దేవుడమ్మ దేవుడు మాయదారి దేవుడు
మనిషి 

భూమిని గెలిచాడు 
నింగిని గెలిచాడు 
నిప్పుని గెలిచాడు 
నీటిని గెలిచాడు 
గాలిని గెలిచాడు 
ఆశని గెలిచాడు 
ఆశయాన్ని గెలిచాడు 

కానీ ఆకలి ? అక్కడే దేవుడు గెలిచాడు.. 

దేవుడు.. 

ఎక్కడ ఓడిపోతాడన్న భయం వాడికి. 
అందుకే మనిషి కి గెలుపుతో పాటు 
ఆకలి ఇచ్చాడు 
అహాన్ని ఇచ్చాడు 
అసూయని ఇచ్చాడు 
కొట్టుకు చావండిరా అని కులాన్ని ఇచ్చాడు 
చంపుకు తినండిరా అని మతాన్ని ఇచ్చాడు 
కలిసిపోతారెమో అని ఒంటి రంగునిచ్చాడు 

వీటిని గెలవడానికి మనిషి ప్రేమ, స్నేహం అని ఆయుధాలు పట్టాడు..  
మళ్ళీ ఈ మాయదారి దేవుడికి భయం వేసింది.. ఎందుకన్నా మంచిదని డబ్బు జబ్బు కనిపెట్టాడు 
దానిని గెలవడానికి మనిషి 'గుణం' అనే బాణానికి పదును పెట్టాడు.  

అక్కడితో ఆగితే దేవుడెందుకు అవుతాడు.. అందుకే  వాడు శకునం చూసి మరీ 'భయం'  అనే బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. 

ఇక అక్కడి నుండి.. మనిషి మనిషిలా లేడు... ప్రతి దానికి భయమే.. 

చీకటంటే భయం 
వెలుగంటే భయం
ఇల్లు దాటినా భయం 
కళ్ళు మూసినా భయం  
డబ్బులేదంటే భయం 
డబ్బులెక్కువైతే భయం 
నిన్నటి జ్ఞాపకం భయం 
రేపటి భవిష్యత్తు భయం 

ఇలా అన్నిటికీ భయపడే మనిషి .. నమ్మకం ఉంటే దానిని గెలవచ్చు అనుకున్నాడు.. 
కానీ నమ్మకాన్ని దారి కనపడలేదు.. ఒకడు భక్తి అంటాడు.. ఇంకోడు నువ్వే శక్తి అంటాడు.. 

కానీ దేవుడు నేనే గెలిచా అంటాడు. 
దేవుడమ్మ దేవుడు మాయదారి దేవుడు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి