రంగు వెలిసిన రాజుగారి మేడ కథ - రెండవ భాగంతర్వాతి రోజులు పావురాళ్లకి భారంగా నడిచాయి. ముఖ్యంగా తెల్లపావురాయికి. దానికి యిదివరకటి మాలిమి లేదు. రేణుకాదేవి యిదివరకట్లా వుండట్లేదు. వళ్ళో తీసుకు నిమరడమైతే చేస్తోంది గానీ, ఆ పావురాయికీ తెలుస్తోంది, తన స్థానంలో వేరే ఏ పావురమున్నా, అసలు ఏదన్నా కాకి వున్నా కూడా అట్లానే నిమురుతుందని. ఆమె ఎక్కువ సమయం పందిరిమంచం మీద నిద్రపోవడంలోనే గడుపుతోంది. కిటికీ దగ్గరకు రావడం తగ్గిపోయింది. లోపలికి వచ్చే చొరవ ఎలాగూలేని పావురాలు ఏం చేసేది లేక కిటికీ దగ్గరే చక్కర్లు కొడుతున్నాయి. ఆ చొరవ వున్న తెల్ల పావురం కూడా, ఈ నిర్లక్ష్యం పట్ల తాను కినుక చెందినట్టు ఆమె గ్రహించాలనీ, తను లేని లోటు తెలిసొచ్చి ఆమే స్వయంగా రమ్మనే దాకా లోపలికి వెళ్ళకూడదనీ నిశ్చయించుకుని, ఎక్కువగా బయటే మసలుకుంటోంది. ఒకనాటి ఉదయం కిటికీ దగ్గర మిగతా పావురాళ్ళు గుంపుగా గుమికూడటం చూసి, వాటిని ఆదరాబాదరాగా తప్పించుకొని, తెల్లపావురం లోపలికి వెళ్ళేసరికి, రేణుకాదేవి నేల మీద బోర్లా వాలి తెల్ల కాగితం మీద ఏదో గీస్తోంది. అలికిడి విని తలెత్తి అలసటగా నవ్వింది కూడా. పావురాయి ఊపిరి పీల్చుకుని, గెంతుకుంటూ ఆమె భుజం ప్రక్కకు చేరింది. ఆమె వేసే బొమ్మని తల చకచకా వంకర్లు తిప్పుతూ  ఆసక్తిగా చూసింది. అర్థం కాకపోయినా ఆమెను ఉత్సాహపరిచేందుకు రెక్కలల్లాడించి కువకువలాడింది. ఆమె నవ్వుతూ పావురాన్ని చేతుల్లోకి తీస్కొని ఎండిన రక్తం మరకలతో వున్న దాని శరీరాన్ని జాలిగా నిమిరింది. ముద్దుపెట్టుకుంది. తర్వాత అప్పటిదాకా గీసిన కాయితాన్ని మడిచి దాన్నో దారంతో పావురాయి కాళ్లకు కట్టింది. పొందిగ్గా దోసిట్లో ఎత్తుకు కిటికీ దగ్గరకు వచ్చి ఊచల సందుల్లోంచి గాల్లోకి వదిలింది. మిగతా పావురాళ్ళు కొంత దూరం కుతూహలంతో దాని వెనక ఎగిరాయి గాని, అది కసురుకోవడంతో తిరిగి కిటికీ దగ్గరకు వెళిపోయాయి.

ఎగరడమైతే ఎగిరింది గాని, పావురానికి ఎటువెళ్లాలో తెలియలేదు. కానీ రేణుకాదేవి దగ్గర పాత హోదా తిరిగి దక్కిన ఉత్సాహం ఎటో ఎగరమంటోంది.  రేవు దగ్గర రావి చెట్టు కొమ్మల్లోంచి పలకరించిన పిట్టల్ని పట్టించుకోకుండా, పడవల తెరచాపల్ని చుట్టుతిరుక్కుంటూ, ఏరు దాటి ఉత్సాహంగా క్షితిజరేఖ వైపు సాగిపోయింది. ఎన్నో ఊళ్ళూ పొలాలూ దాటుకుంటూ పోయింది. ఒక చోట ఊరి చివర పొలం మధ్యనున్న ఓ గుడిసె దాన్ని ఆకర్షించింది. ఆ గుడిసె వాకిట్లో పాతిన కర్ర పైని చెక్కగూట్లో పావురాల సందడి కనిపించింది. ముఖ్యంగా పెంటిపావురాల వాసన మదమెక్కించేట్టు వస్తోంది. ఎగురుతున్న పావురం కాస్తా రెక్కల జోరు తగ్గించి, ఆ గూటివైపు దిగింది. దిగుతోంటే తెలిసింది అదో కుమ్మరి గుడిసె అని. కుమ్మరి వాడు అడుసు తొక్కడంలో మునిగి వున్నాడు. పావురం ఉబలాటంగా వచ్చి చెక్కగూట్లో వాలింది. అనుకున్నట్టే అక్కడున్న వాటిల్లో అందమైన పెంటిపావురమొకటి వుంది. దాని వంటి తెలుపూ, రెక్కల నాజూకూ, తోక సోకూ!... పావురానికి కైపెక్కిపోయి దాని చుట్టూ గెంతసాగింది. కాని అదేమంత ఉత్సాహం చూపించలేదు సరి కదా, దీని వంటిపై రక్తపు మరకలు చూసి రోతగా మొహం పెట్టి పక్కకు పోయింది. తెల్లపావురం అంత త్వరగా వెనక్కి తగ్గేది కాదు.

కానీ యింతలోనే గూటి చుట్టుప్రక్కలా, పైనా వున్న మిగతా పావురాళ్ళన్నీ వచ్చి దీన్ని అవతలికి పొమ్మని కసురుకోవడం మొదలెట్టాయి. ఈ గలాటా అంతా విన్న కుమ్మరివాడు కొంపదీసి ఏదన్నా గ్రద్ద వచ్చివాలిందేమోనని కంగారు పడి గూటి దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. సరిగ్గా అపుడే గూట్లోంచి నెట్టబడిన తెల్లపావురం సరాసరి వాడి చేతుల్లో పడింది. అయినా అది సిగ్గులేకుండా యింకా గూట్లో పెంటిపావురం కేసే నిక్కినిక్కి చూస్తోంది. తాను కుమ్మరివాడి చేతుల్లో వున్నాననీ, వాడు తన కాళ్ళకున్న కాగితం చుట్టని విప్పదీసుకుంటున్నాడనీ కూడా దానికి స్పృహ లేదు. వాడు కాగితం తీసుకుని పావురాన్ని నేల మీదకు వదిలిపెట్టాడు. పావురానికి అదో కొత్త లోకంలా వుంది. ప్రేమకి అనువైన కొత్త బంగారు లోకం! కుమ్మరి వాడు గుడిసంతా కళ్ళకింపుగా సర్దుకున్నాడు. చుట్టూ దడికి బదులు రంగురంగుల అయిరేణి కుండలు పేర్చుకున్నాడు.

గుడిసె మీదకి గుమ్మడి పాదులు దట్టంగా పాకివున్నాయి. గుడిసె చూరు క్రింద సారె తిరుగుతోంది. వాకిట్లో ఓ మూల ఆవం తెల్లటి పొగలు కక్కుతోంది. వాకిలి దాటితే చుట్టూ పచ్చగా పొలాలు ఆవరించి వున్నాయి. ఓ పద్ధతంటూ లేకుండా విసిరేసినట్టున్న ఈ అందాలన్నీ, గుడిసె వాకిట్లో నిలబెట్టిన పావురాల గూటిని ములుకుగా చేసుకుని చుట్టూ పరిభ్రమిస్తున్నట్టున్నాయి. ఆ గూటిలో పావురాలన్నింటి మధ్యా రాణిలాగా తన పావురం! తెల్లపావురానికి, తననిలా పట్టి లాగేస్తోంది ఈ అందానికి మధ్యలో వున్న పెంటిపావురమా, లేక దాని చుట్టూ వున్న ఈ అందమా అన్నది అర్థం కాలేదు. ఆలోచించలేక తల విదుల్చుకుంది. ఓ ప్రక్క కుమ్మరి వాడు అప్పటిదాకా అడుసు తొక్కిన బురద కాళ్ళతోనే గుడిసె గుమ్మంలో కూచుని రేణుకాదేవి పంపిన బొమ్మని ఏకదీక్షగా చూస్తున్నాడు. ఇదే అదనుగా మళ్ళీ ఓసారి గూటి మీదకు ఎగురుదామా అని చూసింది తెల్లపావురం. కానీ పైన అవి యింకా గోల చేస్తూనే వున్నాయి. పెంటిపావురమైతే లోకంలో ఆడజాతి నిరసన అంతా తన కళ్ళల్లోనే పెట్టుకు చూస్తోంది. తెల్లాపావురం మాత్రం ఆ నిరసనను పెద్దగా పట్టించుకోలేదు. రేణుకాదేవి మిగతా పావురాలన్నింటినీ కాదని దీన్ని మాలిమి చేసినప్పటి నుంచీ, దీనికి తన ఆకట్టుకునే శక్తి మీద బోలెడు భరోసా వచ్చేసింది. అయితే అన్నీ తొలిచూపులోనే అయిపోవాలంటే ఎలాగని తనకు తానే సర్ది చెప్పుకుని, మళ్ళీ వచ్చి ప్రయత్నిద్దాంలే, అప్పటికీ కాకపోతే, మళ్ళీ మళ్ళీ వచ్చి ప్రయత్నిద్దాం లెమ్మనుకుంది.


ఈ నిర్ణయం యిచ్చిన ఉత్సాహంతో ఉవ్వెత్తున రెక్కల మీద లేచి వచ్చిందారినే వెనక్కుపోయింది. యిక మర్నాటి నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి. రోజూ రేణుకాదేవి ఏదో బొమ్మ గీసి కాళ్లకు కట్టి పంపించడం, తెల్లపావురం తిన్నగా ఈ గుడిసె దగ్గర వచ్చి వాలడం. దానికి ఒకటర్థమైంది, రేణుకాదేవి పంపే బొమ్మలేవో ఈ కుమ్మరి మొహాన పడేస్తే, ఆ తర్వాత తాను గూట్లో దూరి పెంటిపావురంతో ఎన్ని సరాగాలాడినా, అది పెంకిగా ఎంత గోల చేసినా, కుమ్మరి వాడిక పట్టించునే ధ్యాసలో వుండడు. కాబట్టి అది వచ్చి వాలీవాలడమే కుమ్మరి వాడెక్కడుంటే అక్కడ వాలేది. వాడు అడుసు తొక్కుతున్నా, సారె తిప్పుతున్నా, కుండలకు మట్టు కొడుతున్నా, బానల్ని ఆవంలో కాల్చుతున్నా, ఎంత హడావిడి పనిలో వున్నా సరే, అన్నీ వదిలేసి పావురం దగ్గరకు వచ్చేసేవాడు. పావురం కాలికి కట్టివున్న కాగితం విప్పుకుని, ఓ మూలకి పోయి, దాన్నే చూస్తూ కూచునేవాడు. ఈ పరధ్యాసని అనుకూలంగా మార్చుకుని తెల్లపావురం నానా తైతక్కలూ ఆడి తొందర్లోనే పెంటిపావురాన్ని గెల్చేసుకుంది.

కుమ్మరివాడు యువకుడు. ఎన్నేళ్ళమట్టో సారె తిప్పుతున్న భుజాలతో, అడుసు తొక్కుతున్న కాళ్ళతో శరీరమైతే బిరుసెక్కింది గానీ, సారెపై మట్టిముద్దని వేలి అంచుల నిపుణమైన కదలికల్తో కుండగా మలిచేటప్పుడు కలిగే సీతాకోక రెక్కంత పల్చనైన పులకలురేపే ఆనందానికి స్పందించడంలో, మనసు మాత్రం స్నిగ్ధత్వాన్ని కోల్పోలేదు. అవే కుండలూ అవే బానలూ ఎన్నిసార్లు చేసినా, అంచు దగ్గర కొత్తగా పెట్టిన మెలికో, మూత మీద కొత్తగా తిప్పిన వంపో అతనికి ప్రతీ కుండ తయారీలోనూ ప్రత్యేకమైన సాఫల్య సంతృప్తిని కలిగించేది. అతని పనంటే అతనికి ప్రాణం. ఎలాగూ పూట గడవడానికి అక్కరకొస్తుంది కాబట్టి కానీ, లేదంటే ఎదురుడబ్బిచ్చైనా చేసేవాడే. రాత్రి పనికట్టేసి గుడిసె వాకిట్లో నులకమంచం వాల్చుకుని పడుకున్నపుడు మాత్రం, గుండెని బంకలా అంటుకున్న ఖాళీతనమేదో ఆవిరిలా అతణ్ణి ఆవరించుకునేది. ఈమధ్య పావురం తెస్తున్న బొమ్మలతో ఈ ఖాళీ కొంత భర్తీ అయింది.


యిదివరకట్లా పైన నక్షత్ర ఖచిత ఆకాశమూ, అడపాదడపా తాగితూల్తున్న నక్షత్రాల్లా వంకర్లు తిరుగుతూ ఎగిరే మిణుగురులూ, ప్రక్కన పావురాళ్ళ గుడగుడలూ... యివన్నీ అతణ్ణి వశపర్చుకోలేకపోతున్నాయి. పడుకున్నపుడల్లా ఆ రోజొచ్చిన బొమ్మ గురించి ఆలోచించేవాడు. అవన్నీ అతణ్ణి ఆకట్టుకున్నాయి. బూడిదరంగు పావురాల్ని పూసిన రావిచెట్టూ, తెరచాపలు విడిచి వీధుల్లో తేల్తూ ప్రయాణిస్తూన్న మేడలూ, గిట్టలకు అంటిన పుప్పొడితో దేవగన్నేరు పూల చుట్టూ తుమ్మెదరెక్కల్తో చక్కర్లు కొడుతున్న బుల్లి గేదెలూ... యిలా వింతగా వుండేవి ఆ బొమ్మలు. ఒక్కో బొమ్మలో ఆహ్లాదం వుండేది, ఒక్కో బొమ్మలో దిగులు వుండేది, కానీ ప్రతీ బొమ్మలోనూ ఏదో తరుముకొస్తున్న తొందర వుండేది. బొమ్మల గీతల్లో ఏదో అందమైన మనసు శ్రద్ధ పెట్టి గీసినట్టు తెలిపే అపరిపక్వత వుండేది. అది అతనికి బాగా నచ్చింది.


కానీ ఎవరికో నిర్దేశించబడిన ఈ సంకేతాలన్నీ పావురం కామ ప్రకోపం కారణంగా దారి తప్పుతున్నాయని ఆ పంపేవాళ్ళకెలా తెలియజెప్పాలో కుమ్మరివాడికి తెలిసింది కాదు. పావురం వెనక్కి వెళ్తున్నపుడు తిరుగుటపాలో ఏదన్నా రాసి పంపుదామంటే అతనికి చదువు రాదు. పైగా బోలెడంత కుతూహలం పెరిగిపోతోంది. చదువైతే రాదుగానీ, కుమ్మరిది కుశాగ్రబుద్ధి. ఒకనాడు పావురం తెచ్చిన బొమ్మలో కిటికీ ఊచల్లోంచి కన్పిస్తున్నజనార్దనస్వామి రథం వూరేగింపూ, దాని చిటారు కొమ్మ మీద తాటాకంత రెక్కల్ని అల్లలాడిస్తున్న పెద్ద గ్రద్ద వున్న దృశ్యం చూసాక, ఈ బొమ్మలెక్కణ్ణించి వస్తున్నాయో ఊహించగలిగాడు. కుంభవృష్టిగా వర్షం కురుస్తున్న ఓ రోజు, గుడిసె గొళ్ళెం వేసి, గొడుగు చేతపట్టుకుని, శ్రీపాదపట్నానికి ప్రయాణమయ్యాడు.

శ్రీపాదపట్నం పోవడానికి ఏరు దాటాలి. పడవలో వున్నంతసేపూ బొమ్మలున్న కాగితాల్ని కండువాలో మడతపెట్టి చంకలో దోపుకున్నాడు. తెడ్డేస్తున్న పడవవాడు వాన ధాటికి చుట్ట మాటిమాటికీ ఆరిపోతుంటే కాసేపు తెడ్డేయడం ఆపి కుమ్మరి పట్టుకున్న గొడుగులో దూరి కాల్చుకున్నాడు. చంకలో వున్నవేంటని అడిగాడు. సొమ్ములన్నాడు కుమ్మరివాడు. ఒకే గొడుగులో వున్నాక మాట కలపకపోతే బావుండదని, శ్రీపాదపట్నంలో ఆ యేడు రథంవూరేగింపు ఎలా జరిగిందని అడిగాడు పడవవాణ్ణి.


వాడు పొగాకు ఉమ్ము ఏట్లోకి ఊసి, ప్రతీ యేడూ ముంగటి ఏడు కన్నా నాసిగా జరుగుతోందనీ, ఈ యేడూ అల్లానే అయిందనీ, జనార్దనస్వామి అజాపజా పట్టించుకునేవాళ్ళు లేకండాపోయారనీ, తిరణాలక్కూడా జనం రాటం లేదనీ, వేరే యాపారం పెట్టుకుందారని చూస్తన్నాననీ, యిదిగో పడవ అమ్మకానికే బేరం తెవలట్లేదనీ... మొత్తం కథంతా చెప్పుకొచ్చి, చుట్ట వో చివరి పట్టు పీల్చి, మళ్ళీ ఆదరాబాదరాగా తెడ్డేయడానికి వెళిపోయాడు. ఏనుగు తొండాల్తో కుమ్మరించినట్టు కురుస్తున్న వానలో జనార్దనస్వామి గుడిగోపురం లీలగా కనిపించడం మొదలుపెట్టింది.

(ఇంకా ఉంది )

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి