రంగు వెలిసిన రాజుగారి మేడ కథ - మూడవ భాగంరేవులో దిగి వీధి పైకి నడిచాక అతనికి రాజ భవంతిని ఆనవాలు పట్టడం కష్టం కాలేదు. ఎందుకంటే పావురం తెచ్చిన చివరిబొమ్మ ప్రకారం రథం చిటారుకొమ్మ కిటికీలోంచి కనపడాలంటే అది రెండంతస్తుల భవంతి అయివుండాలి. ఆ వీధిలో రెండంతస్తులున్న భవంతి అదొక్కటే. దాని ఎదుట నిలబడి కాసేపు పై అంతస్తు కిటికీ వైపు చూసాడు. కానీ దళసరి వానతెర వల్ల ఏమీ స్పష్టంగా కనపడలేదు. చివరికి ఎత్తు అరుగుల మెట్లెక్కి, గొడుగు అరుగు మీద ఆరబెట్టి, లోపలికి తొంగి చూస్తూ పిలిచాడు. ఎవరూ పలకలేదు. చాలాసేపు చూసి చూసి యిక లాభం లేదని జంకుతూనే లోపలికి వెళ్లాడు. మొత్తం అంతా తిరిగాడు గానీ ఎవరూ లేరు. ఒక చోట పచ్చగా చెక్క మెట్లు పై అంతస్తుకి వెళ్తున్నాయి. ఎక్కి పైకి వెళ్ళాడు. లోపల గదిలో పందిరిమంచం మీద ఒకామె నిద్రిస్తోంది. లేపబుద్ది కాలేదు. లేచేదాకా వుందాంలే అని గుమ్మానికి ఆనుకుని నిలబడిపోయాడు. అంత అందమైన ముఖం వాడు అదివరకూ కలల్లో కూడా చూడలేదు. చూస్తూ వుండిపోయాడు. నిద్ర మధ్యలో ఓ సారి కళ్ళు తెరిచిన రేణుకాదేవి, యిలా తన గుమ్మం దగ్గర ఆనుకుని వున్న కొత్త మనిషి కూడా తన కలలో భాగమన్నట్టు, పలకరింపుగా నవ్వి మళ్ళీ నిద్రలోకి జారుకుంది. ఆమె కళ్ళు వెంటనే మూసేసినా, ఆమె నవ్వుకు ప్రతిగా కుమ్మరి నవ్విన నవ్వు మాత్రం కాసేపలానే అతని ముఖం మీద తారాడింది. పూర్తిగా నిద్రలేచింతర్వాత కూడా, ఆమె ఏ కొత్తా కనపరచలేదు. యిందాకటి నవ్వుకు కొనసాగింపులాగా పలకరింపుగా నవ్వి, నింపాదిగా లేచి కూర్చుని, లోనికి రమ్మని పిలిచింది.

కుమ్మరి అణకువగా లోనికి వచ్చి తనను పరిచయం చేసుకున్నాడు. ఉత్తరాలు దారి తప్పుతున్న సంగతి చెప్పి, వాటిని ఆమెకి అందించాడు. ఆమె అదేమీ పెద్ద విషయం కాదన్నట్టూ వాటిని తీసుకుని పక్కన పెట్టేసింది. ప్రయాణం సంగతి అడిగింది. అతను ప్రయాణం బానే జరిగిందని చెప్పి, తనకు చదువురానందువల్లనే ఈ విషయం తిరుగు టపాలో పంపలేక స్వయంగా రావలసివచ్చిందని, సంజాయిషీగా ఏదో మొదలుపెట్టాడు. ఆమె ఆ విషయంపై ఆసక్తి చూపించకుండా, కిటికీ దగ్గరున్న కుర్చీ లాక్కుని కూచోమంది. కుర్చీ లాక్కుంటున్నపుడు అతనికి కిటికీ ఊచల దగ్గర వానలో తడవకుండా మునగదీసుకు వణుకుతున్న తెల్లపావురం కనపడింది. ముద్దుగా పలకరించాడు గానీ, అదేమీ గుర్తించనట్టు ఓసారి ముక్తసరిగా కువకువమని మిన్నకుండిపోయింది. కుర్చీ పందిరిమంచానికి ఎదురువేసుకుని కూర్చున్నాక, రేణుకాదేవి అతని వివరాలు అడిగింది. మొదట్లో ఆమె వంటి రాచరికపు మనిషి తనబోటి వాడి జీవితం నుంచి ఏమి తెలుసుకోగోరుతుందని తను అనుకుంటున్నాడో ఆ వివరాలు చెప్పాడు. తన కుమ్మరి పని గురించీ, తను తయారు చేసే సరుకు రకాల గురించీ, ఈ మధ్య గిరాకీ ఎలా వుందన్న దాని గురించి, తమ వంశంలో మంచి పనివాళ్ళ గురించీ... యివన్నీ చెప్పుకొచ్చాడు. ఆమె తలాడిస్తూ వింది. కానీ కాసేపటికే ఒకటి గమనించాడు. ఆమె ఈ విషయాల మీద కన్నా, యివి చెప్పడంలో మాటవరసగా అడపాదడపా దొర్లే తన మనసుకు నచ్చిన విషయాల పట్లే ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. అవి అల్ప విషయాలు. గొప్పవాళ్ళ దగ్గర ప్రస్తావించేందుకు అనర్హమనిపించే తేలిక విషయాలు.


ఒకసారి దొడ్లో బంతిపూల మొక్కల్ని కుందేలు వచ్చి ఊరికే కొరికేస్తుంటే, దాన్ని అదిలిద్దామన్చెప్పి, తిరుగుతున్న సారెని అలానే వదిలేసి పరిగెత్తాడు. తరిమేసింతర్వాత వచ్చి చూస్తే సారె మీద మట్టిముద్దగా కూలిపోయిన కుండ అచ్చంగా కుందేటి తలకాయలా వుందన్న విషయం చెప్పినపుడు ఆమె కళ్ళు విప్పార్చుకు విన్నది. అలాగే పొలాల్లో తిరిగే ఓ తోడేలు రాత్రుళ్ళు తన గుడిసెకి వచ్చి కుండల్లో తల పెట్టి ఊళ వేసేదని, తన పాట సోకుకీ గొంతు గంభీరానికీ తనే మురిసిపోయేదనీ చెప్తూంటే, ఆమె చెంపలు విప్పార్చి నవ్వింది. తన కిటికీ దగ్గర కూడా పావురాలు చేసే అలాంటి అల్లరి చేష్టల్ని చెప్పింది. తనకు నచ్చే మాట ఏది చెప్పినా ఆమెకి నచ్చుతోంది. అతను తొందర్లోనే జంకు వదిలేసాడు. ఎపుడూ వెలుగు చూడని లోపల్లోపలి కలలన్నింటికీ మాటలు ఏరి తెచ్చి బైటికి సాగనంపుతున్నాడు. ఆమె మంచం మీద కాసేపు బాసింపట్టు వేసుక్కూచునీ, కాసేపు కాళ్ళు కిందకి వేలాడేసి, కాసేపు శేషశయనుడైన విష్ణుమూర్తిలా తలగడ మీద వాలిపోయి, ఊ కొడుతూ వింటోంది. తనకు తోచినవి చెప్తోంది. ఒకరికొకరు ఎంత తెలిసిపోయారంటే, ఒకరి సంగతులు చెప్పుకుంటున్నపుడు మరొకరు వింటూ ఊరుకోకుండా, నువ్వలా చేసావంటే నమ్మను! అని ఆశ్చర్యపోవడమో, అబ్బే అందాకా వస్తే నువ్వెందుకూరుకుంటావని ఎగదోయడమో, నీకు చాలా బాధేసివుంటుందని జాలిపడడమో, యిలా ఎదుటివారి స్పందనని స్వంతం చేసేస్కుని మాటలు కలుపుతున్నారు. యిలా గంటలు కరిగించేశారు. కిటికీ దగ్గర తెల్లపావురం తల తిప్పుకుని వానాకాలాన్ని విసుక్కుంటోంది.

చీకటివేళ అయింది. బయట వర్షం నిరంతరాయంగా కురుస్తోంది. తర్వాత వెళ్దువు లెమ్మని రేణుకాదేవి అతణ్ణి నిలేసింది. అతనికీ వెళ్లాలని లేదు. అసలు ముందూ వెనకలేం పట్టడం లేదు. అతని ప్రపంచమంతా ఆమె ప్రభావంలో చకితమైపోయివుంది. క్షణాలు ఉద్విగ్నమై మనోహరమై బిగుస్తూ వదులవుతూ ప్రజ్వలించి సంచలిస్తున్నాయి. మనసు స్థలకాలాలకు అతీతమై చీకటి శూన్యంలో ఒకేవొక్కటై వెలుగుతోంది. నేల మీద చమురుదీపపు వెలుగువలయంలో యిద్దరూ కూర్చున్నపుడు ఆమె తన బొమ్మల్ని చూపిస్తూంటే భుజం మీంచి తొంగి చూస్తున్నవాడల్లా ఆమె చెంపలకి చెంప ఆనించకుండా వుండలేకపోయాడు.


అతని వేడి చెంపని ఆమె అనునయంగా స్వీకరించింది. బుజ్జగిస్తూ ముందు బొమ్మలు చూడమంది. అతను అప్పటికే కాలిపోతున్నాడు. ఆమెను వళ్ళో లాక్కున్నాడు. మెత్తని ఆమె శరీరాన్ని వడి నిండా పరచుకున్నాడు. తర్వాత ఏం చేయాలో తెలియని కంగారులో పడ్డాడు. మరో శరీరాన్ని ఎన్నడూ అంత చేరువగా తాకలేదు తడమలేదు అదుముకోలేదు. సారె మీద వేళ్ల మధ్య నలిగే మట్టి ముద్ద కన్నా మెత్తగా వుంది ఆమె శరీరం. తేలికైన ప్రాణాన్ని దాచుకున్న పక్షిఎదను నిమురుతున్నట్టు వుంది. ఆమె కూడా, సర్వాంగాలూ పరాధీనాన్ని అంగీకరించి కొత్త స్పందనల్ని చూపిస్తూంటే ఆసరా అందని భయంలో మొద్దుబారిపోయినట్టయి చాలాసేపటి దాకా మృతశరీరంలా అతను ఎటు తిప్పుకుంటే అటు తిరిగింది. అతని శరీరానికి అనుబంధమైపోయి మసలుకొంది. అతను సున్నితత్వం మర్చిపోయాడు. వేటకందిన జీవి ప్రాణంపోగొట్టుకుంటున్న వేదనామయ వొంటరి క్షణాల్లో చంపుతున్న తనే ఆసరా అందిస్తున్నట్టు పులి తన పంజాల్తో ఎంత దగ్గరగా పొదువుకుంటుందో అలా ఆమెని పొదువుకుంటూ, మెడ నోటకరిచి ఎలా అనువైన భంగిమలకి తిప్పుకుంటుందో అలా ఆమెని తిప్పుకుంటూ రమించాడు. చివరకు చలిగా జలదరించి విగత వీర్యుడై ఆమె చిరుచెమటల ఎదపై నిస్సత్తువుగా వాలినాకనే ఆమె పునర్జీవితురాలైనట్టు మరలా నవ్వింది.

ఆ రాత్రి చాలాసేపు నేల మీదే ఎదురుబొదురు ఒత్తిగిలి పడుకుని చమురుదీపం వెలుగులో మసగ్గా కనిపిస్తున్న ఒకరి మొహాల్ని ఒకరు చూసుకుంటూ, ఊరికే ఒకర్నొకరు తడుముకునేందుకు సాకుగా మధ్య మధ్యలో అల్ప విషయాలను, అవి కేవలం మాటలే కానక్కర్లేదు, ఉచ్ఛ్వాసనిశ్వాసాలైనా మూలుగులైనా నవ్వులైనా సరే గొణుక్కుంటూ, అతను ఆమె చెవి తమ్మెల్నో, ఆమె అతని ఛాతి వెంట్రుకల్నో నిమురుతూంటే, ఒళ్ళిక ఒళ్ళు కాకుండా పోయి మళ్ళీ కాక రేగి, మీదకు జరిగి మైథునానికుపక్రమిస్తూ, మొత్తం రాత్రంతా యిలాగే, అతని ప్రహరణాల్ని ఉరుములూ ఆమె మణికూజితాల్ని పావురాళ్ళ కువకువలూ మింగేస్తూండగా ఎప్పటికో సుదీర్ఘంగా తెల్లారింది. ఆ తర్వాతి కొన్ని రోజులూ కూడా యిలాగే సాగాయి. అయినా ఒకరి శరీరంపై ఒకరికి తనివి తీరలేదు. ఒకరి కబుర్లలో మరొకరికి కొత్త కథలు వినిపిస్తూనే వున్నాయి. కానీ అతనిలో దిగులు మొదలవసాగింది. ఆమెను గుడిసెకు తీసుకుపోవాలన్నది అతని ఆశ. మాటల్లో జంటగా తామిద్దరి భవిష్యత్తును ఆమె కళ్ళకు కట్టించడానికి ప్రయత్నించేవాడు. ఆ ప్రస్తావన వచ్చినపుడు ఆమె ఎపుడూ నిశ్శబ్దాన్ని అవలంబించేది. అతను కాసేపు అనునయంగా బుజ్జగించేవాడు, కాసేపు అసహనంగా వేడుకునేవాడు. ఆమె తల దించుకుని పరికిణీ అంచుల్ని మడతపెట్టడమో, నేల మీద గీతలు గీయడమో చేస్తూండేది. ఆమె ఎప్పుడూ ప్రస్తుతంలోనే వుండేది, ఈ క్షణాలు చాలదా అన్నట్టు ప్రవర్తించేది. ఎందుకు సరిపెట్టుకోవాలో అతనికి తెలియదు.


ఒకనాడు రేణుకాదేవి ప్రవర్తన వింతగా వుంది. చంచల చిత్తంతో కంగారుగా వుంది. అతని కౌగిట్లో వుండీ లేనట్టు వుంది. మునుపటి క్షణం వరకూ ఎంత సన్నిహితంగా వుందో, మరుసటి క్షణమే అంత పరధ్యానంగానూ ప్రవర్తిస్తోంది. అతనిలో దిగులూ అసహనం తారాస్థాయికి చేరుకున్నాయి. ఏదీ తేలని అనిశ్చితి విసుగు పుట్టిస్తోంది. ముందువెనకల్లేని ఈ త్రిశంకు స్వర్గం అయోమయం కలిగిస్తోంది. చివరి అస్త్రం ప్రయోగించి చూద్దామనుకున్నాడు. తాను వెళిపోదల్చుకున్నాననీ, తనతో కలిసి బతకదల్చుకుంటే పావురంతో కబురంపమనీ చెప్పి కదిలాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా తలదించుకుంది. కనీసం ఆగమని కూడా అడకపోవడం చూసి విసురుగా గడపదాటి చరచరా మెట్లు దిగేసాడు. క్రిందకి వచ్చేసరికి యిపుడు వెళిపోతే తనకేమి మిగులుతుందో తలచుకుంటే గుబులు వచ్చేసింది. దాంతోపాటే అనుకున్నపుడల్లా మౌనంతో తన అంతరంగ ద్వారాల్ని మూసేసుకుని తనని వెలుపలే నిలబెట్టే ఆమె మంకుతనం మీద కోపం వచ్చేసింది. అదే వేగంతో మెట్లెక్కి గదిలోకి వచ్చి ఆమెను దూషించసాగాడు. తర్జని చూపిస్తూ ఆరోపణలు చేయసాగాడు. బెదిరింపులకూ దిగాడు. అన్నీ బయటకు కక్కేసి ఖాళీ అయిపోయిం తర్వాత, ఈ ఉపద్రవంలో తానెంత వెలికిరాలేనంతగా, వెలికిరాయిచ్ఛగించనంతగా కూరుకుపోయాడో అర్థమై, వెక్కి వెక్కి ఏడ్వసాగాడు.

ఆమె కదిలి వచ్చి అతణ్ణి కౌగిలిలోకి తీసుకుంది. అలిసిపోయినవాడై యిక తన జీవితాన్ని నిగూఢమైన ఆమె మనస్సాక్షి యిచ్ఛకు వదిలేసినట్టు నిస్సత్తువగా ఆమె చేతుల్లోకి వాలిపోయాడు. యిద్దరూ నేల మీదకు ఒరిగిపోయారు. ఆమె అతణ్ణి వళ్ళోకి తీసుకుని తల నిమురుతూ చెప్పింది, తనకు చావు రాసిపెట్టి వుందనీ, మృత్యువు తన ప్రాణాన్ని తీసుకుపోవటానికి రేపు రాత్రే వస్తుందనీ, అపుడు ఎక్కడున్నా ఒకటేననీ, కానీ నువ్వు నా దగ్గరుండటం ముఖ్యమనీ చెప్పింది. అతను తలెత్తి ఆమె కళ్ళల్లోకి శూన్యంగా చూశాడు. మొద్దుబారిన మనసుతో అయోమయంగా ఆమెను నలిపేస్తూ కౌగలించుకున్నాడు. ఆమె ఉప్పటి కన్నీటి కళ్ళ మీద ముద్దుపెట్టుకున్నాడు. చావుని రానివ్వనన్నాడు. అడ్డం నిలబడతానన్నాడు. ఆమె ఏదో విషయం గుర్తు వచ్చిననట్టు అతణ్ణి విడిపించుకు లేచింది. పందిరిమంచం వైపు నడిచి, పరుపు పైకెత్తి, అక్కడున్న ఒక పెద్ద దబ్బనాన్ని తెచ్చి అతని చేతికి యిచ్చింది. మృత్యువు వచ్చినపుడు ఈ దబ్బనంతో తన గుండెల్లో పొడిస్తే తాను మారు రూపం దాలుస్తాననీ, మృత్యువు గుర్తుపట్టలేక వెళ్ళిపోతుందనీ, తర్వాత ఆ మారిన రూపాన్ని మళ్ళీ పొడిస్తే తిరిగి పూర్వరూపానికి వస్తాననీ చెప్పింది.  అతనికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఆమె నిద్రిత ముఖాన్ని చూస్తూ వుండిపోయాడు.

మరుసటి రోజు పౌర్ణమి. ఉదయమంతా ఎవరి లోకం వారిదన్నట్టు వున్నారు యిద్దరూ. లేక అతణ్ణి అతని లోకంలో వుండనియ్యడం కోసం ఆమె దూరంగా వుందేమో, అతనికి తెలియదు. ఆ రోజు వాన వెలియడంతో కిటికీ దగ్గర పావురాళ్ళు మునుపట్లా సందడి చేసాయి. రేణుకాదేవి ఆ రోజు తెల్లపావురాన్ని ఒకటే ముద్దు చేసింది. అతను మాత్రం గదిలో ఓ మూల వొదిగి గుబులు గుండెల్తో ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. అతనికి తన గుడిసె, కుండలూ గుర్తొచ్చాయి. అదంతా చేరుకోలేని దూరంగా, తిరిగిరాని గతంగా అన్పించింది. రాత్రి కానే వచ్చింది. పూర్ణచంద్రుడు ఏటి మీద పెద్దగా ఉదయించాడు. కాసేపటికే బయటంతా పిండారబోసినట్టు వెన్నెల.

వున్నట్టుండి పావురాళ్ళు ఒక్కొకటిగా కిటికీ వదిలి తమ గూళ్ళకు వెళిపోయాయి. వెళ్ళలేక అక్కడే తచ్చాడుతున్న తెల్లపావురాన్ని ఆమె బుజ్జగించి పంపించేసింది. అతని వైపు తిరిగింది. మూలనున్న అతను చేతులు చాచి రమ్మంటే దిగులుగా వెళ్ళి వళ్ళో కూచుంది. ఎవరూ లేచి చమురు దీపం వెలిగించలేదు. కిటికీలోంచి ముద్దగా పడుతున్న వెన్నెల వెలుగు సరిపోయింది. నేల మీద కిటికీ ఊచల్తో సహా పరుచుకున్న వెన్నెల పలక అతనికి ప్రమాదకరంగా, తమ గూటిలోకి ఆగంతక చొరబాటుగా అనిపించింది. యిద్దరూ గది మూల మసక చీకటిలోనే చాలాసేపు ఒదిగి కూచున్నారు. అతని గడ్డం మీద ముద్దు పెట్టి ధైర్యాన్నిస్తున్నట్టు వీపు నిమిరింది. ఆమె రొమ్ముల కింద నుంచి చేతులు కట్టి దగ్గరకు లాక్కున్నాడు. యిరువురి గుండె సవ్వళ్ళే విరామచిహ్నాలుగా గడియల గద్యం గుబులుగా గడిచింది. అర్థరాత్రి అవుతుందనగా ఆమె అతని కౌగలి విడిపించుకులేచింది. వెళ్ళి పందిరిమంచం మీద పడుకుంది. అతనికి సమయం ఆసన్నమైనట్టు అర్థమైంది. లేచి కిటికీ దగ్గరకు వెళ్ళాడు. వంటి మీద చలి మరకలా వెన్నెల పాకింది. బయట రేవులో పడవలు గాలికి జోగుతున్నాయి. నీళ్ళు ఒడ్డుకేసి కొట్టుకుంటున్నాయి. రావి ఆకులు గలగల్లాడుతున్నాయి.

ఎక్కణ్ణించో తోడేటి ఊళ వినిపిస్తోంది. అతనికి ఉన్నట్టుండి పడమటి దిక్కున క్షితిజరేఖకు పైనగా ఏటి అవతల్నించి ఏదో నల్లగా ఎగురుకుంటూ రావడం కన్పించింది. పక్కకు తిరిగి ఆమె వైపు చూసాడు. మసక చీకట్లో ఆమె కళ్లు విప్పారి చూస్తున్నాయి. వేగంగా పందిరిమంచం మీద ఎక్కి ఆమెని వెనక నుంచి కౌగలించుకుని చెక్కిలిపై ముద్దు పెట్టాడు. కళ్ళు మూసుకుని దబ్బనాన్ని పిడికిలి మధ్య బిగించి గుండెల్లో గట్టిగా పొడిచాడు. కౌగిట్లో ఆమె శరీరం విలవిల్లాడటం కాసేపు తెలిసింది. తర్వాత హఠాత్తుగా ఆమె శరీర స్పర్శ  లేకుండాపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి పక్క మీంది ఓ కప్ప క్రిందకి దూకుతూ కన్పించింది. అతను దిగ్గున లేచి కూర్చున్నాడు. అదే సమయానికి కిటికీ దగ్గర రెక్కల చప్పుడూ, ఏదో వాలిన అలికిడీ వినిపించింది. దాని నీడ నేల మీద వెన్నెల పలకలో కన్పిస్తుంది. అతను లేచి కిటికీ దగ్గరకు వెళ్ళాడు. తాటాకంత రెక్కల్తో ఒక పెద్ద గ్రద్ద ఊచల్లోంచి తలపెట్టి తొంగిచూస్తోంది. అతను దబ్బనాన్ని వీపు వెనక దాచుకుని కిటికీకి ఎదురెళ్ళి నుంచున్నాడు. కానీ అది మాత్రం అతనక్కడ లేనేలేడన్నట్టు మెడ అటూయిటూ తిప్పుతూ గది అంతా కలయజూస్తోంది. ఎవరూ కన్పించకపోయేసరికి అసహనంగా అతనివైపు చూసి వికృతమైన అరుపు అరిచింది. రెక్కల్ని తాటించుకుంటూ వెనక్కి ఎగిరిపోయింది. అది రావి చెట్టు దాటి, పడవల తెరచాపలు దాటి, ఏరు దాటి, క్షితిజరేఖపై చిన్న చుక్కగా మారిపోయేంత వరకూ కుమ్మరివాడు కిటికీ దగ్గరే నిలబడి చూశాడు. తర్వాత కూడా చాలాసేపు అక్కడే వుండి, అది మరిక తిరిగి రావటం లేదని నిశ్చయించుకున్నాక, అప్పుడు కప్ప కోసం గదంతా కలయజూసాడు.

ఎక్కడా లేదు. చమురు దీపం వెలిగించి పందిరిమంచం పైనా క్రిందా, గది మూలమూలల్లోనూ వెతికాడు. తలుపు సందు ఓరగా తెరిచి వుండడం చూసి ఆందోళనగా మెట్ల మీదకు వెళ్ళాడు. దీపంతో మెట్లు పరీక్షించాడు. కప్ప తడి కాళ్ళ ముద్రలు కన్పించాయి. హఠాత్తుగా అతని మనసులో ఒక అనుమానం ప్రవేశించింది. ఆమెకు మనిషిగా వున్నప్పుడు తాను ప్రియుణ్ణన్న స్పృహ వుంటుంది. కప్పగా వున్నపుడు వుండకపోతే. తనిప్పుడు ఆమెకి ఏమీ కాకపోతే. ఆ తెలివిడి కూడా ఆమెకి లేకపోతే. అతని చేతిలో దీపం వణికిపోసాగింది. అతను మొత్తంగా వణికిపోసాగాడు. జారుతోన్న గుండెల్తో కింద అంతస్తు గదులన్నీ వెతికాడు. పేరుపెట్టి పిలిచాడు. పొంగి వస్తున్న ఏడుపు కంఠంలోనే దిగమింగుకుని కప్ప బెకబెకల కోసం చెవులు రిక్కించి విన్నాడు. చివరకు నిర్మానుష్యమైన నిశీథి వీధిలోకి వెళ్ళి వెన్నెల వెలుగులో కన్నీటి మసకను తుడుచుకుంటూ అంతా వెతికాడు. ఏటి ఒడ్డున బురదలోంచి బెకబెకలు విన్పించి చివ్వున లేచి అటు మళ్ళాడు. కానీ అక్కడ ఒక్కటి కాదు, వందల కప్పల బెకబెకలు వినిపిస్తున్నాయి. అటు పరిగెత్తుకు వెళ్ళాడు గుండెలవిసేలా ఏడుస్తూ.

శ్రీపాదపట్నానికి తెల్లారింది. ఏటి మీదకు పడవలు తీసికెళ్దామని వచ్చిన బెస్తవాళ్ళకు నీటిలో వెల్లకిలా తేల్తున్న కప్పల కళేబరాలు చాలా కన్పించాయి. కాస్త దూరాన వంటినిండా బురదతో తుప్పలన్నీ వెతుకుతున్న మనిషి కూడా ఒకడు కనపడ్డాడు. బెస్తవాళ్ళు వాణ్ణి పట్టుకున్నారు. జనం పోగయ్యారు. పెద్దలు వచ్చారు. కాస్త గొడవా గోలా జరిగింతర్వాత సంగతి అర్థమై వాడి మానాన వాణ్ణి వదిలేశారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. కాలక్రమేణా బురదగుంటల్లో దబ్బనం పట్టుకు తిరిగే అతని వాలకం జనానికి అలవాటైపోయింది. వాణ్ణి కప్పలోడని పిలిచేవారు. పుణ్యానికి అపుడపుడూ పిలిచి అన్నం పెట్టేవారు. తెల్లపావురం అతణ్ణి జాలితో చూసేది. అది కూడా దొరికిన తిండేదో అతని భుజంపై చనువుగా వాలి నోటి కందియ్యడానికి ప్రయత్నించేది. ఒక్కోసారి నోరు చాపేవాడు, ఒక్కోసారి విదిలించుకునేవాడు. ఆ పావురం తర్వాత చాన్నాళ్ళు బతికింది. బతికినంత కాలం తన రెక్కలపై రేణుకాదేవి రక్తపు మరకలు చెరిగిపోకుండా వుంటానికి వానలో తడవకుండా జాగ్రత్త పడేది.

(సమాప్తం )

రచన : మెహెర్ 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి