కంచె దాటిన నాగలి - రెండవ భాగం


జగన్నాధం ఇచ్చిన డబ్బుని లెక్క కూడా చూడకుండా, జేబులో కుక్కుకొని బయలుదేరాడు సూర్యం. 
ఇంటికి సరిపడా సరుకులెన్ని కావాలో అన్ని తీసుకున్నాడు, ఎముకలు చుసిన పేగులు, పరమాన్నం పడుతుందో లేదో సందేహిస్తూ ఇంటి వైపు అడుగులు వేసాడు. 

సాయంత్రం ఆరు కావొస్తుంది. 
ఇంటికెళ్ళగానే లక్ష్మి ఎదురొచ్చి, సూర్యం చేతిలో ఉన్న సరుకులు చూసి సందేహంతో, 

"ఇన్ని సరుకులా.. కరణం గారు ఎవరికైనా ఇచ్చేసి రమ్మని చెప్పారా ? " అని అడిగింది 

సూర్యం తను అడిగిన ప్రశ్నకి చిన్న నవ్వు తో 

"లేదు"
"మరి? "
"మనకే.. "
"అప్పుతోనా ?"
"లేదు.. ఆకలితోనే "
"మళ్ళీ నా..ఉన్నవి చాలక ఇవన్నీ ఎందుకండీ.. చేసిన అప్పులకే వడ్డీలు మెడలు చుట్టుకుంటున్నాయి " అని సూర్యం చేతిలో సరుకులు తీసుకొని సర్దడం మొదలు పెట్టింది. 
"మెడలే కదా ఇచ్చేద్దాం ... అయినా ఇదే ఆఖరు సారి లేవోయ్  " అని సముదాయించాడు. 
"జ్యేష్ఠ ఎక్కడ ? "  అని పదేళ్ల కూతురు గురించి అడిగాడు భార్యని. 
"ఎప్పటిలాగే .. మన కష్టాలు దానికి ఎందుకని.. మర్చిపోయి ఆడుకోడానికి వెళ్ళింది, వస్తుంది ఇంకాసేపట్లో "
"... "

మాటల్లేని సూర్యం ఆలోచనలతో పడుకున్నాడు, సరుకులు సర్దుతూ మధ్యలో  మూడున్నర మీటర్ల తాడుని చూసింది లక్ష్మి. 

"ఇదేంటి ? ఈ తాడేందుకు ?"
పక్కనే పడుకున్న సూర్యం ఉలిక్కి పడి లేచి.. 
"అదా .. అదీ .. చెప్పడం మరిచా ?" అని తాడు తీసుకొని 
"మొన్న కలుపు కోతకి మోపు కట్టడానికి తీసుకున్న తాడు తెగింది.. మళ్ళీ కావాలంటే " అని తాడు చుట్టేసి అటక పైన వాసం సందులో దూర్చాడు సూర్యం. 
"అవునా.. కొన్న వారానికే తెగిందా ? " 
" ఎం చేస్తాం, మనం పొలంలో పోసిన ఎరువులకు అసలు పంటకన్నా కలుపు ఏపుగా పండుతుంది మరీ !"

లక్ష్మి నవ్వుతూ 

"అవునవును.. కనీసం ఆ మేకల కోటేశ్వరావుకు అయినా అది పనికొస్తుంది "

"మరే !!" అని సమాధానం ఇచ్చాడు సూర్యం. 
"నాన్న !!" అనుకుంటూ పదేళ్ల కూతురు జ్యేష్ఠ ఇంటికి చేరింది. 
కూతురిని దగ్గరికి తీసుకొని.. ముద్దు పెట్టాడు. 

"ఇవాళ బడికెళ్ళావా నాన్న ?" అని ఆరా తీసాడు. వెళ్ళా అన్నట్టు తలూపింది జ్యేష్ఠ.

"ఆకలేస్తుంది అమ్మ !!" అని అరిచింది జ్యేష్ఠ.
"ఇదిగో ఒక్క పది నిమిషాలు.. మీ నాన్న అప్పుకి ఈరోజు కడుపు నిండుతుందిలే " అని భర్త వంక చూసింది.

సూర్య మౌనంతో ఆగిపోయాడు.

కొంత సేపటి తర్వాత అందరు భోజనం చేసి.. నిద్ర ప్రయాణానికి బయలుదేరారు..

"ఏంటి లక్ష్మి మౌనం గా ఉన్నావు .. మల్లి అప్పు ఎందుకు చేసావు? ఇంకా ఎన్నాళ్లు ఈ బాధలు అని అడుగు ??"
"మీ దగ్గర సమాధానం లేదని తెలుసు.. అయినా అడిగి ప్రయోజనం లేదని, అడక్కపోయినా సమాధానం తెలుసు అని "
"తెలివిగల దానివే.. ఇంత తెలివి ఉండి నన్నే ఎందుకు చేసుకున్నావ్ చెప్పు "
"అది మీతో ఉండటం వల్ల  వచ్చింది.. నేను ఉద్ధరించింది ఎం లేదు, కష్టం అయినా నష్టం అయినా మీతో ఉంటె చాలు, ఏ పెద్ద కోరికలు లేవు"
"అది నీ గొప్పతనం లక్ష్మి, నా లాంటి దరిద్రుడు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోయాడు "
"పెట్టలేకపోయా అన్న బాధే చాలు, అది ఎంతో విలువైనది"
"పిచ్చి దానిలా మాట్లాడకు లక్ష్మి, అడుగు బయటపడితే అప్పు అనే పదం తప్ప మనకి ఏది కనిపించదు. ఇంటికి అప్పులవాళ్ళకి ఎవరికీ ఎం చెప్పి తిప్పి పంపాలన్న ఆలోచనలతోనే రోజులు గడుస్తున్నాయి, ఇది ఒక బ్రతుకేనా " 
"కనీసం మనల్ని నమ్మే వాళ్ళు ఉన్నారని ఎందుకు సంతోషించడం లేదు మీరు?"
"ఇది సర్దుకు పోవడం, మనల్ని మనం మోసం చేసుకోవడం"
"కాదని అంటే"
"పిచ్చిదానివి అనుకుంటా.."
"అయినా ఈ వాదన ఎందుకు మనకి.. మీరు ప్రశాంతంగా పడుకోండి" అని చెప్పి లక్ష్మి దీపం ఆర్పేసింది. 

గది నిండా చీకట్లు కమ్ముకున్నాయి, కానీ సూర్యం కళ్ళు వెలుగుతూనే ఉన్నాయి. 


అర్ధ రాత్రి కూడా  నిద్రపోతున్న సమయం.. సూర్యం లేచి కూర్చున్నాడు. భార్య , కూతురు వైపు చూసాడు, రేపటి గురించి మర్చిపోయి నిద్రపోతున్నారు. 

నెమ్మదిగా లేచి, తెచ్చిన తాడును వెతికాడు. అటక వాసంలో దూర్చిన సంగతి గుర్తుకు వచ్చి, అటక వైపు చూసాడు. నెమ్మదిగా అటక వైపుకి వెళ్లి అక్కడ దూర్చిన తాడుని, శబ్దం లేకుండా చేతిలోకి తీసుకొని, వడివడిగా గుమ్మం వైపు నడిచాడు. తలుపు తీసుకొని వెనక్కి తిరిగి మరోసారి భార్య , కూతురు వైపు చూసాడు, 
"నన్ను  క్షమించండి ", అని కళ్ళ నీటితో చెప్పుకొని... నిశ్శబ్దానికి కూడా వినపడకుండా బయటికి వచ్చేసాడు. 

వేగంగా చీకట్లో బయలుదేరాడు. నక్షత్రాలు దారి చూపాయి. కొంత సమయం నడిచి, వెనుక ఎవరో వస్తున్నట్టు అనిపించింది సూర్యానికి, తిరిగి చూసాడు. 

(ఇంకా ఉంది)వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి