ఓ అజ్ఞాని ఆవేదన - Gollapudi Maruthi Rao


ఓ అజ్ఞాని ఆవేదన
(గొల్లపూడి మారుతి రావు)

ఇన్నేళ్ళొచ్చినా నాకు లోకజ్ణానం పెరగలేదు. పైగా రాజకీయ జ్ణానం బొత్తిగా కలగలేదు. ప్రాంతీయ జ్ణానం బొత్తిగా కలిసిరాలేదు. కనుక ఈ కాలమ్ ని ఓ అజ్ణాని కాలమ్ గా విజ్ణులు చదువుకోవాలని నా మనవి.

చిత్రకారుడు ఎమ్.ఎఫ్.హుస్సేన్ గారు ప్రముఖులు. సాయిబుగారు. మనదేశంలో మనం ముస్లింలను గౌరవించి నెత్తిన పెట్టుకున్నట్టు ముస్లిం దేశాలే చేస్తున్నట్టు కనిపించదు. ప్రముఖ గజల్ గాయకుడు మెహదీ హస్సన్ పాకిస్థాన్ లో అనారోగ్యంతో డబ్బులేక ఆస్పత్రిలో ఉన్నాడని పేపర్లో చదివాను. మన దేశంలో బిస్మిల్లా ఖాన్ భారతరత్న. జకీర్ హుస్సేన్, ఫక్రుద్దిన్ ఆలీ అహమ్మద్, అబ్దుల్ కలాం గారలు మనకు గౌరవనీయులైన అద్యక్షులు. అబ్దుల్ కలాంగారు భారతరత్న.

ఈ హుస్సేన్ గారినీ మన ప్రభుత్వం పద్మభూషణ్ యిచ్చి గౌరవించింది. వీరి ప్రతిభా పాటవాల్ని మెచ్చుకునే అభిమానులూ, intelellectuals ఈ దేశంలో వున్నారు. మంచిదే. 94 ఏళ్ళ ఈ చిత్రకారులు- సరస్వతి, లక్ష్మి, భారతమాతలను నగ్నంగా చిత్రించారు. పోనీ, వీరికి ఆడవాళ్ళు బట్టలిప్పుకుంటే సరదాయేమో అని సరిపెట్టుకుందామనుకుంటే- వాళ్ళమ్మ, మదర్ ధెరిస్సా, ఇందిరా గాందీలకు బట్టలుంచారు. ఈ దేశంలో కోట్లమందికి లక్ష్మి, సరస్వతి తల్లికంటె ఎక్కువని ఈ పద్మభూషణులకు తెలియదనుకోవడం తెలివితక్కువతనం.

కొందరు ఉద్రేకపడి ఆయన చిత్రాల్ని చించారు.ఆయన ప్రదర్శనల్నిఆపారు. ఓపికచాలదుకాని నేనూ ఒకరాయిని వేసేవాడిని.

డేనిష్ పత్రికలలో అల్లా గురించి రాస్తేనే (నేనా పత్రికలు చూశాను. అవి ఎందుకు ఆక్షేపణీయాలో నాకయితే అర్ధం కాలేదు) వాటిని చూడని, చదవడమయినా రాని చాలామంది ప్రపంచంలో ఎన్నో దేశాలలో కార్లు తగలెట్టారు. ఇళ్ళు ధ్వంసం చేశారు. ఊరేగింపులు చేశారు. అప్పుడు ఈ ఉద్యమకారులను గర్హించే పెద్దలు ఏమయారు? అప్పుడు నోరెత్తితే వీరి ఇళ్ళూ కూలుతాయని వీరికి బాగా తెలుసు. "బాబూ, ముస్లిందేవుళ్ళ పాటి చెయ్యరా మా దేశంలో మా లక్ష్మీ సరస్వతులు. పోనీ. మతం ఓ పార్టీ సొత్తు అనుకుంటే. మా భారతమాత?’’ అని ఒక్కరయినా హుస్సేన్ సాహెబ్ గారిని అడగరేం?

హుస్సేన్ గారి మేధావి న్యాయవాది టీవీలో మతఛాందసుల ముష్కర ప్రవర్తనమీద విరుచుకు పడ్డారు. భేష్. అటువంటి న్యాయం, విచక్షణ మనదేశంలో హర్షణీయమే. తనువేసిన బొమ్మలు గర్వపడే చిత్రాలే అయితే- హుస్సేన్ గారు ఎందుకు నోరిప్పరు? కబీర్ గీతాల్ని ఆనందంగా పాడుకునే ఈ దేశం ఆయనని ఎందుకు గర్హిస్తోందో ఆయనకి తెలియకుండానే దుబాయ్ లో తలదాచుకున్నారని అనుకోను. ఈ దేశంలో ప్రభుత్వం, మేధావి వర్గం, కళానిపుణులు, కళారాధకులు హుస్సేన్ వంటి మహానుభావులు విదేశాల్లో వున్నందుకు జుత్తు పీక్కొంటున్నారు? "మా దేవుళ్ళ చిత్రాలు ఇలా వేయడం సబబా? కొన్ని కోట్లమంది sensitivities ని దెబ్బకొట్టిన మీకు ముఖం చెల్లడంలేదంటే తప్పా? మా లక్ష్మీ దేవి, సరస్వతి మీ అమ్మపాటి మర్యాదకి నోచుకోలేదా?’అని ఆ సాయిబుగారి ఒక్క వెంట్రుకయినా పీకరేం? భారతదేశంలో భారతమాతనే బట్టలిప్పినిలబెట్టిన చిత్రకారుడిని ఆరాధించే ఆత్మవంచన ఈ దేశానికి తగునా?

కంచిస్వామిమీద నేరారోపణ జరిగినంత మాత్రాన బెయిల్ కూడా నిరాకరించి ఆయన్ని 40 రోజులు జైల్లో పెట్టారు. భేష్. ఈ న్యాయ వ్యవస్థని చూసి నేను గర్వపడతాను. అయితే హత్యలు జరిపిన సినీనటులు, మాదక ద్రవ్యాలు విరివిగా మింగి తన సహచరుల చావులకు కారణమైన నాయకుల సుపుత్రులు, తుపాకులు పేల్చిన సినీనటులు, ప్రియురాళ్ళతో వేటలు జరిపి, ఆంక్షలున్న జంతువులను చంపి ఒక్కరాత్రికూడా జైలుకెళ్ళకుండా తప్పించుకున్న ఖరీదయిన నేరస్థుల దేశం మనది.

ఈ మధ్యనే తెలుగు దేశంలో ఓ ఇంగ్లీషు బడిలో (మైదుకూరులో సెంట్ జోసెఫ్ కాన్వెంట్)లో తెలుగులో మాట్లాడిన ఓ కుర్రాడిని "తెలుగు మాట్లాడను’ అను బోర్డు మెడలో వేలాడేసి ఓ ఉపాధ్యాయ ప్రముఖుడు ఊరేగించాడట. మనం ఏ అడవుల్లో వున్నాం? ఏ రాతియుగంలో వున్నాం? నేను కనీసం రెండు దిన పత్రికలకు ఫోన్ చేసి - ఈ దుర్మార్గం మీద ఓ ఉద్యమం నడపండి. చూస్తూ ఊరుకుంటారేం? అని ఆవేశ పడ్డాను. ఓ పత్రిక వెంటనే 15 మంది ప్రముఖుల ఖండనల్ని ప్రకటించింది. ఈ ఉపాధ్యాయుడు ఇంకా బోర విరుచుకుని తెలుగు దేశంలో తిరుగుతున్నాడు. ముస్లిం దేశాలలో అయితే ఈ పాటికి ఓ హత్య జరిగేది. తెలుగు జాతి గాజులు తొడిగించుకుందని ఈ పాటికే ఈ ఉపాద్యాయుడు రహస్యంగా ఆనందిస్తూ ఉండి ఉంటాడు. ఈ ఉపాద్యాయుడిని భేషరతుగా దేశ ద్రోహ చట్టంకింద అరెస్టు చేసి రోడ్ల మీద ఊరేగించవద్దా? ముందు ముందు మరో భాషా ద్రోహికి ఈ అలసత్వం మార్గదర్శకం కాదా?తెలుగుకి జాతీయ భాషగా గుర్తింపు రావాలని గుండెలు బాదుకున్న భాషాభిమానులు పత్రికలు చదవడం లేదా?వారు ఏ ఉపగ్రహాలలో జీవిస్తున్నారు? ఈమాత్రం భాషాభిమానం లేని ఈ "నపుంసక’ రాష్ట్రం రేపు (ఈ కాలమ్ ని అక్టోబరు 31 న రాస్తున్నాను.)ఈ దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల విభజనకు ముందున్నందుకు బోర విరుచుకోబోతోంది. ఎందుకొచ్చిన గర్వం ఇది?

ఏం దరిద్రం పట్టింది మన స్వాభిమానానికి? Intellectual hypocrisy is taken for granted as permissiveness to bigotry- in this country.

నేను తెలుగు దేశంలో లేనందుకు ఇన్నాళ్ళూ ఆనందించాను. ఇప్పుడిప్పుడు ఇంకా భారత దేశంలో ఉండక తప్పనందుకు విచారిస్తున్నాను.

ఇన్నేళ్ళొచ్చినా నాకు లోకజ్ణానం పెరగలేదు. పైగా రాజకీయ జ్ణానం బొత్తిగా కలగలేదు. ప్రాంతీయ జ్ణానం అస్సలు కలిసిరాలేదు. కనుక ఈ కాలమ్ ని ఓ అజ్ణాని కాలమ్ గా విజ్ణులు చదువుకోవాలని నా మనవి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి