స్వర్గ సుందరి - శ్రీదేవి


దివి నుండి భువికి దిగిన అందం తనది 
సాటి లేని అభినయం తనది 

అప్పట్లో వయసొచ్చిన అమ్మాయి అచ్చం శ్రీదేవిలా ఉన్నావంటే ఎంతో మురిసిపోయేదో. ఏ ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకున్నా శ్రీదేవి గురించి తలచుకోకుండా ఉండేవాళ్ళు కాదు. అందానికే తానొక కొలమానం, తలమానికం.  

నాకు ఊహ తెలిసిన నాటి నుండి అందగత్తె అంటేనే శ్రీదేవి. తరవాతే ఎవరైనా. తెలుగు క్యాలెండరులు, పౌడర్ డబ్బాల మీద, న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డుల మీద, టపాసుల పెట్టెల మీద, మా ఊర్లో రిక్షా లు ఉండేవి, వాటి మీద శ్రీదేవి బొమ్మ సహజం. ఏ పెయింటర్ దేవత బొమ్మ కావాలంటే శ్రీదేవినే గీసేవాడు. ఎందుకంటే అంత కన్నా గొప్ప దేవత లేదని అందరికి తెలుసు. 

ఇలా ఎక్కడ చుసినా తన అందం చుట్టూ ఉండేది. చుట్టేస్తూ ఉండేది.. 

" ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ 
   పరవశాన పంచవమ్మా పాల సంద్రమా 
   అందమా అందుమా అందనంటే అందమా "

" పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు 
  రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో 
  అసలు భూలోకం చూసి ఉంటాడా 
 కనక ఈ చిత్రం స్వర్గానికి చింది ఉంటదా" 
" యమహో నీ యమా యమా  అందం 
  చెలరేగింది ఎగా దిగా తాపం "

" కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి 
  చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి "

ఇలా కవులెందరో తన అందానికి పరవశించారు, పోలిక పొగడ్తలతో ప్రవహించారు. 


ఇంత అందం ఉంది మరి నటనో అనుకుంటే, తన నటన చిన్న పిల్లాడికి సైతం తన అర్ధం అవుతుంది.
అంత గొప్ప సహజ నటి. ఆ నటనా శిఖరానికి ఈ కింద వీడియో చిన్న ఉదాహరణ. తన నటనకు భాష బేధం లేదు, ప్రాంతీయ భేదం లేదు.  అసలు పోలిక లేదు..  పోటీ లేదు.. పొగడ్తకు సరిపడా భాష లేదు.  మన ఇంట్లో మనిషిలా ఉంటుంది, మన మధ్యే ఉన్నట్టు ఉండేది. కానీ ఉన్నట్టు ఉండి మన మధ్య లేకుండా వెళ్ళింది. దేవుడు మంచి వాళ్ళని ఎత్తుకు పోతున్నాడు, పాపులను ఎం చేసుకోను అని అనుకుంటున్నాడేమో. లేక తనని తీసుకెళ్తా అంటే మనం ఊరుకోమని వాడికి తెలిసిపోయింది. అందుకే నిద్ర మాటున మోసం చేసాడేమో. ఎంతైనా తెలివైన వాడు. కన్నీళ్ళకి  తెలిసిపోయింది చివరి చూపుగా చూస్తా అంటూ బయటికి వచ్చేస్తున్నాయి. సాటిరాని అందానికి న్యాయం చేసింది,

పోటీలేని నటనకు న్యాయం చేసింది,

ఇద్దరి కూతుళ్లతో కుటుంబానికి న్యాయం చేసింది, 


ఇలా 54 కే తొందరపడి అన్యాయం చేసింది


ఎంత స్వర్గానికి చెందిన చిత్రమైతే మాత్రం ఇంత తొందరగానా వెళ్ళేది  ?? 
- మీ అభిమాని 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి