లిఫ్టు పురాణం - Lift Puranam - రెండవ భాగం

లిఫ్టు పురాణం - Lift Puranam - రెండవ భాగం

Meher

Jaabilamma Team

సరే, ఇక నా చేతుల్లో బండి ఉన్నప్పుడు నేను లిఫ్టులు ఇచ్చే పద్ధతి గురించి చెప్తాను. నిజం చెప్పాలంటే, పైన అన్ని పాయింట్లు రాశాను కదా, ఆ పాయింట్లేవీ నేను లిఫ్టు ఇవ్వబోయే వ్యక్తి విషయంలో పూర్తవుతున్నాయా లేదా అన్నది ఎప్పుడూ ఆలోచించను. ఆ క్షణం ఏమనిపిస్తుందో అదే పాత్ర వహిస్తుందేమో అనిపిస్తుంది. నేను లిఫ్టు ఇచ్చే సందర్భాల్ని నెమరు వేసుకుంటే ఈ కామన్ పాయింట్లు తట్టాయి:

1) లిఫ్టు ఇవ్వాలా వద్దా అన్నది నేను వెళ్తున్న పని అర్జెన్సీని బట్టి ఉంటుది. తీరుబడిగా పోతున్నప్పుడు ఎవరు అడిగినా లిఫ్టు ఇవ్వటానికి సంసిద్ధంగానే ఉంటాను.

2) కొన్ని ముఖాలు ఊరికే ఎందుకో మనకు నచ్చవు. అలాంటి ముఖాలకు ఇవ్వను. వాళ్లు సాధారణంగా నా సమవయస్కులై ఉంటారు. (లిఫ్టు అడిగేటప్పుడు నా ముఖం అలాంటి ముఖాల జాబితాలోకి వస్తుందేమో ఎప్పుడూ ఆలోచించలేదు, వస్తుందేమో).

3) ఎవర్నన్నా లిఫ్టు ఎక్కించుకున్నాకా, నా బండి నిర్జన ప్రదేశాల్లో పోతున్నప్పుడు హఠాత్తుగా ఆ వెనకనున్నవాడు నా పీక మీద కత్తి పెట్టి, బండాపించి, “తియ్యరా పర్సు” అంటాడేమో అని ఒక్కసారైనా భయపడతాను.

4) ఎవరి కన్నా లిఫ్టు ఇచ్చినపుడు బండి మామూలు కన్నా స్పీడుగా పోనిస్తాను – అతను ఏదో అర్జంటు పని మీదే లిఫ్టు అడిగుంటాడు కదా, స్లోగా తీసుకెళ్తే ఎలాగా అని.

సరే ఇక నేను లిఫ్టు ఇచ్చిన సందర్భాల్లో బాగా గుర్తుండిపోయినవి చెప్పమంటే మొన్న వారమే ఇచ్చిన ఒక లిఫ్టు గుర్తొస్తుంది.

జూబ్లీహిల్స్ చెక్పోస్టు దగ్గర పెద్దమ్మ గుడికి వెళ్లే మలుపు తిప్పీ తిప్పగానే ఒక ముసలాయన (అంటే మరీ వంగిపోయిన ముసలాయన కాదు, అరవయ్యేళ్లుంటాయేమో) చేయి ఊపాడు. ఎక్కించుకున్నాను. ఆయన ఫింఛనాఫీసు నుంచి వస్తున్నాడు. అక్కడ ఏదో ప్రభుత్వ పథకం ప్రకారం ఈయనకు నెలకు రెండొందలు రావాలి. కానీ ప్రభుత్వ రికార్డుల్లో ఈయన ఆల్రెడీ చచ్చిపోయాడని రాశారట. అందుకని అక్కడ దెబ్బలాడి, ఏదో అల్టిమేటం ఇచ్చి వస్తున్నాడు. మొత్తం గవర్నమెంటు మీదా వ్యవస్థ మీదా పగతో ఉన్నాడు.

బండెక్కగానే తనను ఎక్కించుకున్నందుకు కాసేపటి వరకూ నన్ను చాలా పొగిడాడు. ఆ తర్వాత తన బాధ చెప్పుకున్నాడు. ఆయనది నెల్లూరు, రిటైరయ్యాడు, ఇప్పుడు సిటీలో ఏదో అపార్టుమెంటు ముందు కాపలా పని చేస్తున్నాడు. ఫింఛనాఫీసు వాళ్లని దారంతా తిడుతూనే ఉన్నాడు. ఆయన ఉద్యోగం చేసింది తమిళనాడులో. అక్కడి ప్రభుత్వానికీ ఇక్కడి ప్రభుత్వానికీ మధ్య తేడా ఎత్తి చూపుతున్నాడు. కాంగ్రెస్ మళ్లీ రాదంటున్నాడు. మధ్య మధ్యలో నేను కాస్త స్పీడు పెంచినపుడల్లా, “నెమ్మదిగా పోదాం బాబూ కంగారే వుంది” అంటూ నన్ను నియంత్రిస్తున్నాడు, మళ్లీ “థాంక్స్ బాబూ మీరు వచ్చారు కాబట్టి ఇలా వెళిపోతున్నాను” అని తెగ ఎగదోస్తున్నాడు. ఇలా శిల్పారామం దాటే దాకా అతను ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన జీవిత పరిస్థితులన్నీ టూకీగా ఏకరువు పెట్టేశాడు.

ఆయన కుంటి తమ్ముడూ, ఆ తమ్ముడీ మధ్య పెట్టుకున్న బజ్జీల బండీ వగైరా. నెల్లూరి యాసలో మాట్లాడుతున్నాడు, వయసైపోయినా ఇంకా కుర్రతనం వదలని మనసుతో అభాసుపాలయ్యే ముసలాడు. చిన్న లిఫ్టు ఇచ్చినందుకు అంత ఎందుకు హడావిడి చేస్తున్నాడని నాకు మధ్యలో పీకుతూనే ఉంది. ఊరికే వచ్చి కాసేపు దగ్గరగా మాట్లాడి ఒక చిన్న మొహమాటపు అనుబంధం ఎస్టాబ్లిష్ అయ్యేలా చేసి, వెంటనే ఫలానా ఊరు వెళ్లాలి, లేదా ఫలానా అవసరం ఉందీ అని డబ్బులడిగి కాదనలేని పరిస్థితిలోకి తెచ్చి ఇబ్బంది పెడ్తారు కదా కొంతమంది… ఈయన ఆ కోవకు చెందడు కదా అని అనిపించింది. కానీ లిఫ్టు ఎక్కాకా సైలెంటుగా దిగిపోయేవాళ్లనే చూశాను గానీ, ఇలా ఇంత మాట్లాడేవాళ్లు తారసపడలేదు. అదొక్కటీ సరదాగా అనిపించింది. ఇంతా అయ్యాకా అతను చివరికి డబ్బులడిగి ఈ అనుభవాన్ని కల్తీ చేస్తాడేమో అని చిన్న జంకు. కానీ అతని దృష్టిలో కల్తీ చేయటానికి ఇదో పెద్ద అనుబంధం కాదేమో. ఇలాంటి పాసింగ్ అనుభవాల్ని మళ్లీ గుర్తు చేసుకునేవిగా భావించే నాలాంటి ఏబ్రాసి స్థితిలో లేడేమో. శిల్పారామం తర్వాత ఏదో బిల్డింగ్ కాంప్లెక్సు దగ్గర ఆపమన్నాడు.

దిగాకా నేను వీడ్కోలు సూచకంగా నవ్వాను. నేను ఎక్కడ గేరు మార్చేస్తానో అన్న తొందరలో ఆయన వెంటనే, “రెండు గంటలు ముందే వచ్చేశాను సార్, టీ తాగటానికి ఓ పది రూపాయలుంటే ఇస్తారా” అనేశాడు. ఇప్పటిదాకా ఏర్పడిన అనుబంధపు ప్రాతిపదికన నేను ఆయనకి పది రూపాయలు ఇవ్వటం పెద్ద విషయం కాదు. కానీ అతని వైపు నుంచి ఈ అనుబంధాన్ని ప్రతిపాదించటం వెనుక కారణమే చివర్లో ఈ పదిరూపాయలు అడగటం అయినపుడు, అంటే నా వైపు నుంచి ఇది ఒక చిన్న అనుబంధం అయి, అతని వైపు నుంచి ఒక పథకం మాత్రమే అయినపుడు, నేను ఆ పది రూపాయలు ఇస్తే అతని పథకాన్ని గెలిపించినట్టు, ఆ తర్వాత అతను ఆ పది రూపాయలు జేబులో పెట్టుకుంటూ “బుట్టలో పడ్డాడు వెధవ” అనుకుంటే…? అది నాకు నచ్చలేదు, కాబట్టి “ఇవ్వను” అని చెప్పి బండి స్టార్ట్ చేసేశాను. కానీ కాస్త దూరం పోగానే “ఇవ్వను” అన్నందుకు ఏమనుకునుంటాడో అన్న ఊహ వచ్చింది.

రచనలో గొప్ప విషయమేంటంటే, రాస్తూ పోతుంటే కొన్ని అనుకోనివి హఠాత్తుగా మనల్ని పలకరించి నిలవరిస్తాయి. ఇప్పుడు ఇదంతా రాస్తుంటే, హఠాత్తుగా, అస్సలు సంబంధమే లేకుండా ఒక జ్ఞాపకం నా ముందుకు వచ్చి నిల్చుంది.

అప్పుడు ఇంటరు చదువుతున్నాను. ఎవరో ప్రైవేటు కాలేజీలో పాఠాలు చెప్పే మాస్టారు సాయంత్రం మాకు వాళ్ల మేడ మీద ట్యూషన్లు చెప్పేవారు. ఆ ట్యూషన్ కి అన్ని తరగతుల వాళ్లూ వచ్చేవారు. ఒక్కో గంట ఒక్కో క్లాసుకి చెప్పుకుంటూ పోయేవారు. చీకటి పడే వరకూ అన్ని తరగతులూ ఆ విశాలమైన మేడ మీద చెల్లా చెదురుగా జట్లు జట్లుగా విడిపోయి ఉండేవి. చీకటి పడ్డాకా మాత్రం ఆ మేడ మధ్యన ఉన్న చిన్న షెడ్డులోనే లైటు ఉండేది కాబట్టి అందరూ అక్కడ గుమికూడేవారు. ఒక రోజు రాత్రి బాగా వర్షం పడుతోంది. ట్యూషన్ మాత్రం అయిపోయింది. పిల్లలెప్పుడూ తడవటానికి జడవరు కదా. చాలామంది వెళిపోతున్నారు. నేను నా గొడుగు తీసుకుని మేడ దిగి గేటు తెరుచుకుని బయట రోడ్డు మీద వడి వడిగా అడుగులేసుకుంటూ పోతున్నాను. ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక ఆరో తరగతి పిల్ల అనుకుంటా, “అన్నయ్యా ఆడ దాకా రావద్దా” అంటూ చొరవగా నా గొడుగులోకి దూరేసింది.

చిన్న గౌను వేసుకుంది, పుస్తకాలు ఒబ్బిడిగా హత్తుకుంది. తర్వాత మేం ఒక సందు అంతా కలిసే నడిచాం. ఆ సందు అంతా వర్షం నీరు చీలమండల దాకా పారుతోంది. ఒక గొడుగు కింద నడిచాకా పరిచయాలు తప్పవు కదా. ఆ ఆరిందా పిల్ల ఏం మాట్లాడిందో గుర్తు లేదు, నేను ఏం మాట్లాడేనో కూడా గుర్తు లేదు. మా ఇల్లే ముందొచ్చింది, ఆ పిల్ల తర్వాత వర్షంలో తడుస్తూ వెళిపోయింది. ఈ జ్ఞాపకం నేను ఈ లిఫ్టు పురాణం గురించి రాస్తుండగా గుర్తుకు రావటం చిత్రం కదా! మైండ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్. ఒక్కోసారి దాన్ని నమ్మాలి. బహుశా నాకు గుర్తుండిపోయిన బెస్ట్ లిఫ్టు ఇదే అనుకుంటా.

(సమాప్తం)

©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి