వేశ్య అడిగిన ప్రశ్న 


కోరికలు తీర్చేవాళ్ళు దేవతలైతే  మేమెందుకు దెయ్యాలం ?
సుఖాల వరాలు ఇచ్చేవాడు దేవుడైతే సుఖపెట్టే మేము భూతాలం ? 

అహం మీద ఆకలి గెలిచిన జీవితం మాది 
దేహి మీద దేహం నెగ్గిన జీవితం మాది 

దేశం మారినా దేహం ఒకటే
మనుషులు మారినా కోరిక ఒకటే 

మతం రంగు మాకు అంటదు  
కులం జబ్బు  మాకు రాదు 

జాతి మచ్చలు మాకు లేవు 
జాతి మచ్చలుగా మిగిలాము  

అందరిని ఒకేలా చూసే నీతి మాది 
అందరిని ఒకేలా నడిపే శక్తి మాది 

ఇంత చేసినా.. న్యాయంగా చూసినా 

మీరు మా చెంత చేరితే ఒప్పు 
మేము పక్కన నడిచినా తప్పు 

హక్కులన్న లెక్క లేదు 
పట్టింపుకు దిక్కు లేదు 

రాజ్యాంగంలో పేజీ లేదు 
రాచరికంలో మాపై పేచీ లేదు 

మాకు గుర్తింపు, గౌరవాలు వట్టి మాటలే 
మమ్ము చేర్చిన మాటలు పచ్చి బూతులే 

నిద్రలేని రాత్రులెన్నో 
నిందలతో మింగిన మాత్రలెన్నో 

మా ఆవాసం ఊరి చివరన 
మా అవకాశం పడకగది మూలన 
మా ఆవేశం పోలీసు బూటు అంచున 
మా ఆవేదన ఏ దైవమైనా తీర్చునా ?

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి