నేను - దేవుడుఆదివారం, అప్పుడే అమ్మ పెట్టిన ఆవకాయ అన్నం నెయ్యి వేసుకొని, ఒక రౌండ్ లాగించాక, టమాటా పప్పు గుమ్మడికాయ వడియాలు ఎక్కడ అలుగుతాయో అన్న భయంతో ఒక పట్టు పట్టి, కమ్మని పెరుగుతో భోజనానికి తాత్కాలిక సెలవు పెట్టి, ఇంటి వరండా వైపు కదిలా.. 

ఇంతలో "ఒరేయ్ గిరి !" అమ్మ పిలిచింది, 
"ఎన్నాళ్ళైందో ఇంటికొచ్చి మంచి భోజన చేసి, వచ్చినప్పుడు దిష్టి తీయలేదు, తీస్తానాగు" అంటూ వంటింట్లో కల్లు ఉప్పుతో వచ్చింది 

" ఇరుగు దిష్టి .. పొరుగు దిష్టి 
ఊరంతా దిష్టి.. ఊరవతల దిష్టి 
నవ్వినోళ్ల దిష్టి ..నవ్వనోళ్ల దిష్టి 
పొగిడినోళ్ళ దిష్టి .. పొగడనోళ్ళ దిష్టి 
కుళ్ళు మింగిన కళ్ళ దిష్టి 
నసుక్కున్న నోళ్ళ దిష్టి "

అని దిష్టి మంత్రం చదివి  చేతిలో ఉన్న ఉప్పులో  "తు.. తు"  ఉమిసి వెళ్ళిపోయింది. అమ్మ అంతే కొడుకంటే ప్రాణం, నాకు అమ్మ అన్న కూడా. 

ఈ గిరికి 23 వయసు రాగానే హైదరాబాద్ లో  అందరూ కోరుకున్నట్టే, ఒక software ఉద్యోగంలో చేరిపోయా. బ్రహ్మచారి జీవితంలా, ఆరకొర గా తినడం, అజీర్తి అయితే ఏడవడం 
వంటింట్లో కష్టాలు, శని ఆదివారాలు హోటల్లో ఇష్టాలు. ఇదిగో అప్పుడప్పుడు అమ్మ చేతి వంట కోసం పండగ ప్రయాణాలు. ఉగాది కోసం అని నిన్న రాత్రి ఇంటికి చేరా. నడి రాతిరిలో వచ్చా కదా రాత్రి నుండి దాచిన ప్రేమ ఒక్కసారిగా ఇదిగో ఇలా చూపించేస్తుంది, అంత రాత్రి ఎందుకు అయిందంటే మా బస్సు డ్రైవర్ పుణ్యం వలన అదో  కథ. వినే ఓపిక మీకున్న చెప్పే సహనం నాకు లేదులెండి.


వరండాలో ఉన్న కుర్చీలో ఉన్న ఈనాడు అదివారం పుస్తకం చదువుతూ నిద్రా దేవి ఆవహించి రెప్పలు మూత పడుతున్న సమయంలో ,  బయట నుండి గేట్ చప్పుడైంది. నాన్న 
ఏరా నిద్ర వస్తే వెళ్లి లోపల పడుకోరా బయట గాలి దుమ్ము లో ఎందుకు అనేసి లోపలి వెళ్ళిపోయాడు. విన్నట్టే తల ఊపినా నిద్ర దేవి వరానికి బానిస అయ్యే క్రమంలో ఉండగా. 

"ఒరేయ్ గిరి.. రేపు పొద్దున్నే లేదా గుడికి వెళ్లి కళ్యాణం చేయించాలి, నాలుగుగంటలకు లేవాలి సరేనా.. " అని అమ్మ, దానికి నేను "అంత పొద్దున్నేనా ? ఎందుకమ్మా "  
"ఉగాది కదరా, పండగకోస్తే స్వామీ వారి కళ్యాణం చేయిస్తా అని మొక్కున్నా రా ! "
"పండగకి వస్తే మొక్కేంటి అమ్మ, నీ పిచ్చి కాకపోతేను.. "
"మన చుట్టూ మనలని ప్రేమించేవాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు ఉంటేనే ఆనందం రా, అలా ఉంటేనే కదా పండగ,  నువ్వెక్కడో నెలల కొద్దీ అక్కడ ఉంటే మాకు ఆనందం ఎక్కడిది రా, నువ్వొస్తే సంతోషం ఆ సంతోషం దేవుడితో ఇది ఇలా పంచుకుంటేనే నాకు తృప్తి " అని అమ్మ కళ్ళు చెమర్చుకొని లోపలికి వెళ్ళింది. 

నాకు మాట రాలేదు. నిజంగానే అమ్మ నాన్నలని నేను ఉద్యోగం సంతోష పెట్టానా ? దూరంగా ఉంది బాధ పెడుతున్నానా అని అర్ధం కాలేదు. 

"అర్ధం అయ్యేలా నన్ను చెప్పమంటావా? " అని గొంతు వినపడింది, వినడానికి గంభీరం గా ఉన్న ఎంతో హాయిగా అనిపించింది. ఆ గొంతులో ఆత్మవిశ్వాసం వినపడుతుంది. నేనున్నా అన్న ధైర్యం తెలుస్తుంది. 

"ఎవరు ?" నేను, కొద్దిగా భయపడుతూ.

(సశేషం)

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి