Room - ఈ సినిమా చూసారా ?




5 ఏళ్ళ పసి వయసులో తన తల్లిని కాపాడుకున్న "Jack " అనే ఒక పసివాడి కథ. 

టీనేజ్ లో ఒక రాక్షసుడి అత్యాచారానికి బలి అవుతుంది జాక్ తల్లి. వాడు ఆ స్వార్ధానికి తనని వాడుకొని అంతటితో ఆగకుండా ఒక 10 x 10 కొలత గల గదిలో బంధిస్తాడు. 
తిరగబడలేని ఆ అమాయకురాలు వాడి అరాచకానికి నరకం అనుభవిస్తూ ఉంటుంది. ఇలా కొన్నేళ్ళకు జాక్ పుడతాడు. తల్లి కొడుకులని ఇంకా 7 ఏళ్ళ పాటు ఉంచి.. ఆ కామాంధుడు ఆకలి తీర్చుకుంటూనే ఉంటాడు. 

కానీ ఇవేమి జాక్ కి తెలియకుండా తన తల్లి .. మనం ఉన్న ఈ చిన్న గదిలోనే పెద్ద ప్రపంచం ఉందని.. బయటి ప్రపంచం అంత మాయ అని  చెప్పి కొడుకుతో సహా 7 ఏళ్ళ పాటు జైలు జీవితం లాంటి నరకాన్ని అనుభవిస్తూ ఉంటుంది. 



ఒకరోజు జాక్ కి అనుకోకుండా జ్వరం వస్తుంది, ఆ రాక్షసుడు తెచ్చే మందులు సరిపోవని, కొడుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని బ్రతిమాలి, బెదిరించి, గొడవపడి అలసిపోతుంది. కొడుకు వంక చూసి తను పడే చిత్రహింస ఇక కొడుకు పడకూడదని కొడుకుకి అసలు నిజం చెప్తుంది. ఇన్నాళ్లు ఉన్న ఇల్లే ప్రపంచం నిజం అయినప్పుడు.. వేరే ప్రపంచం గురించి నమ్మలేకపోతాడు. 

ఇక్కడి నుండి ఎలాగైనా ఉపాయం ఆలోచించి బయటపడాలని కొడుకుని చనిపోయినట్టుగా నటించమని చెప్తుంది, బ్రతికున్న కొడుకుని చాపలో చుట్టి.. ఆ కిరాతకుడు చేసిన పాపానికి కొడుకు చనిపోయాడని చెప్పి .. బయటకి తీసుకెళ్లి ఖననం చేయమని చెప్తుంది. చుట్టిన చాపని విప్పకుండా అలాగే ఆ దుర్మార్గుడు తన ట్రక్ లో వేసుకొని వెళ్తాడు. 

చాప సందుల్లోనుండి ప్రపంచం లోని ఏ జీవి అనుభవించలేని కొత్త అనుభవాన్ని చూస్తాడు జాక్. పక్షి అరుపులు, సూర్యుడి వెలుగు, చల్లని గాలి.. పసి హృదయం ఒక్కసారిగా ఉద్వేగానికి లోనవుతుంది.. అంతలోనే భయం, ఎక్కువ కాంతిని భరించలేని కళ్ళు.. సాహసం చేసి ఆ ట్రక్ నుండి బయటపడతాడు జాక్. 

ఇది గమనించిన ఆ దుర్మార్గుడు, ట్రక్ ఆపి పిల్లాడిని తిరిగి దొరకబుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు, చుట్టూ జనం గమనించి వాడిని పోలీస్ లకు అప్పగిస్తారు. పోలీస్ ల సహాయంతో తన తల్లిని కాపాడుకుంటాడు. ఆలా బయటికి వచ్చిన తల్లికి .. తన ఇంట్లో ఎలాంటి అనుభవం ఎదురైంది ? ఆపైన ఎం జరిగింది ?? అనేది మీరు చూడాల్సిందే ..!

ఎంతో ఉద్విగ్న భరితంగా మొదలై .. కళ్ళని నీటితో నింపే సన్నివేశాలతో ఈ సినిమా ముగుస్తుంది. ఇలాంటి సినిమా 2015 ఆస్కార్ 4 నామినేషన్ లలో ఉంటూ  , అద్భుతమైన నటన చూపిన Brie Larson కి బెస్ట్ యాక్ట్రెస్ విభాగం లో ఆస్కార్ అవార్డు దక్కింది.



ఈ చిత్రం చూడకపోతే వీలున్నప్పుడు తప్పకచూడండి !

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి