కంచె దాటిన నాగలి - మూడవ భాగం


వెనుక ఎవరు లేరు, తిరిగి నడక మొదలు పెట్టాడు. కానీ తన అడుగుల చప్పుడుకు వంత పాడుతున్నట్టు ఇంకో అడుగుల చప్పుడు వినిపిస్తుంది. ఒక్కసారిగా ఆగాడు. అడుగుల శబ్దం కూడా ఆగింది. మళ్ళీ తిరిగి చూసాడు, ఎవరూ లేరు. అడుగుల వేగం పెంచి తన పొలానికి చేరుకున్నాడు. 

అయిదు ఎకరాల పొలం.. ఎదో వరుస కూర్చిన్నట్టుగా  ఉంటుంది .. చిన్న మొక్కలేక ఖాళీగా ఉంది. నడుమ ఎకరం పొలం గట్టు మీద వేప చెట్టు ఉంది. అది ఏపుగా పెరిగి పొలం వైపు కొంత నీడని ఇచ్చేలా కొమ్మలు విస్తరించి ఉన్నాయి. చెట్టు కి 20 అడుగుల దూరం లో చేత బావి ఉంది. నీళ్లున్నా పొలానికి సరిపడవు. కానీ అప్పుడప్పుడు దాహం తీర్చే తేట నీటిని ఇస్తుంది. 

సూర్యం పొలంలోకి అడుగు పెట్టాడు. చుట్టూ చూసాడు, తన మొహం చిట్లించి చూసాడు.. నక్షత్రాల వెలుగులో తన పొలం ఖాళీగా మెరిసిపోతుంది. చేతగానితనాన్ని గాలిగా మార్చి ఒక్కసారిగా నిట్టూర్చాడు.  గుండెని చిదిమే బాధ కళ్ళని చేరింది.. కన్నీళ్లు  రెప్ప అంచున చేరి కంటి పాప సగాన్ని నింపాయి.. చూపు మసక బారింది. 

కానీ అంతుచిక్కని కోపం పంటి బిగువున చేరించి.. గట్టిగా ఊపిరి పీల్చుకొని, తెచ్చిన తాడుని చెట్టు వైపు నడిచాడు. ఎప్పుడూ చూసే చెట్టే కదా అలవోకగా బలమైన కొమ్మ వైపు ఎక్కాడు.. అది నేలకు ఎనిమిదిన్నర అడుగుల ఎత్తులో ఉంది.. ఈ ఎత్తు సరిపోతుంది అనుకొని తెచ్చిన తాడుతో కొమ్మకి ముడులు వేయడం మొదలు పెట్టాడు. 

 
తాడు ఒక చివరిని కొమ్మకి బలంగా కట్టాడు .. ఇంకో చివరికి తన మెడకు తగిలించి ముడి వేయసాగాడు.. కొమ్మకి తన మీదకి ఒక మీటర్ కన్నా తక్కువే ఉండేలా చూసుకున్నాడు అప్పుడే తన కాళ్ళు నేలని తాకవని రూఢి చేసుకున్నాడు. మెడకి తగిలించి తాడు ముడిని సరి చూడటానికి గట్టిగా లాగి చూసాడు.. గట్టిగానే ఉందని అనిపించి.

కానీ ఎందుకో అనుమానం వచ్చి.. మెడకు తగిలించే ముడిని రెండు చేతులతో  గట్టిగా పట్టుకొని  కొమ్మనుండి కిందకి దూకాడు. తాడు పట్టుకొని వేలాడాడు. ముడి బలపడింది.. తాడు తన బరువుని మోసేంత బలమైంది అని తెలుసుకున్నాడు.. తాడు వదిలి కిందకి అడుగున్నర ఎత్తునుండి దూకాడు. మళ్ళీ చెట్టు పైకి ఎక్కాడు. 

తను చెట్టు మీదకు ఎక్కుతుండగా "సూర్యం" అని ఒక ఆడ గొంతు వినపడింది. సూర్యం ఖంగుతిని చెట్టు ఎక్కేవాడు ఆగిపోయాడు. వెనక్కి తిరిగి చూసాడు. ఎవరూ కనిపించ లేదు.. చెట్టు వదిలి ఎవరన్నా ఉన్నారా అని వెలుతురు మిగిలిన చీకట్లో కళ్ళు చిట్లించి చూడసాగాడు. "సూర్యం" అని మరోసారి గోరు ముద్దల కోసం తన వెంట పడే అమ్మ పిలుపులా అనిపించింది..!
"ఎవరది?" అని గట్టిగా హుంకరించాడు.. "కనపించరేం.. !"
"ఇక్కడ సూర్యం.. కిందకి చూడు.. నేను నీ నేల తల్లిని "
సూర్యం కి భయం, బాధ ఒక్కసారిగా గుండెల్లో పొంగింది.. ఒంటి మీద వెంట్రుకలు నిక్కబొడిచేలా జలదరించింది.. గొంతులో మాట పెగల్లేదు. మెల్లగా నేల వైపు చూడసాగాడు.. 
"నిజంగా నాకు మాట వినిపించిందా ?"
"నేను చనిపోయానా ?"
"ఏదన్నా దెయ్యం నాకు పూనిందా ?"
"లేక పిచ్చి పట్టిందా ?"
"ఏదన్నాకల్లు మత్తు గాలిలో కలిసిందా ?"
"ఎవడన్నా మంత్రం వేసిన నిమ్మ కాయను తొక్కేసానా ?"
ఇలా వేల  ప్రశ్నలు తను నేలని చూసే రెండు క్షణాల లోపే మెదడును తొలిచి పారేశాయి. నెమ్మదిగా నేల వైపు చూసాడు. 

"భయపడకు సూర్యం.. నువ్వు నమ్మిన అమ్మనే " అని నేల నుండి వినిపించింది సూర్యానికి.. 
సూర్యంలో కళ్ళలో  నీళ్లు వరదలై పారింది.. ఒక్కసారిగా తల్లిని చూసినంత ఆనందం..  బాధ కలిసి నేల వైపు రెండు చేతులు చాచి కూలిపోయాడు. చంటి పిల్లాడు తల్లిని చూడగానే అక్కున చేరుకున్నట్టు.. నేలనే ఒడిగా చేసుకొని ఒదిగి పోయాడు సూర్యం. 

"ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ తల్లి ? ఏమైపోయావమ్మా ?"
"నాటిన ప్రతి గింజని దాచుకున్నావ్ .. కన్నీళ్లు పోసి పెంచుకున్న పొలాన్ని దక్కించ లేక పోయావ్.. చివరికి ఆ నీళ్ళే మాకు మిగిల్చావు..? ఎందుకమ్మా ? " అని ఉక్రోషాన్ని చూపాడు. 
"అప్పులన్నీ చుట్టు ముడుతున్నాయి.. నిన్ను నమ్మిన వాళ్ళు చేతగాని వాళ్ళుగా మిగిలుతున్నారు"
"పట్నం వెళ్లి పాచి పని చేసే కన్నా.. నిన్ను నమ్ముకుని గౌరవంగా బతకాలని ఆశపడ్డ వాళ్ళకి  ఇదేనా నువ్వు చూపే కృతజ్ఞత ?"
"ఎన్నాళ్ళమ్మ .. ఈ కష్టం, రైతులంటే అప్పులు .. కష్టాలు తప్ప సుఖాలు సంతోషాలు ఉండవా మా జీవితాలలో "
"కంప్యూటర్ పట్టిన వేళ్ళే అయినా ... కార్లు ఎక్కిన కాళ్ళు అయినా ..  కడుపు మాడ్చే ఆకలి కోసమే కదా .. మేం పండించిన గింజల కోసమే కదా.. "
"గుర్తింపు లేని జీవితాలు మావి .. గౌరవం ఎరుగని మనుషులు మేము..ఎందుకిలా అమ్మ ?? ఎందుకిలా ?" అని సూర్యం ఆక్రోశించాడు. 

"చూడు సూర్యం.. లోకాన్ని నీవైపు నుండే చూస్తున్నావ్ ? కాసేపు నావైపు ఉండి  ఆలోచించు.. జీవం లేని రోజు నుండి నేటి వరకు చూస్తున్నా.. మీలో ఎన్నో మార్పులు.. కానీ అప్పటికీ ఇప్పటికీ నేను ఏమీ మారలేదు. అందరి గురించే ఎందుకు .. నీ సంగతే తీసుకో.. ఈ పొలం మీ నాన్న నుండి చేతికి వచ్చిన తరువాత నువ్వేం చేసావ్ ? తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి కోసం నన్ను నానా రకాల ఎరువులు, భూమిలో నత్రజని తక్కువని, పొలంలో పురుగులు ఎక్కువని  ఏవేవో మందులు వాడి హింసించావ్..  ఆ విషం పోక ముందే ఇంకోటి.. 
మీ నాన్న.. మా తాత గారు ఇలా చేయలేదే.. ! "

"అప్పటి కాలం వేరు..ఇప్పుడు వేరు " సూర్యం బదులిచ్చాడు. 

"కాలం ఒక్కటే.. మీ ఆలోచనలోనే మార్పు.. ప్రతి ఒక్కటి వెంటనే జరగాలి.. పొలం దిగుబడి అయినా.. మరి ఏదైనా .. ఓర్పు తక్కువ, సహనం తక్కువ.. అంతకు మించి అవసరం ఎక్కువ .. ఇంక నా గురించి ఆలోచించే సమయమా .. అదెక్కడ ఉంది చెప్పు "

"అమ్మ అదీ.. " అని సూర్యం మధ్యలో   

"మీ తాతలు తండ్రులుకున్న ఓపికలు, ఓర్పులు, సమయాలు ఎక్కడున్నాయి.. మీ తాత గారు చూసుకున్నంత ప్రేమగా  ఈ నేల తల్లిని నువ్వు చూసుకుంటున్నావా .. నెల నెల లెక్క కడుతున్నావ్ .. స్వార్ధాన్ని చల్లుతున్నావ్.. డబ్బు కోరుతున్నావు, విషాన్ని చిమ్ముతున్నావ్ .. బంగారం అడుగుతున్నావు .. ఇదేమి లెక్క సూర్యం ?, తల్లి మీద ప్రేమ ఇదేనా ?"

మాటల్లేని సూర్యం నీరసంగా నేల వైపే చూస్తున్నాడు. 

"నన్ను బాధించి నువ్వు బాధ పడుతున్నావెందుకు సూర్యం.. అక్షరం తెలిసిన వాడివి, అమ్మ వేదన గుర్తించలేకపోయావా ?.. కష్టం నీది కాదు సూర్యం, నాపై స్వార్ధం కక్కే బిడ్డలని చూసే కష్టం నాదే.. ! పచ్చదనం పోయి అంద విహీనమైన నన్ను చూడు.. ఇంత చేసి కూడా నన్ను నిందించి నువ్వు ఆత్మ హత్య చేసుకోడానికి పూనుకున్నావ్ ఇదెక్కడి న్యాయం సూర్యం ?" 

"తప్పు చేశానమ్మా " అని సూర్యం రోధించసాగాడు 

"తప్పులు అందరూ చేశారు.. నువ్వే కాదు సూర్యం.. ఎదగాలన్న తొందర అందరిదీ.. ఎంత త్వరగా అయితే అంత.. కానీ ఎదుగుతున్న ప్రతి మెట్టు బలమైందా కాదా అన్నదే ప్రశ్న, అది మీరు ఆలోచించడం లేదు.. నిన్ను నువ్వు మార్చుకో.. మా తాత గారు అవలంబించిన వ్యవసాయ పద్దతులను వాడు.. ఫలితంలో లాభాలను చూస్తావు.. నిన్ను చూసి నలుగురు కూడా పాటిస్తారు.. నాలో సారం పోలేదు.. మీలో ఆలోచన సారమే తగ్గింది."

"సరే తల్లి.. "

"చిన్నప్పటి నుండి నిన్ను చూస్తున్నాను .. నీ అడుగులన్ని నాకు గుర్తే, నీతో ఎప్పుడూ నడుస్తూనే ఉన్నా ఇక్కడికి వచ్చే ముందు కూడా !" 

పొలానికి వచ్చే ముందు చీకటిలో వచ్చిన అడుగులు చప్పుడు గుర్తొచ్చి కన్నీటి పర్యంతం అయ్యాడు సూర్యం. 

"నా మీద ఉన్న నీకున్న ప్రేమ కి పొంగిపోతున్నా తల్లి.. పొంగిపోతున్న, స్వార్ధం మేఘాలు కమ్ముకుంటే.. సంతోషం వెలుగు ఎలా వస్తుంది, ఇప్పుడు తెలుసుకున్న తల్లి. నాకు పూర్వం నీది మహారాణి యోగం.. కానీ ఇప్పుడు ఒక్క మట్టి పూజ లేదు.. చేలో చెయ్యి కడిగిన రోజు లేదు.. కునుకు తీసిన రాత్రి లేదు.. మట్టే కదా అని చులకన, నాడు పంట బంగారంలా పండింది, నేడు బంగారం కోసం తడబడింది.. అర్ధం అయింది తల్లి. నీకు జరిగిన అవమానం ఇంకెన్నడు జరగదు.. నువ్వు పచ్చగా నవ్వితేనే మాకు పండగ.. స్వచ్ఛంగా ఉంటేనే మాకు ఆనందం.. మా పూర్వీకులే నాకు ఆదర్శం. 

ఒక్కసారిగా తుఫాన్ గాలి మొదలయింది.. గింగరాలు తిరుగుతున్న గాలి పొలం లో గడ్డిని.. చిన్న చిన్న మొక్కల్ని పైకి లేపింది.. చెట్లు ఊగిపోతున్నాయి.. సూర్యానికి అయోమయం మొదలైంది.. 

"నాకిది తప్పలేదు సూర్యం.. " అని ఆ తల్లి పలికింది. 

"తల్లి.. క్షమించు.. " అని అరిచాడు.. గాలులు తనని చుట్టూ ముడుతున్నాయి.. దుమ్ముకు కళ్ళు మూసుకుపోతున్నాయి.. గొంతు తడి అదిరింది.. గాలి కింద భూమి అదరడం మొదలు పెట్టింది.. నిలబడలేక పోతున్నాడు సూర్యం. గాలి ఇంకా ఉదృతం అయింది. ఎండిన ఆకులు గాలికి ఎగిరినట్టు సూర్యం గాలిలోకి లేచాడు.. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి.. మేఘాల్లో మెరుపులు మొదలయ్యాయి.. ఆ మెరుపుల గుంపు నుండి ఒక్క మెరుపు సూర్యాన్ని చేసుకోసాగింది.. దాని వెలుగు మరింత తీవ్రం అయింది.. సూర్యం ఆ కాంతిని తట్టుకోలేకపోతున్నాడు.. ఇంకా పైకి ఎగిరాడు సూర్యం.. ఆ మెరుపు అతడిని సమీపిస్తోంది.. ఆ ప్రకాశాన్ని తట్టుకోలేకపోతున్నాడు.. కళ్ళు తట్టుకోలేక 
"అమ్మా ...." అని గట్టిగ అరిచాడు... ఉలిక్కి పడి నిద్ర నుండి లేచాడు సూర్యం. 

(సమాప్తం)

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి