ప్రేమ - గెలుపు - ఐశ్వర్యంఒక పల్లెలోని ఒక ఇంటికి అపరాహ్న వేళ, అలసిపోయిన ముగ్గురు పెద్దమనుషులు వచ్చారు. అప్పుడే పొలం నుండి వచ్చిన భర్తకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, వీధి తలుపు మూద్దామని బయటికి వచ్చిన ఆ ఇంటి ఇల్లాలికి వసారాలో అరుగు మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న ఆ ముగ్గురు కనిపించారు. 

వాళ్ళు బహుశా తన భర్తతో పాటు వచ్చిన వాళ్ళేమో ననుకొని, భోజనం సమయానికి వచ్చారని, చాలా మర్యాదగా "లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి భోజనం చేద్దురు కానీ..." అన్నది.

వాళ్ళు ఆమెవంక సాదరంగా చూస్తూ, "మాకొక నియమం వున్నది. మా ముగ్గురిలో ఒకడు మత్రమే మీ ఇంట్లోకి వస్తాడు. నా పేరు 'ప్రేమా, ఇతని పేరు 'గెలుపూ, ఇతని పేరు 'ఐశ్వర్యం'.


 మీ ఇష్టం వచ్చిన వారిని ఆహ్వానించండి." అన్నాడు. ఆ ఇల్లాలు మొదట ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకొని, ఆ వచ్చిన వారు మాములు మనుషులు కారని ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న మహానుభావులని అనుకొన్నది.ఆమె సంతోషంతో పొంగిపోతు ఇంట్లోకి వెళ్లి, ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. 

అది వినగానే ఆమె భర్త పరమానందంతో "జీవితంలో మనిషికి గెలుపే ముఖ్యం.. కాబట్టి గెలుపునే పిలుద్దాం" అన్నాడు.

దానికి ఆమె "గెలుపు ఒకటే ఏమి లాభం, ఐశ్వర్యం లేకపోయేక... కాబట్టి ఐశ్వర్యాన్ని ఆహ్వనిద్దాం" అన్నది.
వీరిద్దరి మాటలు వింటున్న వారి కోడలు, " గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ గొప్పది. 


ఒక కుటుంబంలోని భార్యా, భర్తా, పిల్లలు, అత్తా, కోడళ్ళు అందరూ కలిసి మెలసి ఎటువంటి అరమరికలు లేకుండా ఉండగలగడానికి ప్రేమ మాత్రమే మూలాధారం మనిషి సుఖజీవనానికి ఆలంబన ప్రేమ మాత్రమే! కాబట్టి ప్రేమను ఆహ్వానించండి" అంటూ సలహ ఇచ్చింది.

వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి మీలో ' ప్రేమ ' అనే వ్యక్తి లోపలికి రావచ్చు అన్నాడు. ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. ప్రేమ వెనకే గెలుపు, ఐశ్వర్యం కూడా అతనితో బాటు ఇంట్లోకి వచ్చారు. ఇది చూసి అందరికీ అమితమైన ఆశ్చర్యం కలిగింది.


వారి ఆశ్చర్యానికి సమాధానంగా ప్రేమ అనే వ్యక్తి ఇలా చెప్పాడు. "మీరు, గెలుపును కానీ, ఐశ్వర్యం కాని కోరుకొని వుంటే, ఆ ఒక్కడు మాత్రమే లోపలి వచ్చేవాడు. మిగతా ఇద్దరం బయటే ఉండిపోయే వాళ్ళం. అలా కాకుండా మీరు ప్రేమను ఆహ్వానించారు. ఏ కుటుంబంలో అయితే ప్రేమ ఉంటుందో అక్కడ, గెలుపు, ఐశ్వర్యం అంటిపెట్టుకొని వుంటాయి." అన్నాడు.


కోడలు సలహా పాటించి నందుకు తమకు మంచే జరిగిందని సంతోషించి, వాళ్ళు ఆ ముగ్గురికి, ఎంతో ప్రేమతో అతిథిమర్యాదలు చేశారు. ఆ రోజు నుండి ఆ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. మనుషుల మధ్య అరమరకలు తొలగిపోయాయి. 


అపార్థాలకు తావు లేదు. ఒకరంటే ఒకరికి గౌరవం, ప్రేమ, వాత్సల్యం, భక్తీ. ఆనతికాలం లోనే ఆ కుటుంబం అన్ని విధాలుగా ఆ పల్లెకు తలమానికమైంది. 
ఈ కథకు బొమ్మను వేసినది ప్రముఖ చందమామ చిత్రకారులు "సునీతా వాసు". 
ఇది సేకరించి సంస్కరించిన కథ - దాసరి వెంకటరమణ

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి