నల్లగుణము

 

 VT9 రిపోర్టర్ "చూస్తున్నాం కదా బద్రి! ఇక్కడ ప్రజలు ఎలా కష్టాలు పడుతున్నారో...వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం...చెప్పండి సర్...ఈ నోట్ల రద్దు వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు..." అని క్యూలో ఉన్న రామారావుని అడిగింది. రామారావు "దాదాపు గంట సేపటి నుండి వెయిట్ చేస్తున్నామండి. చాలా ఇబ్బందిగా ఉంది. అసలు మా డబ్బు వాడుకోవడానికి మేము ఎందుకు కష్టపడాలండి...మేము ఏం తప్పు చేసాం? మా దగ్గర బ్లాక్ మనీ లేదు.అయినా ఇలా కష్టపడాల్సి వస్తోంది. అసలయిన దొంగలు ఎక్కడున్నారో...ఈ ప్రభుత్వానికి చేతనయితే వాళ్ళను పట్టుకోమనండి...మమ్మల్ని కాదు. Intention may be good but this is not the way to implement... Completely meaningless decision"అని ఆవేశంగా మాట్లాడాడు. 
"చూశారుగా...ఇదీ పరిస్థితి...నోట్ల రద్దుతో సామాన్యులు చాలా కష్టపడుతున్నారని" చెప్పి ఇంకో ఇద్దరిని అడిగి రిపోర్టర్ వెళ్ళిపోయింది. రామారావు తన వంతు వచ్చాక డబ్బులు డ్రా చేసుకోని ఇంటికి వెళ్ళిపోయాడు.

సాయంత్రం రామారావుకి ఒక కొత్త నంబర్ నుండి ఫోన్ వచ్చింది. "ఇవాళ బ్యాంక్లో మీరు మాట్లాడింది చూశాం.చక్కగా మాట్లాడారు.మీ లాంటి వాళ్ళ సలహాలూ, సూచనలూ మాకు అవసరం.రేపు పొద్దున్నే ఫలాన చోటకి వస్తే కాసేపు డిస్కషన్ పెట్టి మీ సలహాలు మాకు నచ్చితే మా RBI అడ్వైసరీ కమిటీలోకి మిమ్మల్ని తీసుకుంటాం. మీ ఆలోచనలన్నీ ఒక పేపర్ మీద రాసుకొని రండి. డిస్కషన్లో పాల్గొనడానికి 1200/- ఎంట్రీ ఫీజ్ కట్టాలి. సహకరించగలరు."...ఇదీ ఆ కాల్ సారాంశం.

రామారావు తన ఆలోచనలన్నీ పకడ్బందీగా రాసుకొని అక్కడకి వెళ్ళాడు.ముందురోజు తెచ్చుకున్న వంద నోట్లతో ఎంట్రన్స్ లో ఫీజ్ కట్టి లోపలకి ఎంటెర్ అయాడు.అక్కడ జనాలని చూసి అవాక్కయ్యాడు.దాదాపు 1000 మంది దాకా ఉన్నారు.ఇంతమందిలో మనం గెలవగలమా అని కాస్త జంకాడు కానీ పోయేదేముంది.ప్రయత్నించి చూద్దామనుకొని ఉండిపోయాడు.ఇంతలో ఒక పెద్దాయన స్టేజ్ మీదకి వచ్చాడు.

"మా మాట మన్నించి మాకు సహకరించడానికి తీరిక చేసుకొని వచ్చిన మీ అందరికి కృతగ్నతలు.ఇంకా ఎక్కువసేపు మాట్లాడి మీ అందరి సమయం వృధా చేయాలనుకోవట్లేదు.ముందు ఇక్కడి రూల్స్ చెప్పి మొదలుపెట్టేస్తాం.ఇక్కడ మొత్తం 3 స్టేజెస్ ఉంటాయ్.మొదటి స్టేజ్ లో G.D. పెట్టి 100 మందిని సెలక్ట్ చేస్తాం.సెకండ్ స్టేజ్ లో రాత పరీక్ష పెట్టి 20 మందిని సెలక్ట్ చేస్తాం.ఫైనల్ రౌండ్లో ఇంటర్వ్యు ద్వారా ఒకరిని సెలక్ట్ చేస్తాం.మీరు యే రౌండ్లో ఫెయిలయి వెనుతిరిగినా మీ ఫీజ్ వెనక్కి ఇవ్వబడదు.ఒకవేళ మీరు ఇప్పుడే వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళొచ్చు.అలా వెళ్ళాలనుకొనేవాళ్ళంతా అటువైపు రండి." అన్నాడు.

దాంతో అందరిలో కలకలం మొదలయింది..."ఓయబ్బో..G.D.,written,interview అంట...మనమేమన్న గొప్ప ఆర్ధికవేత్తలమా...తొక్కలోది...ఏదో TV వాళ్ళు అడిగినట్లు అడుగుతారేమో అనుకొని వచ్చాం కానీ..." అని గొణుక్కుంటూ కొంతమంది అటువైపుకి పోయారు.వాళ్ళని చూసి ఇంకొందరూ...అందరితో పాటు రామారావు అనుసరించాడు.చివరికి ఇటువైపు 20-30 మంది మిగిలారు."ఒరేయ్...మీరేమైన గొప్ప economists ఏంట్రా...మూసుకొని వచ్చేయండి...1200 అయినా మిగులుతాయ్...రెండు వారాలు బతుక్కోవచ్చు" అని ఎవరో వెటకారమాడేసరికి వాళ్ళు కూడా వీళ్ళనే అనుసరించారు. 

మొదట మాట్లాడిన పెద్దాయన వచ్చి "అరెరె...అందరూ అటువైపు వెళ్ళిపోయారే. మీ నుండి కొన్ని పాయింట్స్ అయినా నోట్ చేసుకోవాలన్నది మా లక్ష్యం. కానీ మీకెవరికీ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఒక చిన్న రౌండ్ పెడతాం.అది క్లియర్ చేసిన వాళ్ళు మొత్తం ఫీజ్ తీసుకొని వెళ్ళొచ్చు.టెస్ట్ ఏంటంటే... దాదాపు మీరందరూ కామన్ మ్యాన్ కష్టాల గురించే ఊటంకించారు కాబట్టి వాళ్ళకు ఎలా సహాయపడాలో మీకు తెలిసే ఉంటుంది. అందరి సలహాలు తెలుసుకోవడం కుదిరేల లేదు కాబట్టి మొత్తం అందరిని టీంకి 2 చొప్పున దాదాపు 500 teams గా విడిపోవాలి. ప్రతి టీంలో వాళ్ళు తమిద్దరిలో ఎవరు బాగా ప్రజలకు సహాయపడ్డారో...ఎలా సహాయపడ్డారో...డిస్కస్ చేసి ఒకరిని విన్నర్ గా ఎన్నుకోవాలి. 

ఆ విన్నర్ పేరు, వారు ఏం చేసిందీ...ఎలా చేసిందీ...పేపర్ మీద రాసి మాకివ్వాలి.అలా ప్రతి టీంలో గెలిచిన వాళ్ళకి ఫుల్ ఫీజ్ రిఫండ్ చేస్తాం. ఓడిన వాళ్ళకి ఏమీ ఇవ్వబడదు. ఇదీ రౌండ్. 20 నిమిషాలలో మీ డిస్కషన్ పూర్తీ చేయాలి."అన్నాడు. దాంతో ఒకసారిగా మళ్ళీ గందరగోళం మొదలయింది.ప్రతి ఒకరూ తమ పక్క వారితో డిస్కస్ చేయడం మొదలుపెట్టారు.20 నిమిషాలు అయిపోయాయ్. అయినా ఆపలేదు.ఇందాకటి పెద్దాయన వచ్చి "టైం అయిపోయింది.పేపర్స్ ఇవ్వమని" అడిగారు. కానీ అందరూ ఇంకా 20 నిమిషాలు కావాలని అడిగారు.ఈ సారి లేట్ చేస్తే ఎవరికీ ఫీజ్ రిఫండ్ ఇవ్వం అని ఆయన తేల్చి చెప్పారు.ఇంకో 20 నిమిషాల తర్వాత అందరూ కాస్త అయిష్టంగానే రాసిచ్చేసారు.

ఆ పెద్దాయన  వచ్చి చిన్నగా నవ్వుతూ "హ హ...కామన్ మ్యాన్ కష్టాల గురించి టీవీల ముందు వీరావేశంతో మాట్లాడిన వారు ప్రభుత్వం ఏం చేయాలో చెప్పడానికి వచ్చి ఏమీ చెప్పకుండానే పారిపోతున్నారు.పోనీ తాము ప్రజలకు ఏలా హెల్ప్ చేసారో చెప్పి పక్క వాళ్ళను ఒప్పించమంటే అదీ చేయలేకపోయారు.ఓహ్! మీరు ప్రతి టీంలో ఒకరిని విన్నర్ గా ఎంచుకొన్నాం కదా...ఈయన ఇలా అంటున్నాడేంటి అనుకుంటున్నారేమో...మీరు నిజంగానే గొప్ప పనులు చేసుంటే పక్కనోడిని ఒప్పించడానికి 20 నిమిషాలు చాలవా?అయినా మొదటి 20 నిమిషాల్లో ఒప్పుకోని వాళ్ళు తర్వాత ఎలా ఒప్పుకొన్నారో మాకు తెలియదా..అందరినీ పరిశీలించాం.మొదట విన్నర్ నేనంటే నేనని తగువు పడ్డ మీరు ఎవరినీ ఎన్నుకోకపోతే మొదటికే మోసం వస్తుంది...ఇద్దరూ నష్టపోతాం అని రియలైజ్ అయి ఎదుటోడిని ఒప్పించకుండా చెరి సగం పంచుకుందామని ఒప్పందం కుదుర్చుకున్నారు.

సో...మన గొప్పతనాన్ని పక్కనోడితో ఒప్పించడం...అలాగే పక్కనోడి గొప్పతనాన్ని మనము ఒప్పుకోవడం...రెండూ కష్టమే. ఇక అసలు విషయానికి వస్తే నోట్ల రద్దు నిర్ణయం కరెక్టా...తప్పా...అని చెప్పేంత మేధావిని కాను...ఎందుకంటే నాకు తెలిసినంతవరకు అది గొప్ప నిర్ణయం అయినా...కాకపోయినా...నేను పని చేస్తేనే జీతం వస్తుంది. ఆ జీతం డబ్బు రూపంలో చేతిలో ఉంటేనే నా వాళ్ళ కడుపు నిండుతుంది.అదో గొప్ప మహా నిర్ణయం అని పని మానేసి ఇంట్లో కూర్చొంటే మా వాళ్ళ కడుపు నిండదు, అలాగని అదో పనికిమాలిన నిర్ణయం అని తిట్టుకుంటూ ఇంట్లో కూర్చున్నా ఆకలి వేయడం మానదు. Already ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రతిరోజూ support/oppose చేయడం వల్ల use ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళ లాగే మనం కూడా వాళ్ళ గురించి 5 years కి ఒకసారి ఆలోచించినా చాలు.కానీ మన ఇంట్లో వాళ్ళ గురించి రోజూ మనమే ఆలోచించాలి.దాన్ని ఏ రాజకీయ పార్టీ చేయదు.

అయినా ఏదో సినిమాల ప్రభావం కాకపోతే దేన్నయినా మంచి/చెడు అని రెండే క్యాటగరీలకు కట్టేయడం బాగా అలవాటయిపోయింది కానీ మనం రోజూ మింగే మందులు కూడా రోగాన్ని కుదర్చడంతో పాటు ఏదో ఒక సైడ్ అఫెక్ట్ ఇస్తాయి...మందులేంటి! ఆఖరికి అన్నం తిన్నా ఏదో ఒక రోగం వస్తుంది. అలాంటప్పుడు ఇంతమందికి సంబంధించిన విషయాల్లో అది సాధ్యమా? మీడియా వాళ్ళ అరుపులు చూసి ఫ్రీ కదా అని అనవసర భావోద్వేగాలూ,అభిప్రాయాలూ...ఏర్పరుచుకోడం వల్ల నష్టమే తప్ప ప్రయోజనం లేదు.ఇప్పుడు మీరే ఉన్నారు...ఎవడో బాగా నష్టపోయిన మీడియా వాడు రెచ్చగొడితే ఆవేశంతో ఊగిపోయారు...మా ఫోన్ కాల్ రాగానే అర్హతకు మించిన పొజిషన్ కోసం ఆశపడ్డారు.ఇక్కడకొచ్చి చేతి చమురు వదిలాక బుర్ర పెట్టి ఆలోచించి నిజాన్ని గ్రహించారు.
మీ ఈ బలహీన గుణం వల్ల నల్ల ధనం కన్నా ఎక్కువ నష్టమని ఇప్పటికైనా తెలుసుకోంటే మంచిది.సరేలేండి...అయిందేదో అయిపోయింది...ఇక నుండి ఎమోషనల్ గా కాకుండా తెలివిగా మసులుకుంటారని ఆశిస్తున్నా..." అని ముగింపు పలుకుతుండగా...అందరూ అవునన్నట్టు నిశ్శబ్దంగా ఉన్నారు.ఇంతలో ఆయన వెనక్కొచ్చి "అన్నట్లు...చెప్పడం మరిచా...నేను RBI employee కాను.ఒక చిన్న co-operative bank లో puen ను...దీనితో మీరు మళ్ళీ ఎమోషనల్ అవుతారని తెలుసు..." అని నవ్వుతూ పరుగు లంఘించాడు. ఒక puen చేతిలో మోసపోయామని అహం దెబ్బ తిన్న జనం అతన్ని పట్టుకోడానికి బయటకు ఉరికారు.

బయట ఈ తతంగమంతా జరుగుతున్న హాల్ కు కాస్త దూరంలో vt9 రిపోర్టర్ "చూస్తున్నాం కదా! నోట్ల రద్దు వల్ల పెళ్ళి ఆగిపోవడంతో ఇరు వర్గాల వారు ఎలా కోట్లాడుతూ బయటకు వస్తున్నారో.అసలు అక్కడ ఏం జరిగిందో ఈయనని అడిగి తెలుసుకుందాం...చెప్పండి సార్..." అంటూ రామారావు ముందు మైక్ ఉంచింది.

...సమాప్తం...

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి