప్తమినాటి ఊరేగింపులో నయితే, కొంతమంది దుడుకు కుర్రాళ్ళు రథం చిటారుకొమ్ము దాకా ఎక్కి, అక్కణ్ణించి ఒకే ఎత్తులో వుండే భవంతి కిటికీ మీదకి అరటిపళ్ళూ, కొబ్బరి పెచ్చులూ విసిరారు. కిటికీ ఊచల్లోంచి దూరిన ఓ పెచ్చు తగిలి ఆమె నుదురమ్మటా రక్తం కారడం కూడా చూశారు. ఆమె బాధతో తల పట్టుకుని కిటికీ తలుపు వేసేసింది. కక్షతో ఆమె ఏ దుష్టశక్తి ప్రయోగిస్తుందోనని జనం భయపడ్డారు. ఆ కుర్రాళ్ళ జీవితానికి అదే ఆఖరు రాత్రి అన్నట్టు తల్లులు శోకండాలు పెట్టారు. కానీ ఎవరికీ ఏమీ కాలేదు. దాంతో భూస్వామి కొడుక్కి పిచ్చెక్కడానికి కారణం సుబ్బరాజుగారి ప్రేతాత్మేననీ, ఆమె కాదనీ తీర్మానించారు. ఆ ప్రేతాత్మ కూడా జోలికి వచ్చినవాళ్ళనే పట్టించుకుంటున్నట్టు తోచింది. దాంతో కొన్నాళ్లకి అంతా భవంతిని పట్టించుకోవడం మానేసారు. దాని పసుపుగోడల మీద బొగ్గుతో పుర్రెబొమ్మలు గీసి, హెచ్చరికలు రాసారు.

యీ సంఘటనల వల్ల రాజవీధి మర్యాద మాత్రం దిగజారిపోయింది. ఒకప్పుడు ఆ వీధమ్మటా గేదెల్ని తీసుకెళ్ళాల్సి వస్తే వాటి పేడ నేల మీద పడకుండా రైతులు వెనక తట్టలు పట్టుకుని నడిచేవారు. యిప్పుడు అవి వేసిన పేడలు అలానే వీధిలో ఎండిపోతున్నాయి. వీధిలో సందడంతా చచ్చిపోయింది. గుడికి వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. దాంతో పూల కొట్లు పండగకు తప్ప తెరవటం లేదు. సత్రం పాడుబెట్టేశారు. అప్పటిదాకా శ్రీపాదపట్నానికి నడిబొడ్డుగా మెలిగిన ఈ వీధి క్రమేపీ పక్కకి నెట్టివేయబడింది. ఊరు మరో వైపు ఎదిగింది. ఊరికి అటుచివర గడియారస్తంభం వున్న దుకాణాల కూడలి నడిబొడ్డుగా మారింది. ఏటి వొడ్డున రాజవీధి మాత్రం ఓ శిథిలవాడగా మిగిలింది.

రోజులు గడుస్తున్నాయి. రేణుకాదేవి రోజులెలా గడుస్తున్నాయో మాత్రం ఎవరికీ తెలియదు. ఆమెకి పావురాలే తిండి తెచ్చి పెడుతున్నాయనుకునేవారు. శ్రీపాదపట్నం పావురాళ్ళు అంగళ్ళలో షావుకార్లు విసిరిన నూకల్తో సరిపెట్టుకోక, ఒక్కోసారి తిండిపదార్థాలూ నిత్యావసరవస్తువులూ కూడా దొంగిలించడమే దీనికి సాక్ష్యంగా కనపడేది. దీనికి తగ్గట్టే ఆ భవంతి కిటికీ చుట్టూ పొడుచుకు వచ్చినట్టుండే గూడు ఎప్పుడూ పావురాల్తో కిటకిటలాడుతూ వుండేది. ఆమె ఎవరికి రాణి అయినా కాకపోయినా ఆ పావురాళ్లకి రాణిలానే కన్పించేది. అవి కబుర్లూ, కష్టాలూ, గొప్పలూ, చాడీలూ అన్నీ ఆమెతోనే ఏకరువు పెట్టుకునేవి. మార్దవమైన, స్నేహితం తెలిసిన రాణి! ఈ బూడిదరంగు పావురాళ్ళన్నింటిలోనూ ఆమెకు ఒక తెలుపురంగు పావురం అంటే బాగా మచ్చిక. మిగిలినవన్నీ ఊళ్ళో పచార్లకు, సొంత పెత్తనాలకూ అటూయిటూ పోతూ వస్తూ వున్నా, అది మాత్రం ఎక్కువ కిటికీ దగ్గరే గడిపేది. దాన్నొక్కదాన్నే ఆమె కిటికీ ఊచల మధ్య నుంచి లోపలికి తీసుకునేది. వళ్ళో పెట్టుకు ఆడుకునేది. ఒకవేళ ఈ పావురం కూడా తన గూటి వ్యవహారాలు చక్కదిద్దుకోవడానికి బైటకి వెళిపోతే, ఆమె కలం కాగితాలూ పుచ్చుకుని బొమ్మలేసుకునేది. ఒకసారి ఈ తెల్ల పావురాన్ని కాగితం మీద ఒంటికాలితో నిలబెట్టి దాని గోళ్ళ అంచులమ్మటా కలం కదుపుతూ గీసి, వచ్చిన ఆకృతిని చీకటాకాశంలో పెద్ద నక్షత్రంగా వాడుకుంటూ బొమ్మ గీసింది. గోడకి అతికించిన ఆ బొమ్మ చూసినపుడల్లా తెల్ల పావురం రొమ్ము విరుచుకునేది.

రేణుకాదేవి దగ్గర తనకు దక్కింది చాలా ప్రత్యేకమైన హోదా అని దానికి తెలుసు. దానికి తోడు, ఆమె చేతి స్పర్శ తన కుచ్చుటీకల కన్నా మృదువైందేదో తడుముతున్నట్టూ, ఆమె వడి వెచ్చదనం తన గూటి కన్నా భద్రమైందేదో చుట్టూ ఆవరించుకున్నట్టూ వుండేవి. దాంతో విడిచిపెట్టేది కాదు. ఆమెకు మరింత ముద్దొచ్చే చేష్టలే ప్రదర్శించాలని తపించేది. ఆమె మనసు విరిగేలా ఎపుడూ ప్రవర్తించేది కాదు. అయితే కొన్నాళ్ళకే ఆమె మనసు విరిగే పరిస్థితి కలిగింది. పావురం వల్ల కాదు, మరో వైపరీత్యం వల్ల. ఒకనాడు ఆమె వళ్ళో ఒదిగి అర్థనిమీలిత నేత్రాల్తోవున్న పావురంపై రేణుకాదేవి భళ్ళున గుక్కెడు రక్తం కక్కింది. పావురపు తెల్లని వళ్ళంతా రక్త స్నానం చేసినట్టయింది. అది బెదిరి కిందకు దూకింది. రేణుకాదేవి బాధతో కడుపుపట్టుకుని మెలి తిరుగుతూ నేల మీదకు జారి దొర్లసాగింది. పావురం బెంబేలెత్తి రెక్కలల్లార్చుకుంటూ ఆమె చుట్టూ గెంతింది. కిటికీ ఊచల్లోంచి మిగతా పావురాలూ తలలు లోపలికి పెట్టి కళవళంగా అరవసాగాయి. ఎవరికీ ఏమీ పాలుపోలేదు. చివరికి తెల్లారగట్ల ఎప్పటికో ఆమె తనంతటతానుగా స్పృహలోకి వచ్చింది.
(ఇంకా ఉంది)

3 వ్యాఖ్యలు: